PRC Katha




మిత్రమా!
మనం మోసపోయామా? కావచ్చు. అంతా ఆటలో భాగమే. నో రిగ్రెట్స్.

శాపనార్ధాలొద్దు. ఆర్తనాదాలు అసలే వద్దు. ఏముంది వాటి వల్ల ప్రయోజనం?

గతంలో లేనివి ఈ పి ఆర్ సీ సందర్భంగా ఏం సాధించాం మనం? 

బహుశా ఏమీ సాధించలేకపోయాం.ఉన్నవి కూడా పోగొట్టుకున్నాం.  

62పదవీ విరమణ మనం సాధించుకున్నది కాదు, అసలు మనం కోరినదీ కాదు,తమ వెసులుబాటు కోసం ప్రభుత్వం తనంత తానుగా కొసరినదే. 
 
గత పోరాటాల ఫలితంగా సాధించుకున్న హక్కులను, అలవెన్సులను నిలుపుకోలేకపోయాం. ‘ప్రస్తుత ఆర్ధికస్థితి’ బాగోలేదని చెబుతూ ‘శాశ్వత నష్టం’ కలిగేలా చేసిన మార్పులను అడ్డుకోలేక పోయాం. 

సీ పీ ఎస్ సోదరులకు చేసిన వాగ్దానం సంగతేమిటని గట్టిగా అడగనైనా అడగలేకపోయాం. (కాకపోతే ఒకటి. “మీకు పెంచాం. కావాలంటే పే స్లిప్పులు చూసుకోండి” అని ఎవడూ అనడేమో ఇప్పుడు.)

ఈ సందర్భంగా మనకెదురైన అనుభవాలు అమూల్యమైనవి.వాటినుంచి పాఠాలు నేర్చుకోవాలి.

నువ్వు ప్రశ్నించడం మొదలుపెట్టగానే నీ నైతికతను చర్చల్లోకి లాగారు చూశావా? ఎక్కడో బీహార్ చత్తీస్గడ్ లలోని ఫోటోలను తీసుకొచ్చి ఇక్కడి టీచర్లపై ద్వేషం పెంచాలని చూశారు చూశావా? తమకు అనుకూలంగా వీడియోలను కత్తిరించుకుని ప్రచారంలో పెట్టారు చూశావా? కేవలం ప్రచారంతో, వాలంటీర్లతో పోస్టర్లూ కరపత్రాలూ పంపిణీ చేయించి మరీ ‘తగ్గింపును పెంపుగా’ బుకాయించాలని చూశారు చూశావా? 

వాట్సప్ యూనివర్సిటీ ద్వారా మతమౌఢ్యాన్ని తలకెక్కించి మధ్యయుగాల్లోకి తీసుకెళ్ళాలని చూస్తున్న వాళ్ళు మొదలుపెట్టిన IT సెల్ పద్ధతే ఇది. వాళ్ళకీ వీళ్ళకీ ఆ ఐడియాను అమ్మినవాడొక్కడే.ఇక నుంచైనా ఆ వాట్సప్ యూనివర్సిటీని నమ్మడం మానివేద్దాం.తమకు లాభదాయకమైన రీతిలో జనాలను నమ్మించే ఫాసిస్టుల వ్యూహాలను అర్ధం చేసుకుందాం.

వేళకు పనికి వెళ్ళడం,పనిని శ్రద్ధగా చేయడం విషయంలో రాజీ పడకూడదు.మనల్ని వేలెత్తి చూపే అవకాశం ఎవ్వరికీ ఇవ్వకూడదు.

అన్నిటికంటే ఘోరం ఓట్ల అమ్మకం మీద వచ్చిన ఆరోపణలు.అలాంటి సిగ్గుమాలిన పనులు మనలో ఎవ్వరూ ఎప్పుడూ చేయకూడదు.

అసమానతలు పెరిగిపోతోంటే ‘మన దాకా రాలేదులే’ అని చూస్తూ ఊరుకోవడం ప్రమాదకరమని ఇప్పుడైనా అర్ధం చేసుకుందాం. ఆ అసమానతలను అడ్డం పెట్టుకునే సమూహాల మధ్య పోటీ పెట్టి మనపై ద్వేషం పెంచే ప్రయత్నం చేశారు చూశావా?

మనతో కలిసొచ్చిన కార్మిక సంఘాల పట్ల కృతజ్ఞత కలిగిఉందాం.కలిసి నడుద్దాం. 

రోడ్డు వెంట నినాదాలమై మనం నడుస్తోంటే వరుసగా నిలబడి మంచినీళ్ళిచ్చారే,వాళ్ళూ అసలైన మనుషులు.మన బడి పిల్లల తల్లిదండ్రులు.వాళ్ళకు చదువు చెప్పనీయకుండా చేసే చెత్త విధానాలను, నానా రకాల యాప్ లను,బోధనేతర,క్లరికల్ పనులను సాధ్యమైనంత గట్టిగా ప్రతిఘటిస్తూనే సాధ్యమైనంత బాగా వాళ్ళ పిల్లలకు చదువు నేర్పుదాం.

“అయితే మోసం సంగతి? రగులుతున్న మంట సంగతి?” 

“ఆ మంటనలా రొంటిన ఉంచుకోవడమే మంచిది. కాలం మనకూ ఒక అవకాశమిస్తుంది.” 

“నిర్బంధాన్ని ఎదిరిస్తూ ఒక్కొక్కరు ఉప్పెనలా రోడ్ల మీదికి ఉబికొచ్చిన సంగతి?” 

“అది ఎప్పటికీ స్ఫూర్తిదాయకమే. ఆ జ్ఞాపకాలను పదిలంగా దాచుకోవడమే మంచిది. ‘రాత్రికి రాత్రే విప్లవాలు నిర్మించబడి, కొనసాగవు. లక్షలాదిగా ఒక రోజు పోటెత్తడం, ధిక్కారానికి ఎదురొడ్డడం గొప్పదే, కానీ అది మాత్రమే ఫలితాన్ని ఇవ్వదు’ అనడానికి సాక్ష్యంగా పనికొస్తుంది.”
 
“మరి ఆ నలుగురు నాయకుల సంగతి?” 
“ఎవరు వాళ్ళు? "

Comments

Popular posts from this blog

ఇండియాలో_ఆక్సిజన్_వదిలే_ఆవులున్నాయా

Control over NSE