నాన్న



(ఈ కధ నిరాధారం కాదు! ఇంచుమించు చాలా తెలుగు కమ్యూనిస్టు కుటుంబాల్లో ఈ నాన్న ఉంటాడు. వెతుక్కోండి!)

 

                  నాన్న! {కధ}

-వి.విజయకుమార్

 ----------------------------                                                   

“మూడు బావున్నట్టు లేదు...ఉలుకూపలుకులేదు…చాలాసేపటి నుండి పిలుస్తున్నా... విన్నట్టులేదు..ఏంటి సంగతి”? 

అప్పటికి గానీ అర్దం కాలేదు..కిరణ్ చాలా సేపటి నుండీ తనను పిలుస్తున్న విషయం.

“సారీ అండీ… ఏదో కథ చదువుతూ....”

కిరణ్ కి అర్థం అయింది. అప్పుడు...తను నిన్న వాట్సప్ లో పెట్టిన కథ చదివిందని.....తను కొంత ఎమోషనల్ గా ఉండటం చూశాడు.. అంటే తను ఆ కథకి బాగానే కనెక్ట్ అయినదన్నమాట!

అది ఓ తండ్రి తన అంత్యక్రియలు స్వగ్రామంలో జరగాలని కోరుకున్న నేపధ్యంలో ఆ కొడుకు ఎలా ఫీల్ అయ్యాడో చెబుతూ రాసిన కధ...

చాలా ఎక్కువ మంది కనెక్ట్ అయిన కధ అది.

వాట్సాప్ లో చదవగానే సరోజకీ పంపాను.

తను అంతగా మూవ్ కావడానికి కారణం లేకపోలేదు.

నాన్న మృత్యువుతో పోరాడుతూ వున్నారు హాస్పిటల్లో...

ఇప్పుడో..ఇంకాసేపో... అన్నట్టుగా ఉంది పరిస్థితి..సరిగ్గా అదే విషయమై ఇంట్లో కొంత చర్చ నడుస్తోంది...

తనే అంది మళ్ళీ… “నిన్నొక కథ పంపారు చదవమని...అదే చూస్తున్నా…” 

తన కళ్ళల్లో ఉన్న ఆర్ద్రత చూసాక అర్ధం అయింది.

వావ్! చదివావన్నమాట!   బావుంది కదూ! అన్నాడు కిరణ్.

“బాలేదు...బాధగా ఉంది”... అంది తను.

యూ మీన్.. నచ్చలేదా నీకు?

“బాధ గా ఉంది అంటే నచ్చనట్టు కాదు”...అంది తను.

వడ్డన పూర్తి అయ్యింది.

తను తలొంచుకొని అంది..కాసేపటికి.

ఏవండీ !.. అప్పుడు నేను..మావయ్య గారి అంత్యక్రియలు విషయం లో నెగటివ్ గా మాట్లాడినప్పుడు మీరు ఫీలయ్యారు కదూ...! అంది తను.

“అన్నం తినేప్పుడు.. ఇప్పుడు ఆ ప్రస్తావన దేనికి సరూ... ముందు భోంచేయ్ తర్వాత మాట్లాడదాం.”..అన్నాను.

“పర్లేదు లెండి..ఇప్పుడే మాట్లాడుతూ తిందాం.. ఏం కాదు”...అంది.

“చెప్పు”  అన్నాను.

ఏం లేదు..తన అంత్యక్రియలు స్వగ్రామంలో చేయడంపై నేను విభేదించిన విషయంలో మిమ్మల్ని బాధ పెట్టానేమో... అనిపిస్తుంది..

ఎందుకో మావయ్య గారి మనసులో అసలు నిజంగా ఏముందో అనిపిస్తోంది...

మళ్ళీ తనే అంది.. కొంచెం ఖర్చుతో కూడిన పనైనా మీ వూళ్ళో చేద్దాం! సరేనా?...

నేను మౌనంగా ఉండి పోయాను.

విధిలేని పరిస్థితుల్లో ఆయనకి ఇష్టం లేకపోయినా ఈ మహానగరంలో ఓ మూల మంచానికి అతుక్కుని పడి ఉండాల్సిన అగత్యం..నాన్నకి దాపురించింది..

ఎంత హుందాగా,  యెంత గంభీరంగా తిరిగేవాడు నాన్న!

తలలో నాల్క లా ఊరంతా తనదే అన్నట్టుగా తిరిగేవాడు!

వందలమంది వెంట తిప్పుకున్న నాన్న... ఇవ్వాళ్ళ ఇలా జీవశ్చవంలా ....మాట్లాడేవాళ్ళు లేక ...ఒంటరిగా

 పడివున్నాడు!

ఎవరి అంత్య జీవితం అయినా ఇంతేనా?

ఈ నాన్నలు కోల్పోయింది మనం ఇవ్వలేమా?

“మీరు ఏమి చెప్పనే లేదు.”.. తను అంటోంది...

ఒక్కసారిగా మళ్ళీ ఈ లోకంలోకి  వచ్చాను....” చూద్దాం...” అని ముక్తసరిగా అని చేయి కడుక్కొని బెడ్రూం లోకి వెళ్ళిపోయాను. 

టేబుల్ సర్ది తనూ లోపలకి వచ్చి బెడ్ చివర కూర్చోని నేనే ఏదో చెప్పాలన్నట్టు సైలెంట్ గా నా వైపు

చూస్తూ అలా ఉండి పోయింది.

“నాన్న అలాంటి విషయాల్లో నిక్కచ్చిగా వుంటారు సరూ !!

ఆయనకు పర్టికులర్ గా ఇలా చేస్తేనే సరైంది అని అనుకోరు.”.. అన్నాను ఎటూ పాలుపోక.

'అత్తయ్య గారు ఈ విషయం లో మొండిగా వున్నారు'...అంది సరూ.

అవును సరోజా!     అమ్మ  ఏమంటుంది అంటే... బతికినంత కాలం జనాల కోసమే బతికాడు నాన్న...

ఆయన ఒక్క కోరిక తీర్చమని పట్టు బడుతోంది.....

అసలు ఆయన ఎప్పుడన్నా ఎవరితోనైనా అలా అన్నాడా? అంది సరోజ సందేహాస్పదంగా...

అమ్మ తో అన్నా డని అమ్మ అంటోంది.

నిజంగానా! అంది తను..నమ్మశక్యం కానట్టు.

నిజం కాక పోతే అమ్మ అట్లా అనదు....అన్నాను.. విధిలేక...

ఆలోచిద్దాం...ఆ విషయం.. కాసేపు అలా నడుం వాల్చు...అని అటు తిరిగి పడుకున్నాను.

కాసేపట్లోనే  నిద్ర ఆవహించింది.

***

“బాబు గారూ... చిన్న దొర గారిని ఏదో అన్నరంటా”....పొద్దున్నే ఈరిగాడి కంప్లయింట్...నాన్నకి.

“వీరన్నా... మీ అమ్మ నీకు పెట్టిన పేరేంటి? అంటున్నాడు నాన్న.

“ఈరిగాడు...” అన్నాడు నవ్వుతూ ఈరిగాడు.

“వీరన్నా... ఏ తల్లి అన్నా ఈరిగాడు అని పేరు పెడుతుందా ఎక్కడన్నా? “నాన్న అంటున్నాడు.

తెల్లబోయి చూశాడు వాడు.”.అదేంది దొరా...ఒక్క పాలే అట్లన్నరు !” ఏదో వినరాని మాట విన్నట్టు!

మేం గట్లనే పెట్టుకోవాలని ఎవురో పెద్దాయన ఎప్పుడో చెప్పిండు అంటగా.. అయ్యా! అన్నాడు అమాయకంగా.

కాలం మారింది వీరన్నా... అవి ఏనాడో చెప్పిన తప్పుడు మాటలు...అన్నారు నాన్న.

ఏం మారింది దొరా!   గుడి మెట్టు కూడా ఎక్కనీయరైతిరి...పండగ పూట.. అన్నాడు వీరన్న.. దిగులుగా...

నిన్ను ఎక్కనీయకపోతే పోనీ నీ కొడుకు ఎక్కుతాడు...దిగులు పడకు...

అయినా వీరన్నా...నిన్ను రానీయని ఆ దేవుడు నీకు మాత్రం ఎందుకు?.. ఒదిలేయ్... అలాంటోడ్ని...

వీరన్న చిన్నబోయాడు.

“ఇంతకీ... మీ అమ్మ నీకు పెట్టిన పేరు?.”.టాపిక్ మళ్లించారు నాన్న.

మీరు ఈరన్న... ఈరన్న.... అంటే నన్నుగాదు  అనిపిచ్చేది... చాలా సార్లు...మా అమ్మా అయ్యా పెట్టిన పేరు

ఈరిగాడే దొరా...

నాకు యాది కి ఉన్నంత  లో నన్నెవరూ  ఈరిగాడే అని పిలవడమే ఎరిక...

“చిన్న దొర కూడ  అట్లనే పిలిసిండు..దానికి దొరని తిడతర ఎక్కడన్న ?” అంటున్నాడు ఈరిగాడు.

“నువ్వన్న చిన్న దొర వయసు యెంత ...తెలుసా? వీరన్నా! “

ఈరన్న తల గోక్కున్నాడు... “దొరసానమ్మ కడుపులో బిడ్డ పడ్డప్పుడే  మా ఇంటిది మా నడుపోన్ని కన్నది.

అంటే... పదేళ్లు...ఉండొచ్చు దొర"...

“అవును... చిన బాబుకి పదేళ్లు... కానీ నీకు..దగ్గర దగ్గర అరవై..”.

“చిన బాబు నిన్ను ఒరేయ్ అనడం చూశా... అది సరైంది కాదని చెప్పా !”

వీరన్న అనే ఆ ఈరిగాడి కి ఇదంతా ఒక తికమక...ఏదో తెలీని బాధ,సంతోషం, ఇంకా ఏదో చెప్పలేని ఫీలింగ్.

“ఏమో దొర.. నిన్ను గూడ ‘దొర ‘అని పిలవనియ్యవ్....గొప్పోనివి దొరా... నువ్వు.”.

ఈరిగాడి కంట్లో నీళ్లు...

ఈరిగాడు అంటున్నాడు...వాడి కళ్ళలో నీళ్ళు తళుకు మంటున్నాయ్.....

“దొరా... లోకంలో అందరు ఇట్టా మారే రోజు వత్తదంటారా....”

               "నిజంగానే...నిఖిల లోకం నిండుహర్షం... వహిస్తుందా???” అన్న మహాకవి సదసత్సంశయం...ఈరిగాడి మొహం లో కనబడింది.

ఒక్క పిలుపు కే ఆ చిన్న గుండె చెరువైంది.

వీరన్న కళ్ళు ఎందుకు కండువాతో తుడుచుకున్నాడో  నాకు అర్ధం కాలా ఆ రోజు.

ఆ చిన్న దొర నైన నేను ఆ రోజు నుంచీ ఈరిగాడ్ని   ‘వీరన్న’  అనడం నేర్చుకున్నాను.

ఇప్పుడు ఆ వీరన్న లేడు.

వీరన్న శవం మీద పూలు వేసిన రోజు నాన్న పక్కనే  గూడెం వరకూ నడిచి వెళ్ళాను.

నలభై ఏళ్లు మా ఇంటి చుట్టూనే  తిరిగిన వీరన్న పైసా అయినా వెనక వేయలేదు.

చూశావా కిరణ్..లోకం పోకడ ?....అన్నాడు నాన్న.

కొద్దిగా అర్ధం అయి...అర్ధం..కానట్టు...
*
నాన్న పెద్దగా చదువుకోలేదు.. అయినా బాగా చదవడం చేసేవారు.

శరత్ బాబు నవలలు..అమ్మ నవల...గోరా పుస్తకాలు..చలం..కొడవటిగంటి...

ఇంకా కమ్యూనిస్టు పుస్తకాలు ...కధలు..చాలా చాలానే ఉండేవి...ఇంట్లో...

తెలంగాణా పోరాటం తాలూకు పుస్తకాలు ఉండేవి.

చైనా, వియత్నాం... క్యూబా..రష్యా..రెండో ప్రపంచ యుద్ధం... ఇవన్నీ మాట్లాడే వాళ్ళు...నాన్న.

నాన్న ఆరో తరగతి చదివినట్టు చెప్పేవారు.

పండగలప్పుడు నాన్న ఇంట్లో పూజలు చేయడం పై అమ్మకి నచ్చ జెప్పే ప్రయత్నం చేసేవాడు.

“మీ సిద్ధాంతం మీరూ బయట వరకే”...అనేది అమ్మ.

“ఇంట్లో వాళ్లే నా మాట వినక పోతే బయట వాళ్ళు ఎలా వింటారు సీతా!”...అనేవాడు నాన్న.

“అవునండీ... పండుగలప్పుడు... అదో ఇదో...వండుకోక పోతే, పనివాళ్లకు పెట్టకపోతే నామోషిగా వుండదూ”...అనేది అమ్మ.

“అవి పూజలు లాంటి తంతు లేకుండా కూడా చేసుకోవచ్చు కదా !” ...అనే వాడు నాన్న.

అమ్మ  ఒక రాముడి కాలండర్ పెట్టేది యింట్లో...

“ఎందుకు..ఈ ప్రబుద్ధుడ్ని ఇక్కడ పెట్టావ్” అనేవాడు నాన్న...

“ఇంట్లో ఏదో ఒక ప్రబుద్దుడి ఫోటో వేలాడుతూ ఉండక పోతే అమ్మలక్కలతో చస్తున్నాను.”

అనేది అమ్మ...

“మీకేం... మీరు బయట తిరిగేటప్పుడు... ఇలాంటివి మీకు ఎదురు కావు”.

చుట్టాలు పక్కాలు, ఇరుగుపొరుగు వచ్చినప్పుడు ముందు చూసేది పడమటి గది.

“ఏమమ్మా... మీ ఆయన ఎంత వీర కమ్యూనిస్టు అయితే మాత్రం..ఇంటో దీపం వెలిగించు కోవూ....నువ్వన్నా..”.

అనేవాళ్ళతో వంట చేయడం మాని ఏం వాదించను??

అందుకే...ఆ 'ఫోటో' అనేది అమ్మ.

అలాంటి అమ్మ చేతిలో ఓ రోజు నాన్న “ విష వృక్షం” పెట్టడం నాకు బాగా గుర్తు.

అమ్మతో దాన్ని చదివించడానికి విశ్వప్రయత్నం చేశాడు నాన్న.

ఆ పుస్తకం చదివాక అమ్మ రాముడి క్యాలెండర్ ని చుట్టచుట్టి అటక మీద గిరాటు వేయడం నాకు గుర్తు.

“అమ్మయ్య... ‘ఒకడైనా' అటక ఎక్కాడు”...అని నవ్వేవాడు నాన్న.

 “వూరుకొద్దురూ....అలాంటి వాడని నాకు తెలియదు.. “లవకుశ ”సినిమాలోలా నిజంగానే గొప్పొడు అనుకున్నా!”

 “అందుకే సీతా.. నిజా నిజాలు తెలుసుకోవాలి !”

పెద్దగా మొహాలు కనబడని ఒకటో రెండో దేవుడి బొమ్మలు ఉండేవి ఇంటో... నాన్న చెప్పినా గానీ...

కానీ ' రాముణ్ణి ' మాత్రం అమ్మ వదిలేయడం నేను మరచిపోలేని విషయం!

*
ఓ రోజు అమ్మ ఇంట్లో బట్టలు ఉతికారేసే ఆవిడతో చాలా కోపంగా అంటోంది.

“ఎంత చేసినా మీ బుద్ధులు మారవు”... అని

నాకింకా గుర్తు... నాన్న అమ్మని ఎప్పుడూ కోప్పడటం చూళ్ళేదు.

“సీతా... తప్పు కదా...అలా అనడం”... అన్నారు నాన్న.

“మీకు తెలియదు వూరుకోండి... అడ్డమైన వాళ్ళని వెనకేసుకు రాకండి”...అమ్మ కోపంతో ఊగిపోతోంది.

“అసలేం జరిగింది సీతా’! నాన్న అడిగారు.

“మీ చొక్కా జేబులో ఉన్న ఆరు వందలు మర్చి పోయి ఉతకడానికి వేశాను.

‘అసలు డబ్బులు అందులో లేవు అమ్మగారూ’...అంటూ అబద్ధం ఆడేస్తుంది...చూడండి...అది!

నిజంగానే...తను డబ్బులు చొక్కాలో మర్చి పోవడం నిజమే..అవి నిన్న రేవుకు వెళ్ళింది కూడా నిజం.

కానీ వీరలక్ష్మి ...అసలు డబ్బులు చూళ్ళేదు అంటూంది.

పేదవాళ్ళు అస్సలు తప్పులు చేయరు...అబద్ధం ఆడరు అనికాదు.

కానీ పెద్దవాళ్ళు చేసినన్ని తప్పులు చేయలేరు..అబద్ధాలు ఆడలేరు.

వాళ్లకు ఆ వెసులుబాటు వుండదు.. ఎందుకంటే..వాళ్లకు నీతులు నర

 నరాల్లో....చిన్నప్పటి నుండీ నూరి పోస్తారు.

అందుకే పేద వాడు తప్పు చేయడానికి భయపడ్డంతగా పెద్ద వాడు భయపడడు...

పరువులు, నీతులూ, ధార్మిక సూత్రాలు... అన్నీ వాళ్ళ కోసం తయారు చేస్తారు.

వీరలక్మి కి ఆ యింటికి అనుబంధం నలభై ఏళ్ల పై చిలుకు...

అనుబంధం అంటే ఏమీ కాదు! వెనక నుంచి వచ్చి విడిచిన బట్టల్ని మూట గట్టి నెత్తిన పెట్టుకొని

రెండు కిలోమీటర్ల దూరం వెళ్లి వాటిని శుభ్రంగా ఉతికి  సాయంత్రం ఇంటికి తెచ్చి ఒప్పగించడం...

తుఫాన్లు వచ్చాయి..వెళ్లాయి..పండగలు వస్తాయ్, వెళతాయి...ఇంకా ఎన్నో వచ్చి వెళ్లిపోతాయ్.

కానీ వీరలక్మి కి రావడం మాత్రమే తెలుసు... ఇన్నేళ్ల లో ఒక్కరోజు మానిన సందర్భం ఉందా...అంటే.

“లేదు”...అని ధైర్యంగా చెప్పొచ్చు...

సెలవు,విరామం లాంటి పదాలు అదేదో జపాన్ భాషలో ఉండవట!

వీరలక్మి కి కూడా అంతే!

“మీరు పనివాళ్ళ విషయంలో తల దూర్చకండి “ అని కటువుగానే అంది అమ్మ.
*

నాన్న కి పనివాళ్ళ మీదే కాదు..అవుల్ని, గేదెల్ని, కుక్కల్ని కూడా ఏమి అన నిచ్చేవాడు కాదు.

రోజూ ఇంటి వెనక పెరట్లోకి ఒక నల్ల కుక్క వచ్చేది.

అందరూ దాన్ని ఛీ ఛీ..అనే వాళ్ళు.

ఎలుగుబంటిలా ఉండేది అది...ఎందుకో ఏమిటో..దాని శరీరం మొత్తం చర్మ వ్యాధి వచ్చి అట్టలు కట్టుకు పోయి భయం గొల్పేలా తయారైంది ...

పిల్లలు రాళ్ళతో తరిమే వారు దాన్ని!

కానీ నాన్న అనేవారు...అందుకే గావన్నూ ఎక్కడో..మహాకవి అన్నట్టు గుర్తు. "ముఖ్యంగా నేను పుచ్చిపోయిన గజ్జి కుక్కపిల్లని చూడమంటాను”......అని...ఈ మనుషులు బాధలో ఉన్నవాటిని మరింత గా బాధపెడుతూ వుంటారు గదా...అని దాన్ని చూసి జాలిపడేవారు..

ఆయన దాన్ని అందరిలా చూసేవారు కాదు.

‘ఆకలి బాధ తో పాటూ దానికి పాపం ఇదో నరకం...రోజంతా శరీరానికి ఎంత బాధ”...? అనేవారు.

నాన్న ని చూడగానే అది దగ్గరికి వచ్చేది...

ఊరు చివర ఎరుకల వారు పందులు పెంచుకొని వాటి మాంసాన్ని అమ్మి జీవనం సాగిస్తూ ఉండేవారు.

పందిని వేటాడే విధానం చాలా క్రూరంగా ఉండేది.

దాన్ని పట్టుకోవడంకోసం ఈటెలతో వేటాడేవారు... ఈటెలు కడుపులో దిగబడ్డాక కూడా అది హృదయవిదారకంగా అరుస్తూ ప్రాణం కోసం పరుగులుపెట్టేది..

వళ్లు గగుర్పాటు కలిగించే ఈ దృశ్యం కొందరికి ఆటలా కనబడేది.

ఇంకా దారుణమైన విషయం ఏమంటే...

 వాళ్ళు బరిశలతో వెంటాడి వెంటాడి  వేటాడి అది అలిసి సొక్కి పోయి నడవలేక చేతికి చిక్కగానే ఇంకా బతికి వుండగానే అది గిల గిల తన్నుకుంటూ వుండగానే నిప్పుల్లో కాల్చేవారు...

హృదయం ఛిద్రం అయిపోయే ఈ క్రూరమైన వేటాడే విధానం చూసి విలవిల లాడిపోయేవారు నాన్న.

గుండెలు అవిసి పోయేవి...

వాళ్ళ కు నచ్చచెప్పడానికి లేదు!

ఆయన అలాంటి దృశ్యం కంటబడ్డరోజు...చాలా నలిగిపోయేవారు.

హింస,రక్తం తప్ప కమ్యూనిస్టులకు పాపం, పుణ్యం, జాలీ, దయా, కరుణా ఉండవని ఎన్ని ఆపాదిస్తారు

వాళ్ల గురించి తెలియని వారు!

అసలు ఈ లక్షణాలు ఉన్నవాడే కమ్యూనిస్టు  అనిపిస్తుంటుంది నాకు నాన్నని చూశాక!

*
ఆ రోజు సాయంత్రం వీరలక్ష్మి  వాళ్ళాయన ఇంటికొచ్చాడు.

ఎప్పుడూ తాగుతూ, వూగుతూ... తిరుగుబోతు అని చీదరించుకోబడే వీరాసామి బయట వాకిట్లో నిలబడ్డాడు.

“ఏం వీరాసామీ... ఎలా ఉన్నావ్.?”..అని పలకరించాడు నాన్న.

“దొరగారూ మీ దయవల్ల బానే వున్న” అన్నాడు వీరాసామి...మొహంలో వెలుగులేదు ఎక్కడా!

  “సిన్న తప్పు జరిగింది అయ్యగారూ...బట్టల్లో దొరసాని.....డబ్బులు మరిసి పోయారంట... గదయ్యా!..

మా ఆడది పుసుక్కున తెచ్చేసింది రేవుకి.... సూసుకోకుండా..!

దానికి తెల్వకుండా ఆ డబ్బులు నేనే తీసిన దొరా!...

ఈ గోండి... తవరి...డబ్బులు”...అని బొడ్లో దోపుకున్న ఆరు కాగితాల్ని భద్రంగా నాన్న పాదాల దగ్గర పెట్టాడు వీరాసామి, తలొంచుకొని.

  అమ్మ లోపల నుంచి వచ్చి...” బావుంది నాటకం” అని చటుక్కున వెనుదిరిగి వెళ్ళిపోయింది కోపంగా!

నాన్న కుర్చీలో నుంచి లేచి డబ్బులు తీసుకున్నారు.

“వీరాసామీ...తాగుడు...మానేశావా”... అని భుజంపై చెయ్యి వేశారు.

“లేదు దొరా”,  అని తలదించుకున్నాడు...

“తప్పుజరిగింది. అయ్యగారూ... దొరసానిగారు కోపంగ ఉన్నరంట జర చెప్పురి.” అన్నాడు వీరాసామి చేతులు జోడించి..

నాన్న నవ్వి..”. పర్లేదు...ఏం గాదు... ఇంటికెళ్లు.”..అన్నారు ఆప్యాయంగా...

“అయ్యా...తమరు..దేవుళ్లు”... అని వెళ్ళిపోయాడు వీరాస్వామి.

కానీ నాన్న మొహంలో వెలుగులేదు.

వీరాసామి అలా దుఖ్ఖ పడుతూ వెళ్ళిపోయాక నాన్న చాలా బాధ పడ్డారు.

అలా జరిగివుండక పోతే ఎంత బావుండు! అని మాత్రం అన్నారు అమ్మతో...

అమ్మ సహకారంతో నాన్న బాగా బయట బాధ్యతలలో తల మునకలు అయి తిరుగుతూ ఉండేవారు.

కొన్ని విషయాల్లో అమ్మతో మరీ వాదించి నొప్పించకుండా తనలోనే ఉంచుకునేవాళ్ళు.

ఇది జరిగిన మూడు రోజుల తర్వాత ఒక సంఘటన నాన్నని మరింత బాధ పెట్టింది.

 ఆ రోజు అమ్మ బాగా దుఖ్ఖ పడుతోంది ఎందుకో....వంట గదిలో.

నాన్న పదే పదే అడుగుతున్నారు, 'ఏమైంది సీతా?' అని కళవల పడుతూ...

బావురుమంది అమ్మ! నాన్న చేతులు పట్టుకొని...

“తప్పు చేశానండీ... నేను” అంది...బిగ్గరగా ఏడుస్తూ

నాన్న  ఓదారుస్తూ...

“సీత తప్పు చేస్తుందా ఎక్కడన్నా”? అన్నారు నాన్న.

“ఇవిగోండి... ఆరువందలు...” ఆరోజు...మీ జేబులో…” అమ్మకి దుఃఖం పొంగుకొస్తోంది.

అమ్మ గుప్పిట్లో ఆరు ఆరువందల కాగితాల తాలూకు ఉండ ఒకటి నలిగిపోయి కింద పడిపోయింది నేల మీద!

“పాపిష్టిదాన్ని... చూడండి! మీ జేబునుంచి తీసిపెట్టిన ...నోట్లు ఇందులో పెట్టి మర్చి పోయా...

ఛీ... ఆ పిచ్చిదాన్ని అనరాని మాటలు అన్నాను”...అమ్మ బాగా దుఖ్ఖ పడుతోంది...

నాన్న ఓదార్చారు అమ్మని.

“సీతా... ఊరుకో...ఏం కాదు…”

“లేదండీ... అది నన్ను ఛీ కొట్టినా బావుండు...నన్ను ఇంకా దొరసాని.. దొరసాని..అంటూ మామూలు గానే తిరుగుతోంది..అసలు ఏమి జరగలేదన్నట్టు..”

“అవును సీతా... వాళ్లంతే... ఎదురుతిరుగాల్సివచ్చినప్పుడు కూడా మౌనంగా ఉంటారు.

మనం నేర్పిన సంస్కృతి... ప్చ్...నాన్న కి ఎక్కడో బాధ.

తెల్లారి వీరా సామి ఒక్కడే వచ్చాడు.....వీరలక్మి లేకుండా...

“ఎక్కడవి స్వామీ డబ్బులు... నీకు?”...అన్నారు నాన్న...

“అప్పు చేశా”...అన్నాడు... ఏదో తప్పు చేసినోడిలా...వీరాస్వామి...

నాన్న  వీరాసామి దగ్గరకి కెళ్లారు..చేతుల్లోకి చేతులు తీసుకున్నారు...

వీరాసామి కళ్ళల్లో నీళ్ళు తిప్పుకున్నాడు.

“దొర గారూ... ఆరొందల కోసం..ఈ ఇంటి రుణం తెగ్గొట్టుకోలేక”...

వీరసామికి దుఖ్ఖపు తెర అడ్డొచ్చింది.

నాన్న కళ్ళు వత్తుకున్నారు కండువాతో...

'సీతా... యిలా రా...ఇదిగో వీరాస్వామి వచ్చాడు దా' అని పిలిచారు నాన్న!

అమ్మ కొంచెం జంకుతూ వచ్చి నిలబడింది.

“చెప్పు పర్లేదు”...అన్నాడు నాన్న.

“వీరాసామీ... ఒక పొరపాటు వల్ల”... అమ్మ తనమాట పూర్తిగా చెప్పకముందే వీరాసామి అడ్డుకున్నాడు...

 “అయ్యొ...! దొరసాని..! మీది దొడ్డమనసు...పొరపాటులేదు, పాడులేదు... భలేవారు అమ్మగారు”...అన్నాడు వీరాసామి గాభరాగా..

అమ్మ ఏం మాట్లాడలేక యింట్లోకి వెళ్ళిపోయింది.

“భలే దొర గారు మీరు...! అన్నం పెట్టే  అన్నపూర్ణమ్మ తల్లిని బయటకు పిలుస్తారా ఏడన్న?” అన్నాడు వీరా సామి...

“అవును వీరా సామి...పెద్దోళ్ళ తప్పులు కప్పెట్టు కోవడం వల్లే...ఈ... తప్పులు…”

“సర్లే...ఈ డబ్బులు తిరిగి ఇచ్చెయ్”...! అంటూ మరో రెందువందలు కలిపి వీరాసామి చేతిలో పెట్టారు నాన్న. 
*
బతికినంత కాలం ఎవరికైనా చేదోడువాదోడుగా వుండే నాన్న

ఎప్పుడన్నా పట్నం రమ్మంటే వచ్చేవారు కాదు.

నాల్రోజులు ఉండి వెళ్లొచ్చు కదా అంటే, "యిద్దరూ  ఉద్యోగులు... మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం నా వల్ల కాదు”...అనేవారు...

ఆయన పట్నం వచ్చారంటే ఎవర్నో ఒకర్ని హాస్పిటల్ కు తెచ్చే వుంటారు...అని అర్ధం...

అలాంటప్పుడు చెప్పేవారు కాదు.

ఇంటికెళ్ళి ఫోనులో  “.. ఇవ్వాళ్ళ వచ్చా గానీ... నీ దగ్గరకు రాలేక పోయా"  అని చెప్పేవారు.

తను ఎంత సాయం చేసినా తను మాత్రం ఇసుమంత సాయం ఆశించే వారు కాదు.

కొత్త బట్టలు,సినిమాలు, ఫంక్షన్ లు...వేటిమీదా మనసు పడేవారు కాదు.

అమ్మ అనేది అప్పుడప్పుడు...” రష్యాలో, చైనాలో...నిలబడకుండా పోయినా ఇంకా మీ ఆశా, తాపత్రయం దేనిమీద అండి”... అనేది...

నాన్న నవ్వేవాడు.

నా తాపత్రయం అంతా కమ్యూనిజం కోసమే...అని నవ్వే వారు.

మీ పిచ్చిగానీ... మూడు రాష్ట్రాల లో పోయారు గా...

ఇంకా దేనికండి...మీ తాపత్రయం? అమ్మ రెచ్చగొట్టేది...

ఇన్నేళ్ళ శ్రమ వృధా....కాలేదా?

ఇన్నేళ్లు పనిచేశారు... ఏం వరిగింది మీకు?

ఆస్థులు పోయాయ్... అందరూ సంపాదిస్తే మీరేమో ఉన్నది పోగొట్టుకున్నారు...!

పార్టీ మాత్రం ఏ మిస్తుంది మీకు...?

నాన్న మాత్రం చిరునవ్వు నవ్వేవారు.

అవునండీ.... మనం బతికి ఉండి చూడలేని కమ్యూనిజం మనకు వస్తే ఎంత పోతే ఎంత?

మన బిడ్డలు కూడా చూస్తారన్న నమ్మకం లేదండీ నాకు!

అసలు జనం నాడి చూడండి...పిచ్చివాళ్ళ వెంట పడుతున్నారండి...

దొంగల్ని నమ్ముతున్నారు..ఒకే రోజు మూడు పార్టీలు మారినా .....వాళ్ళ వెంటే పడుతున్నారు...

సినిమా వాళ్ళ కున్న విలువ కూడా ఇవ్వటల్లేదు కదండీ మీకు!!!

మళ్ళీ నవ్వాడు నాన్న.

కించిత్తు కూడా చెక్కు చెదరలేదు నాన్న...

ఎంత ఆత్మ విశ్వాసం ఆయనది !

నాన్న మెల్లగా నోరు విప్పారు.

“సీతా... ఈ ప్రశ్నలేవీ కొత్త కాదు ...రోజూ వినబడేవే... అయినా ఎన్నోసార్లు చెప్పాను...

మనం బతికి వున్నప్పుడు చూడలేక పోవచ్చు..మన బిడ్డల బిడ్డలు కూడా చూడకుండానే పోవచ్చు.

మన కోసమో... మన తరువాత తరం కోసమో పనిచేయడం అనేది ముఖ్యం కాదు...మనం పనిచేసినంత కాలం ఎటువైపు పని చేశాం అన్నదే ముఖ్యం...

పార్టీలు మారేవారి గురించి బాధ పడటం వేస్ట్... తాత్కాలిక లాభాల కోసం, తప్పుడు సంపాదనల కోసం  పాకులాడే వాళ్ల తో కమ్యూనిస్టులను పోల్చగూడదు...

జనం కోసం పని చేసినంత మాత్రాన వాళ్ళు గౌరవం ఇవ్వడం అవసరం అనేది అర్ధం లేని మాట!

ప్రజలు నిరంతరం బతుకుపోరు లో సతమతమవుతూ వుంటారు.

వాళ్ళ కు కనుచూపు మేరలో కన బడని ఒక జీవన విధానం కంటే

ఎదురుగుండా కనబడే తాత్కాలిక ఉపశమనం వైపు మెజార్టీ ప్రజలు ఆకర్షితులౌతారు.

నువ్వన్న విధంగానే ఎక్కువమంది ప్రజలు ఆలోచిస్తారు...అది వాళ్ళ తప్పు కాదు.

వాళ్ళని సరైన రీతిలో నడిపించే చైతన్య పూరిత మైన నాయకత్వం కావాలి..వాళ్ళకి చాలా అవగాహన ఉండాలి.

నీరుగార్చే రీతిలో అస్సలు మాట్లాడకూడదు.

ప్రజలు ఎక్కువ పేద వర్గాలు...వాళ్ళు బతకడం కోసం ఒకోసారి తేలిగ్గా లాభపడే వైపు ఆకర్షితులౌతారు.

వాళ్ళ చైతన్యం లో లోపం వున్నప్పుడు, నువ్వుచెప్పిన వాళ్ళందరూ వాళ్లకు గొప్పగా కనబడవచ్చుగాక!

ఎప్పుడొస్తుందో తెలియని ఒక గొప్ప సమాజం కోసం వాళ్ళు త్యాగాలు చేయలేరు...

వాళ్ళని చైతన్య పూరితంగా తయారు చేయాల్సిన పెద్దలు ఒకో సారి సినికల్ గా మాట్లాడటం వల్ల కూడా ఒకోసారి ఇలాంటివి వినాల్సి వస్తుంది.

కొన్ని ఎత్తుగడల్ని కూడా ప్రజలు అర్ధం చేసుకోరు ఒకోసారి!

ఛీ వాళ్ళతో పొత్తా...అంటారు కొందరు...

వాళ్ళు వేరు సార్...వాళ్ళు ఎవరినీ నమ్మరు సార్...

ఎర్రజెండా పక్కన...ఛీ.. ఛీ... వేరే జండానా??

ఇలా ఎన్నో రకాల విమర్శలతో ఉంటారు ...

వీటిని అర్థవంతంగా సమాధానం ఇవ్వగలిగే స్థాయి ఉన్న వాళ్ళు ప్రజలకు అందుబాటులో ఉండాలి.

యింక బోధించాల్సిన వారే ఇలా మాట్లాడుతూ పోతే అది మరింత చెరుపు.

కమ్యూనిజాన్ని నమ్మడం  అంటే “నిజాన్ని” నమ్మడం!

పారిస్ కమ్యూన్ పోయింది.. ఆగిపోయిందా... ఆలోచన?

ఎన్నిదేశాల ప్రజలు కావాలనుకో లేదు ఆ తర్వాత!

స్పార్ట్ కస్  బల్లెం విసిరిన వెయ్యేళ్ళ కైనా పోయిందా బానిస సమాజం?

పోలేదు....కానీ తర్వాత పోయింది కదా!

బల్లెం విసరకుండా ఉంటే...మరిన్ని వేల ఏండ్లు పట్టేది...

ఇలా బల్లాలు  విసరకుండా అలానే, ”.ఆ...వచ్చినప్పుడు చూసుకుందాం లే !.” అనేవాళ్ళ వల్ల ఉపయోగం ఉండదు.

కమ్యూనిజమ్ ఒక ఆశావహ దృక్పథం.. పడటం...లేవడం ...రెండూ ఉంటాయి అని నమ్మడం సరైనది.

కేవలం పడటం చూసి పెదవి విరిచే వారు నిజంగా వాళ్ళు సిద్ధాంతాన్ని నమ్మడం లేదన్న మాట!

అసలు కాలం...లెక్కలు..సూత్రీకరణాలు... ఇలాంటివి కాదు ముఖ్యం...

తాత్కాలిక సర్దుబాటల్లోని అపసవ్యాల్ని చూసి కొంపలు మునిగి పోతున్నాయని గగ్గోలు పెట్టే వారు

కమ్యూనిజాన్ని సరిగా అర్ధం చేసుకోలేక పోవడమే కారణం...

నాన్న కాసేపు ఆగారు..అమ్మవైపు చూశారు...

చిన్న నవ్వు నవ్వారు.

బోరు కొట్టించానా  సీతా...అన్నారు.

లేదండీ.... మీ మాటలు ఎంత ఆశావహంగా ఉన్నాయ్...

“నాకిప్పుడు... ఇప్పటికిప్పుడు కమ్యూనిజం రాకపోయినా బెంగ లేదు.

కానీ మీ మాటలు విన్నాక  ఆ సమాజం వచ్చి తీరుతుంది అన్న భరోసా వచ్చింది....”  అమ్మ కళ్ళలో మెరుపు.

*
“ఏం చదివావ్ నాన్నా... నువ్వు “ అని ఉండ బట్టలేక అడిగాను...

“ఏవో చిన్న పుస్తకాలు తప్ప..నాకు పెద్ద గ్రంధాలు తెలియవు”.. అని నవ్వారు నాన్న.

కానీ కిరణ్...నువ్వు చదవాలి...ఇంకా బాగా అర్థం చేసుకోవాలి...

నాలో లోపాన్ని నువ్వు సవరించుకో...నేను “క్యాపిటల్ పరిచయం” మాత్రమే చదివాను.

ఇంకా మూల గ్రంధాల్ని చదివే సమయం గానీ.. అవకాశం గానీ నాకు రాలేదు...

అన్నారు నాన్న.

******

గాఢ నిద్ర లో ఉన్న నన్ను ఉన్న పళంగా లేపింది సరోజ.

చాలా కంగారుగా వుంది.

మనం అర్జెంటుగా హాస్పిటల్ కి వెళ్ళాలి!

ఎందుకు? దిగ్గున లేచి కూచొని అడిగాను.

పోతూ మాట్లాడుకుందాం,రండి అంది సరోజ.

అర్ధం అయింది.

***

నాన్న కాలం చేశారు.

ఆయన గుండెలపై...ఆయనకు ప్రాణ సమానమైన ఎర్రని జెండా.

ఎవరు లేకున్నా నీ వెంట...నీ తోడు నేను...నీతోనే మిత్రమా..అని భరోసా ఇస్తున్నట్టు...

యావత్తూ  శరీరాన్ని భద్రంగా ఆవహించి ఉంది.

ఆ దృశ్యం చూసిన కిరణ్ ఖిన్నుడయ్యాడు.

ఎంత ఆపుకుందా మన్నా దుఃఖం సుడులు తిరుగుతోంది...

సరోజ భుజంపై చేయి వేసింది.

తర్వాత కార్యక్రమాలు...ఎవరో అంటున్నారు.

ఒక జీవిత కాలపు స్ఫూర్తి మౌనం దాల్చింది.

ఈ వార్త ఎలా వేగంగా వెళ్లిపోయిందో తెలియదు...

గంటకల్లా... అక్కడ చాలామంది...వచ్చి చేరారు.

అందరూ ఒక్కటే మాట... ఒక గొప్ప వ్యక్తి ని కోల్పోయామని...

**********

ఇంటికి తీసుకెళ్లి పోవడానికి అన్నీ సిద్ధం చేసాడు కిరణ్.

వాహనం కదిలే ముందు డాక్టర్ ఒక కాగితం చేతిలో పెట్టాడు.

ఇది మీ నాన్న గారి దిండు కింద ఉంది...

కిరణ్  పక్కకెళ్లి ఆతృతగా కాగితం మడత విప్పాడు.

అది నాన్న రాసినదే .. ఆ దస్తూరీ ఆయనదే!

అందులో ఇలావుంది.

“ నాన్నా కిరణ్!

మరణం తర్వాత  మన సంస్కృతి చాలా నియమాలను పెట్టింది.. అంత్యక్రియల పేరు మీద జరిగే తంతు ఇంతా అంతా కాదు. ప్రారంభంలో ఇది మరీ ఇంత వికృతంగా ఉండేది కాదు..రాను రాను అన్ని రకాల ఫంక్షన్లలాగే దీన్ని కూడా చాలా ఆర్భాటంగా చేస్తేనే గొప్ప అన్నట్టు తయారుచేశారు. డబ్బులేక పెళ్ళిళ్ళు వాయిదా వేసుకోవచ్చు. కానీ చావుని వాయిదా వేసుకోలేక అప్పోసప్పో చేసి విపరీతంగా ఖర్చుచేసి అప్పులు తీర్చుకొనేందుకు అవకాశంలేని వారిని ఎందరినో చూశాను. డబ్బున్న వాడికి ఇదేమీ పెద్ద విషయం కాదు. కానీ పేద వర్గాల వారికి ఇదొక గండం అయిపోయింది. సమాజం ఏమనుకుంటుందో అన్న భయం అనునిత్యం వేధిస్తుంది. స్థిమితంగా ఉండలేరు. దానికి తోడు తాగుడు కూడా అలవాటు చేసుకున్నారు బీదా బిక్కి జనం..

అంత్యక్రియల వ్యాపారం ఏ స్ధాయికి దిగజారిందంటే ఇంట్లో ఆదాయంతెచ్చే మనిషిపోవడం ఒక యెత్తైతే... ఇంక మరణం తర్వాత ఆ కుటుంబం లోని వారంతా జీవచ్ఛవాలు అయిపోవాల్సిరావడం మరో ఘోరం.

ఈ ఖర్చు మొత్తం ఆ మరణించిన వ్యక్తి బతకడానికి వినియోగించి ఉంటే అతడు కొన్నేళ్ల పాటూ హాయిగా బతికి వుండే వాడు..

బతికి ఉండగా ఇంత అన్నం పెట్టడానికి వెనుకాడిన వాళ్ళు చావుపేరుతో వేలరూపాయలు అవలీలగా తగలేయడం  చూస్తే, సంప్రదాయం పేరుమీద మనిషిని కట్టిపడేసిన ఆ అజ్ఞానానికి నిజంగా జోహార్లు చెప్పవలసిందే !

శ్రాద్ధకర్మల మంత్రఘోష అంతా, లేని పుణ్యలోకాలకు పంపడం కోసమే! ఎంత వైనంగా చేసినా పంచ భూతాల్లో కలిసిపోయేదే శరీరం...చుట్టూ వున్న ప్రాణులకు వర్తించని పుణ్యలోకాలు మనిషికి ఆపాదించి బతుకుతెరువు కోసం...కొన్ని వర్గాల వారికోసం...సృష్టించబడిన వాటిని మనం కూడా పాటిస్తే తర తరాలు ఈ అజ్ఞానాన్ని ఇంకా బలపరిచిన వారి మౌతాం!

ఒకప్పుడు శ్రమవిభజనలో అతి సౌకర్యవంతమైన , అతి లాభకరమైన, అతి మూర్ఖమైన విషయాల్ని ఒక వర్గం సొంతం చేసుకుంది, తెలివిగా సమాజాన్ని గుప్పిట బిగించింది. ఒక్క పంచాంగంతో,  నాలుగు ధర్మ శాస్త్రాల పేరుతో యావత్తూ సమాజాన్ని తన చుట్టూ తిప్పుకునేలా చేసుకోగలిగింది.

అమాయకత్వం, అజ్ఞానం, నిరక్షరాస్యత అన్నీ ఈ రకపు సామాజిక దోపిడీకి మార్గం సుగమం చేశాయి.

దీనికి ఎక్కడో అక్కడ ముగింపు పలకాలి.

అందుకే నాన్నా, నేనొక నిర్ణయం తీసుకున్నాను.

అసలు నమ్మని మూఢమైన విషయాల్ని “సమాజంకోసం...ఇరుగుపొరుగు కోసం...బంధువుల కోసం “. అంటూ... ఎందుకు రాజీ పడాలి?

రోజుకు ఎందరో నా అన్న వారు లేక మరణిస్తున్నారు.

వీళ్ళందరూ ఈ అపర కర్మలు లేకపోతే భూమిలో కలిసిపోవడం ఆగిపోయిందా?

డబ్బులు ఎక్కువ ఇచ్చి పుణ్యలోకాలకు పంపించడం అన్నది ఎంత హాస్యాస్పదం?

ఈ మూర్ఖత్వం రోజు రోజుకు పెచ్చుమీరిపోతోంది.

నీ ఎదురుగా ఉన్న నీ కన్న తండ్రి శరీరం ఒక మంచి పనికి ఉపయోగపడాలని నిర్ణయించుకుంది.

ఈ శరీరం ఇప్పటి దాకా తన మెదడుకు తోచిన పని చేస్తూవచ్చింది.

ఇంక ఆ మెదడు ఈ శరీరాన్ని నడపలేనని సెలవు తీసుకుంది!

ఈ శరీరం పై హక్కు నీదే కాబట్టి నీకే చెబుతున్నాను.

ఇంటి వైపు తిరిగిన వాహనాన్ని గాంధీ మెడికల్ కాలేజీ వైపుకు తరలించు!

ఈ శరీరంలో ప్రతి భాగం జ్ఞానాన్ని పెంచే విధంగా ఉపయోగపడేలా చెయ్!

మెడికల్ కాలేజీల్లో  శరీర నిర్మాణం తెలుసుకునే  విద్యార్థికి  యిది ఉపయోగపడాలి.

ఆలస్యం అయితే నా శరీరం పనికిరాకుండా పోతుంది... వెళ్ళు...వెంటనే...

ఇప్పటికే ఆలస్యం అయ్యింది.

తరలించు...యీ దేహాన్ని.

మీ.....నాన్న...

****

అవును చెప్పడం మరచిపోయాను. మరణానంతరం సమాజశ్రమ విభజనలో కొన్ని పేదవర్గాల వారికి కొంత సాయం అందుతుంది.

వాళ్లకు మాత్రం కచ్చితంగా కొంత డబ్బుని అందించే ఏర్పాటు చెయ్.

మిగతా ఆచారాలు, తంతులు,అపర కర్మలు, పిండాలు, గుండ్లు, ఇలాంటివి నువ్వు ఏమీ చెయ్యవ్ అన్న నమ్మకం నాకు ఉంది.

మీ నాన్న.

***********

పదిహేను నిమిషాల తర్వాత గాంధీ మెడికల్ కాలేజీ వైపుకు దూసుకుపోతోంది వాహనం..ఎఱ్ఱని జండా లో పదిలంగా చుట్టబడ్డ, అలుపెరుగని ఆ యోధుడు, నిబ్బరంగా తన చివరి కర్తవ్యాన్ని నెరవేర్చుకోబోతున్నాడు.

*

Comments

Popular posts from this blog

ఇండియాలో_ఆక్సిజన్_వదిలే_ఆవులున్నాయా

Control over NSE