వనమాలి

వనమాలి
          
         నేను చేయాల్సిన పనులెన్నో ఉండగా కొత్తగా ఈ పనొకటి. ఆఫీసులో మేనేజరుగా చేసిన పనే ఇది. ఇప్పుడుమళ్లీ అదే పనే,చాలా బిజీ పనులలో ఈ కొత్తగా పని. పరిశోధనా మేనేజరు, శిక్షణ కోసం పూనాకు వెళ్లారు. వచ్చేసరికి లేటవుతుంది. అందుకే ఆయన చేయాల్సిన పని నా మీద పడింది.
     ఆ పని ఏంటంటే...
        ఓ పాలసీదారుడు ఐదు కోట్ల పాలసీ చేశాడు. కోటీశ్వరుడే. కానీ పాలసీ చేసి సంవత్సరం తిరక్కముందే మరణించాడు. పాలసీ చేసిన మూడేళ్లలోపే మరణిస్తే, అంత తొందరగా అతనికి మరణం ఎలా వచ్చిందో కనుక్కోవాలి.
              పాలసీ చేయడానికన్నా  ముందే జబ్బులున్నాయోమో అందువల్లనే పాలసీ తీసుకున్నాడేమో పరిశోధించి నివేదిక ఇవ్వాలి.
ఫైల్ ను రెండు మూడుసార్లు సంపూర్ణంగా చదివాను. అందులో అనుమానించాల్సిన విషయాలేమీ కనిపించలేదు.అతను హైదరాబాద్ లో నివాసం. హైదరాబాద్ లో పని చేసే బ్రాంచిల్లో ఉండే ఎవరో ఒక ఆఫీసరు అప్పజెప్పాల్సింది. ఎందుకనో నాకు అప్పజెప్పారు.
           నేనిప్పుడు హైదరాబాదుకెళ్లాలి. హైదరాబాదులో తిరగాలంటే కారు తప్పకుండా కావాల్సిందే.అందుకే కారులో బయలుదేరాను.
           మనుషులు డబ్బుకోసమే ఉండేవారు వుంటారు. వీళ్లు కొంత మందే. మమతల కోసం తాపత్రయపడేవారే చాలా మంది వున్నారు సమాజంలో.కాకపోతే మనకు కనిపించేదంతా డబ్బు ప్రపంచంలాగే కనిపిస్తుంది. మానవ
సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలంటారుగానీ పూర్తిగా నిజం కాదనిపిస్తుంది. ఆలోచిస్తూ కర్నూలు నుంచి హైదరాబాదుకు చేరుకునే టప్పటికి ఉదయం పది గంటలవుతోంది.
బంజారాహిల్స్ లో వుందతని ఇల్లు.ఇంట్లోకి వెళ్లాను. ఇంట్లో నిశ్శబ్దం తాండవిస్తోంది. లంకంత ఇల్లు, ఇంటి ముందు నాలుగు కార్లున్నాయి. కుక్కలు మూడున్నాయి. ఇంట్లో మాత్రం పనిమనిషి ఒక్కతే వుంది.

'భాస్కరవర్మ ఇల్లు ఇదేనామ్మా ?"
“ అవునండి, మీరెవరండి."
'నేను ఇన్సూరెన్సు మేనేజరునమ్మా, భాస్కర వర్మ గారి భార్య వీణ ఉన్నారమ్మా'.
లేదండి. ఆమె ఇప్పుడే పనిమీద బయటికి వెళ్లారు.
'ఎప్పుడొస్తుంది ?"
"తెలీదుసార్"
“ఆమె సెల్ నెంబర్ ఇవ్వమ్మా"
   చెప్పింది. సెల్ లో ఫీడ్ చేసుకున్నాను.అప్పుడు గుర్తుకొచ్చింది.తనకు పంపిన ఫారాల్లోనే ఆమె నంబరు ఉన్నట్లు.మతిమరుపు మనిషికి వరమా? శాపమా? అనుకుంటూ బయటకు వచ్చేశాను.
       కారుడోర్ లాక్ తీస్తుండగా పక్క నుంచి సెక్యూరిటీ దుస్తుల్లో వున్న ఒకతను వెళ్తూ, వెళ్తూ, ' సార్ మీరు భాస్కర్ గారింటికి వచ్చారా ?' అని అడిగాడు.
అతన్ని ఎగాదిగా చూశాను 'ఔను' అన్నాను.
' ఆయన చనిపోయి ఒక నెలయ్యింది సార్'
'నువ్వు ఎక్కడుంటావు'
'పక్కనున్న రఘురాంరెడ్డి ఇంటిలో వాచ్ మెన్ గా వున్నా సార్'
“భాస్కర్ గారు గుండెపోటుతోపోయారంటగదా'
'కరెక్టుగా తెలీదు గానీ మా సారుకైతే బాగా తెలుసు సార్'
  'మీ సార్ నెంబరు ఇవ్వు'
   చెప్పాడతను.

        పాలసీ చేసిన ఏజెంటు రమణారెడ్డికి ఫోన్ చేశా. అతను ఎలా చనిపోయాడో చెప్పమని అడిగా.
  'ఆయన చనిపోయినట్లు కూడా నాకు తెలీదు సార్' అన్నాడతను.
'మరెవరు ? ఈ క్లెయిమ్ ను ఆఫీసులో ఇచ్చారోనని నాదగ్గరున్న ఫైల్స్ చెక్ చేశాను. అందులో అన్ని ఫారాల్లో నవీన్ కుమార్‌
సంతకం చేశాడు.ఆ ఏజెంటుకు ఫోన్ చేశా.
 "నవీన్, నేను  మేనేజర్ ప్రతాప్ ను. భాస్కర్ వర్మ ఎలా చనిపోయారో తెలుసా' అడిగాను.
    'గుండెపోటుతో సార్' అన్నాడు.
    'ఎక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నారు?'
     'లేదు సార్.ఆయనెక్కడా తీసుకోలేదు సార్'
    'ఇంట్లోనే చనిపోయారా?'
     'అవును సార్'
      ఫోన్ కట్ అయింది !
                     _o0o_
    "రఘరాంరెడ్డి గారూ, నేను ఇన్సూరెన్సు మేనేజర్ ప్రతాప్ ను. మీరు భాస్కరవర్మ గారి మిత్రులని తెలిసింది.వారి మరణం గురించి కొన్ని వివరాలు కావాలి. చెపుతారా" అడిగాను.
   "నేనిప్పుడు ఇంట్లోనే వున్నా రండి ! చెపుతా" అన్నాడతను.
     అతనింటికి వెళ్లాను.
  " ప్రతాప్ గారూ ! భాస్కరవర్మకు డ్రింకింగ్ హ్యాబిట్ వుంది. మీకు తెలిందేముంది. అది మా హైక్లాస్ సొసైటీలో కామన్. అతను చనిపోవడానికి ముందు పదిహేను రోజులన్నుంచి హాస్పిటల్ చుట్టూ తిరిగేవాడు. ప్చ్... ఏ జబ్బుతో చనిపోయాడో చెప్పడం కష్టం...' అన్నాడతను.
  'ఏ హాస్పిటల్ లో?'
   ' కాంటినెంటల్'
          _@_

        భాస్కరవర్మ మరణం గురించి నివేదిక కావాలని ఆసుపత్రి మేనేజరును అడిగాను. ముందు మా ఆసుపత్రి రూల్స్ ఒప్పు కోవన్నాడతను. నేను రూల్స్ చూపించా.
“అంతే. అన్నీ ఇచ్చాడు. అందులో గుండెపోటుతో మరణించినట్లే ఉంది'
ఆఫీసు రికార్డుల్లో రాసినదాని ప్రకారం అతను ఇంటి దగ్గరే 'గుండెపోటుతో ' మరణించాడు. ఆసుపత్రి రికార్డుల ప్రకారం ఆసుపత్రిలో మరణించాడు. ఇందులో ఏది సత్యం ?
మళ్లీ భాస్కరవర్మ ఇంటికి బయలుదేరాను.
భాస్కర వర్మ భార్య సుగుణ ఇంట్లో వుంది. ఆమెను చూడగానే అవాక్కయిపోయాను. 
     ఆమె సౌందర్యం, రూపం ఏ సినిమా హీరోయిన్ కు తగ్గదు. భాస్కరవర్మ దురదృష్టవంతుడు. చిన్న వయస్సులోనే పోయాడు. మనసంతా వర్మ దురదృష్టాన్ని తలచుకుంటూ 'నమస్కారమమ్మా' అన్నాను.
నమస్కారం 'కూర్చోండి' అంది. నా విజిటింగ్ కార్డు ఇచ్చాను.
   ఆమె చూసింది.ఆమెలో ఎలాంటి మార్పు లేదు.అందమైన మోములో ఎలాంటి భావాల్ని
నేను చదవలేక పోయాను.భర్త మరణించాడన్న బాధ కూడా ఆమెలో కనిపించడంలేదు.
   “మా పని మనిషి చెప్పింది ఏం కావాలి ?” అడిగింది. ఆమె మాట్లాడుతుంటే వీణ మీటినట్లుంది.
"భాస్కరవర్మ గారి మరణం ఎలా జరిగిందో కనుక్కుందామని వచ్చాను. మా ఆఫీసు రూల్స్ ప్రకారం కనుక్కోవాల్సి వచ్చింది" సంజాయిషీ ఇచ్చుకొన్నట్లు చెప్పాను.
  "వాడా ! ఎయిడ్స్ తో పోయాడు' కోపంగా అంది.వీణలో తీగ తెగి అపశృతి పలికినట్లుంది.
      అవాక్కవడం నా వంతయింది. ఏదో జోక్ చేస్తుందనుకున్నా. కానీ ఆమె అతని పేరు కూడా పలక్కుండా 'వాడు' అనడంతో దాని వెనుక ఏదో వుందని నాకనిపించింది.
 "గుండెపోటుతో కాదాండి? అడిగాను.
"కాదు,  ఏజెంటే అలా రాయించాడు. నేను ఎంత చెప్పినా వినకుండా అలా రాసి పంపించాడు. వీడికి అమ్మాయిల పిచ్చి. మీ ఏజెంటు వానికి బ్రోకరు. ఇంట్లో వున్న అందం సరిపోక దేశమంతా తిరిగాడు, ఎయిడ్స్ వచ్చి
చచ్చాడు' పళ్లు పటపట కొరుకుతూ అంది.
ఆమె అంత కసిగా చెబుతోందంటే ఆమె గుండె ఎంతగా రగిలిపోయుంటుందో అర్థమైంది నాకు.
 'ఎయిడ్స్ తో మరణించినట్లు రాసివ్వగలరా ' అన్నాను.
'రాసిస్తా నండి'అంటూ లోపలికెళ్లి ఒక ఫైలు తెచ్చి ఇచ్చింది. 
అందులో  కాంటినెంటల్ ట్రీట్ మెంట్ వివరాలున్నాయి. అవి చూడగానే ఆసుపత్రిలో మేనేజ్ చేశారని అర్ధమయింది.

ఆమె తనకు తెలిసిన  వివరాలన్నీ రాయించింది.
   అక్కడి నుంచి నిష్క్రమించే ముందు   
"సుగుణ గారూ! మీరు మా ఏజెంట్ ప్రోద్బలంతో పాలసీ కోసం క్లెయిమ్ చేసినా, మీరిప్పుడు చూపించిన నిజాయితీ చాలా గొప్పది. డబ్బులొస్తాయంటే అబద్దాలు చెప్పైనా,నానా గడ్డితినైనా ఎలాగోలా తిప్పలు పడుతుంటారు.కానీ మీరు మాత్రం వాస్తవాన్ని బయట పెట్టారు.మీలాంటి వాళ్ళు ఉండబట్టే సమాజం అంతో ఇంతో ఇంకా బాగుంది.మా
ఇన్సూరెన్స్ సంస్థ లు ఇంకా మనగలుగు తున్నాయి.ధన్యవాదాలు మేడం" అన్నాను.
        నా నివేదిక పూర్తయింది!
 'ఎక్కడో రచయిత చెప్పినట్లు జీవితం తపస్సు చేయకుండా లభించే ఒక ఉద్యానవనం. అందులో అందమైన భార్య దొరకటం ఆ వనంలో గులాబీ వుండడంలాంటిది. ఆ వనాన్ని ఆనందంగా, ఆహ్లాదంగా కాపాడుకోవాల్సింది
మనమే' అనుకుంటూ కారు స్టార్ట్ చేశాను.


    __ పిళ్లా కుమారస్వామి 9490122229

Comments

Popular posts from this blog

ఇండియాలో_ఆక్సిజన్_వదిలే_ఆవులున్నాయా

Control over NSE