పాలకుడెలా ఉండాలి? (మహాభారత కథ)


పాలకుడెలా ఉండాలి?

                
పాండవులు, కౌరవులతో కురుక్షేత్రం లో యుద్ధం చేశారు. 
 కౌరవులవైపు   పోరాడిన భీష్ముడు బాగా గాయపడినాడు పాండవుల చేతిలో. కౌరవులెవరూ ఆయన్ను పట్టించుకోలేదు. పాండవ మధ్యముడు అర్జునుడు తనకు తాతైన భీష్ముని అంపశయ్యపై పడుకోబెట్టినాడు. అంపశయ్య అంటే బాణాలతో నిర్మించిన ఒక మంచం .

భీష్ముడు చాలా అనుభవజ్ఞుడు కాబట్టి ఆయన దగ్గర నుంచి కొన్ని రాజనీతి విషయాలు నేర్చుకోవచ్చని పాండవుల్లో మొదటివాడైన ధర్మరాజు ఆయన దగ్గరకు వెళ్లాడు.

ధర్మరాజు భీష్ముని కొన్ని సందేహాలుఅడుగుతానన్నాడు. భీష్ముడు అంత బాధలోనూ వాళ్ళ మీద ఉన్న  ప్రేమతో సరే నన్నాడు.

“ప్రజలకు రాజు తప్పనిసరిగా ఉండాలా? తాతయ్యా?” అడిగాడు ధర్మరాజు.

“ధర్మా! పూర్వం రాజు లేని రోజులు ఉండేవి. అందరూ ఉమ్మడిగా ఉండేవారు. ఎవరైనా తప్పుచేస్తే ఒక విచారణ సంఘం ఉండేది. వారంతా కలిసి దండన విధించేవారు. ఆ సంఘానికి
ఒక పెద్దను ఏర్పాటుచేసుకునేవారు. ఆపెద్దే కాలక్రమంలో ఆ గణానికి (గ్రూపుకు) అధిపతి అయినాడు.
అతనిని గణాధిపతి అని పిలిచేవారు. ఇలాంటి గణాధిపతులు ఒకరినొకరు కలహించుకోనేవారు.
వాళ్ళలో బలవంతుడే వీళ్ళందరికి పెద్ద అయినాడు. అతనినే ఇప్పుడు రాజు అంటారు. ఆ విధంగా మనువు కూడా ఒక రాజే. ఆయన సమాజానికి కొన్ని నియామాలు పెట్టినాడు. అయితే
అవి కాలక్రమేణా పరిస్థితులను బట్టి మారిపోతున్నాయి. ప్రజలు సక్రమంగా తమ పనులుచేసుకోవడానికి రాజు అవసరమైనాడు. సమాజంలో వ్యభిచారాలు, దొంగతనాలు, దోపిడీలు జరిగినప్పుడు శిక్షించడానికి రాజు అవసరమైనాడు.” అని సమాజ గమనాన్ని వివరించాడు భీష్ముడు.

“రాజు ఎలాంటి పాలన చేస్తే ప్రజలు సుఖంగా ఉంటారు?” అడిగాడు ధర్మరాజు.

“రాజు ప్రజలతో చిరునవ్వుతో మాట్లాడాలి. తన స్వంత సుఖం చూసుకోకుండా, స్వలాభం
చూసుకోకుండా ప్రజలను పాలించాలి. రాజ్యం నడపడానికి ప్రజల నుంచి పన్నులు వసూలు
చేయాలి. కాకపోతే పీడించి వసూలు చేయరాదు. ప్రజల సమస్యలను తెలుసుకొని దానికి తగినట్లు చర్యలు తీసుకోవాలి. ప్రజల మధ్య తగవులు వస్తే వాటిని ధర్మమార్గంలోనే విచారణ
చేయాలి. అలా చేస్తే నిందలు రావు. పాపమూ రాదు”.

“రాజుకు ఎలాంటి స్నేహితులుండాలి?”

“మంచి స్నేహితులు సిరిసంపద లాంటివాళ్ళు. అన్నదమ్ములను చాతుర్యంతో తన దగ్గర వుంచుకోవాలి. స్నేహితులను నమ్మడం, నమ్మకపోవడం రెండూ ప్రమాదమే. అందువల్ల రెండూ ఉండాలి”.

“రాజు తన ధనాగారాన్ని ఎలా వృద్ధిచేసుకోవాలి?”

“రాజు తన ఉద్యోగబృందంలో నమ్మకస్థులైన వారిని నియమించుకోవాలి.
ప్రజాధనాన్ని వృధాగా ఖర్చుచేయరాదు. ప్రజల నుంచి పన్నులు వసూలు చేసుకోవాలి. వచ్చిన ధనాన్ని ప్రజల కోసం ఖర్చుచేయాలి.”

“ప్రజల తగువులు ఎలా తీర్చాలి?”

“ప్రజల సమస్యలను పక్షపాతం లేకుండా మొదట తగువును వినాలి. ధర్మమార్గంలో విచారణ చేయాలి. అలాచేస్తే రాజుపై నిందలురావు. పాపం రాదు”.

“ధర్మమూ, అర్థమూ, కామమూ వీటిల్లో ఏది ముఖ్యమైనది?”

“ధర్మమే ముఖ్యం. మిగతావి తరువాత కిందకు వస్తాయి. అయితే మూడింటిని సమంగా చూసేవాడు ఉత్తముడు.”

“లోకంలో ధనికులూ, పేదలూ రెండురకాలు ఉన్నారు. వాళ్ళలో సుఖంగా వుండేవాళ్ళు ఎవరు?”

“పేదరికం మహా చెడ్డది. ఎవరైనా పేదరికంలో పుట్టవచ్చుగాని పేదరికంలో మరణించరాదు. పేదరికంలో ఉన్న వారికి కష్టాలు తప్పని సరిగా ఉంటాయి. లోకంలో ఇతరులు వారిని హీనంగాచూస్తారు. అయితే పేదరికంలో ఉన్నవాడు ఏపని చేయడానికైనా సిద్ధంగా ఉంటాడు. అదే ధనవంతుడు అలాకాదు. ధనవంతునికి సుఖం పుష్కలంగా ఉంటుంది. కానీ మనశ్శాంతి కరువే.
ధనవంతుడు మనశ్శాంతితో ఉండాలంటే పేదలకు సహాయపడటం ద్వారా ఉండవచ్చు. అప్పుడు పేదలు ఎప్పుడూ ధనవంతుని కనుసన్నల్లో ఉంటారు. ధనవంతునికి ఎప్పుడూ సహాయకారిగా కూడా ఉంటారు.”

“మనిషి దరిద్రుడెలా అవుతాడు? ధనవంతుడెలా అవుతాడు?” తన సందేహాన్ని వ్యక్తం చేశాడు ధర్మరాజు.

“మనిషి తన సుగుణాల ద్వారా ధనవంతుడవుతాడు. సుగుణాలు పోగొట్టుకుంటే
దరిద్రుడవుతాడు. ఒక వ్యక్తి తాను చేసే పనిని మోసపూరితంగా కాకుండా పదిమంది మెచ్చే విధంగా ఏదైనా పనిని చేసి ధనం సంపాదించవచ్చు. సోమరితనం పనికిరాదు. కొంత కాలం గడిచాక అతను సంపాదించిన మొత్తాన్ని పెట్టుబడి పెట్టి వ్యాపారం చేసి లాభాలు గడిస్తే, అప్పుడు ధనవంతుడవుతాడు. లాభంతో, అత్యాశతో చేసే పనులవల్ల, సోమరితనం వల్ల ఏవ్యక్తెనా దరిద్రుడవుతాడు”.

“ధర్మాలలో ఉత్తమ ధర్మం ఏది?”

“ఇతరులు ఏపనిచేస్తే తనకు బాధ కలుగుతుందో, ఆ పని తను ఇతరుల పట్ల చెయ్యకుండా ఉండటమే ఉత్తమ ధర్మం.”

“ఏ పనైనా ఆలోచించి చెయ్యాలా? తొందరగా చెయ్యాలా?”

“ఆలోచించే చెయ్యాలి. తొందరపాటు పనికిరాదు”.

ఇలా ఎన్నో రాజ ధర్మాలను భీష్ముడు ధర్మరాజుకు తన అవసానదశలో చెప్పినాడు. ధర్మరాజుకున్నఅనేక ధర్మ సందేహాలు తొలిగి నిశ్చింతగా తన శిబిరానికి బయలు దేరాడు.


_పిళ్ళా కుమారస్వామి,9490122229

Comments

Popular posts from this blog

ఇండియాలో_ఆక్సిజన్_వదిలే_ఆవులున్నాయా

Control over NSE