పాలకుడెలా ఉండాలి? (మహాభారత కథ)
పాలకుడెలా ఉండాలి? పాండవులు, కౌరవులతో కురుక్షేత్రం లో యుద్ధం చేశారు. కౌరవులవైపు పోరాడిన భీష్ముడు బాగా గాయపడినాడు పాండవుల చేతిలో. కౌరవులెవరూ ఆయన్ను పట్టించుకోలేదు. పాండవ మధ్యముడు అర్జునుడు తనకు తాతైన భీష్ముని అంపశయ్యపై పడుకోబెట్టినాడు. అంపశయ్య అంటే బాణాలతో నిర్మించిన ఒక మంచం . భీష్ముడు చాలా అనుభవజ్ఞుడు కాబట్టి ఆయన దగ్గర నుంచి కొన్ని రాజనీతి విషయాలు నేర్చుకోవచ్చని పాండవుల్లో మొదటివాడైన ధర్మరాజు ఆయన దగ్గరకు వెళ్లాడు. ధర్మరాజు భీష్ముని కొన్ని సందేహాలుఅడుగుతానన్నాడు. భీష్ముడు అంత బాధలోనూ వాళ్ళ మీద ఉన్న ప్రేమతో సరే నన్నాడు. “ప్రజలకు రాజు తప్పనిసరిగా ఉండాలా? తాతయ్యా?” అడిగాడు ధర్మరాజు. “ధర్మా! పూర్వం రాజు లేని రోజులు ఉండేవి. అందరూ ఉమ్మడిగా ఉండేవారు. ఎవరైనా తప్పుచేస్తే ఒక విచారణ సంఘం ఉండేది. వారంతా కలిసి దండన విధించేవారు. ఆ సంఘానికి ఒక పెద్దను ఏర్పాటుచేసుకునేవారు. ఆపెద్దే కాలక్రమంలో ఆ గణానికి (గ్రూపుకు) అధిపతి అయినాడు. అతనిని గణాధిపతి అని పిలిచేవారు. ఇలాంటి గణాధిపతులు ఒకరినొకరు కలహించుకోనేవారు...