కృష్ణదేవరాయల కల
శ్రీ కృష్ణదేవరాయులు ఒక రోజు నిద్రలో ఒక కల కన్నారు. ఆ కలలో ఆయినకొక అందమైన భవనం కనిపించింది. ఆ భవనం ఆకాశంలో తేలుతూ, లక్ష దీపాలతో చాలా అద్భుతంగా వుంది. తలుచుకుంటే చాలు, మాయమైపోయే ఆ భవనాన్ని కలలో చూసిన రాయలు ఆ కలను మరువలేకపోయారు. మర్నాడు సభలో ఆయిన ఆ కలను వివరించి దాన్ని నిజం చేయాలన్న ఆయన గట్టి నిర్ణయాన్ని అందరికీ తెలిపారు. అది విన్న వారంతా"అలాంటి భవనాన్ని ఎలా కట్టగలం? – అసలు గాలిలో తేలే భవనాన్ని కట్టడం అసాధ్యం" అంటూ ఆయనకు నచ్చచెప్పడానికి ప్రయత్నించారు.
రాయలు కోపంతో “అదంతా నాకు అనవసరం. మీరేంచేస్తారో నాకు తెలీదు కాని నా కల నిజమవ్వాలి. అలాంటి భవనాన్ని కట్టిన వారికి నేను లక్ష వరహాల బహుమానము ఇస్తా – లేదా మీరందరు నాకు కనిపించకండి” అని ఆఙ్ఞాపించారు.
విన్నవారంతా నిర్ఘాంతపోయారు.
ఎన్ని రోజులు గడిచినా రాయలు ఆ కలను మరువలేకపోయాడు.
నెరిసిపోయిన గడ్డం, జుత్తు, మీసాలతో పాపం అతికష్టం మీద కర్రతో నడుస్తున్న వృద్ధుడు"నాకు అన్యాయం జరిగింది, న్యాయం చేయండి" అని రాయల సభలోకి వచ్చి ప్రార్థించాడు.
“నీకేమన్యాయం జరిగిందో నిర్భయంగా చెప్పు, నేను న్యాయం చేస్తా” అని రాయలు హామీ ఇచ్చారు.
“నా దగ్గిర నూరు నాణ్యాలున్నాయి రాజా, వాటిని ఎవరో దొంగలించుకుపోయారు. నాకు వారెవరో తెలుసు, నా నాణ్యాలు అడిగి ఇప్పించండి” అని ఆ వృద్ధుడు దీనంగా అడిగాడు.
శ్రద్ధగా విన్న రాయలు "దొంగతనం ఎవరు చేశారు, ఎక్కడ చేశారు "అని ప్రశ్నించాడు.
వృద్ధుడు తడపడడం చూసి “నీకేమి భయం లేదు, చెప్పు” అని రాయలు ప్రోత్సహించారు.
“నా నూరు నాణ్యాలు దొంగలించింది మీరే స్వామి” అన్నాడా వృద్ధుడు. “నిన్న రాత్రి నా కలలో వచ్చి మీరే అవి దోచేశారు.”
రాయలకు చాలా కోపం వచ్చింది. “ఏమిటీ వెటకారం! కలలో జరిగింది నిజమనుకుంటే ఎలా?” అని కోపంగా అడిగాడు. ఈ మాట విన్న వృద్ధుడు తన గడ్డం, మీసం తీసేసి, కర్రను పక్కకు పడేసి, పగటి వేశాన్ని విప్పేశాడు.
అతను...తెనాలి రామకృష్ణ.
“క్షమించండి స్వామి – మీ కలను నిజం చేయడం ఎంత కష్టమో నిరూపించడానికే ఇలా చేసాను” అన్నాడు తెనాలి.
రాయలకు నవ్వొచ్చింది.
"ఎంత చక్కగా అర్ధమయ్యేలా చెప్పావు రామకృష్ణా! "అంటూ తెనాలి ని అభినందించారు.
Comments
Post a Comment