ఆశయం





"నేను విధవరాలినే చేసుకుంటాను' అన్నాడుశివయ్య దృఢంగా.
“ఏం? ఎందుకని? అడిగాడు స్వామి.
స్వామి అడిగిన ప్రశ్నకు శివ కొంచెంసేపు మౌనం వహించాడు. స్వామే మళ్ళీ
“ఎందుకు విధవరాలిని చేసుకోవాలనుకుంటున్నావు?” అని అడిగినాడు.
'ఒకరి జీవితంలో నైనా వెలుగు నింపాలని నాఆశయం' అని జవాబిచ్చాడు శివయ్య,
'నీ దృష్టిలో ఎవరైనా వున్నారా?” అడిగాడు స్వామి.
అవునన్నట్లు తలూపినాడు శివయ్య.
'ఎవరామె, ఏ పేరు?"
“అక్షరాస్యతా ఉద్యమంలో కళాకారిణిగా పనిచేసింది. పల్లెపల్లెలో చదువు అవసరాన్ని చెపుతూ ప్రచారం చేసే కళాబృందాలు ప్రభుత్వ సారధ్యంలో ఉండేవి. జనవిజ్ఞాననివేదిక కళాకారుల్ని
సమకూర్చేది. కళాకారుల్లో ఒకామె చురుకుగా కలివిడిగా ఉండేది. ఆమె పేరు ఇంద్రాణి"చెప్పినాడు శివయ్య.
శివయ్య, స్వామి ఇద్దరూ మంచి మిత్రులు. స్వామి ఇరవై ఏళ్ళనుంచి యంగ్ ఇండియా అనే   సంస్థలో
చాలా పదవులను నిర్వహిస్తూ వస్తున్నాడు. శివయ్య విద్యార్థి దశనుంచి నేరుగా ఆ సంస్థ లోకి ప్రవేశించి
రెండేళ్ళయింది.
శివయ్య స్వామి తో సన్నిహితంగా వుంటాడు. శివయ్య పట్ల స్వామికి ప్రత్యేక అభిమానం ఉంది. అందుకే స్వామి శివయ్యకు “శివా నువు మంచి అమ్మాయిని చూసుకుని పెళ్ళి చేసుకో' అని
సలహా ఎన్నోసార్లు ఇచ్చాడు.
“అయితే నేనే ఆమెతో మాట్లాడనా? చెప్పు" అడిగినాడు స్వామి.
మరుసటిరోజు ఇంద్రాణి ఇళ్ళు కనుక్కోవడం ఏమంతా పెద్ద కష్టం కాలేదు స్వామికి. ఆరోజుల్లో
కార్యక్రమాలను నిర్వహించిన ఉపాధ్యాయులను సంప్రదించగానే ఆమె వివరాలను అందించారు
మారు మాట్లాడకుండా.
ఇంద్రాణి ఇంటికి కెళ్ళగానే, 'నమస్కారం సార్' అంది ఆమె.
'నేనెలా తెలుసబ్బా ఈమెకు' అని ఆశ్చర్యపోతూ ప్రతి నమస్కారం చేశాడు స్వామి.
'మిమ్మల్ని చాలా సార్లు పేపర్లో ఫోటోలో చూసినాను సార్' స్వామి సందేహాన్ని బద్దలు కొట్టింది.
“మీతో కొన్ని వ్యక్తిగత విషయాలు మాట్లాడాలని వచ్చానమ్మా' అన్నాడు స్వామి.
ఆమె మౌనంగా ఆశ్చర్యంగా ప్రశ్నార్థకంగా చూసింది. ఆమె ఇంట్లో ఎవరూ కనిపించడంలేదు.
ఆమె ప్రశ్నను అర్థం చేసుకున్నవాడిమాదిరి ఆమె కళ్ళల్లోకి సూటిగా చూస్తూ “మీకు పెళ్ళైందా?'
అని అడిగాడు.
“అయింది సార్, ఆయన బస్సు ప్రమాదంలో చనిపోయినాడు సార్'.
“అయ్యో! సానుభూతి చూపినాడు. వివరాల జోలికి పోకుండా మళ్ళి ఎవరినైనా పెళ్ళి చేసుకో కూడదామ్మా!. పెద్దతరహాతో సలహానిచ్చాడు స్వామి.
“నాకు ఎవరినీ చేసుకోవాలని లేదుసార్' టకీమని చెప్పేసింది ఇంద్రాణి. ఈ జీవితాన్ని ఇలాగే ఒంటరిగా బదుకుదామను కున్నానుసార్. చాలామంది అడిగారు సార్! నేనే వద్దన్నాను".అంది.
 ఆమె తన మనసు తలుపులు పూర్తిగా మూసేసు కుంది.అయినా పట్టువదలని విక్రమార్కునిలా స్వామి శివయ్య గురించి చెప్పినాడు. ఆయన
మంచితనాన్ని, ఆశయాన్ని గురించి చెప్పినాడు.

 ఆమె విని “థాంక్స్ సార్! మీలాంటి పెద్దలు నాకు
మంచి చేయాలని వచ్చినందుకు.  నానిర్ణయాన్ని మార్చుకోలేను సార్!"ధృఢంగా చెప్పేసింది.

          వెనుతిరిగాడు స్వామి.

ఆమె నిర్ణయాన్ని చెప్పేసినాడు స్వామి శివయ్యతో.
శివయ్య పూర్తిగా నిరుత్సాహపడినాడు. అయినా నిండుకుండలా తొణకలేదు. మౌనంగా ఉండిపోయినాడు.

                  **     ** ‌  **          ***

            కొన్నాళ్ళు గడిచి పోయాయి.

శివయ్య దగ్గరికి  కొంతమంది వచ్చినారు ఒకరోజు.
వాళ్ళ సమస్య ఏమంటే, ఓబులేసు,సుంకోజమ్మలకు వెంకటమ్మ ఒకటే కూతురు. ఆమెకు చిన్నప్పుడే పెళ్ళి చేసినారు.పెళ్ళైన రెండు రోజులకు ఆమె మొగుడు ఆమెను విడిచి దేశాంతరం పోయినాడు.      ఐదేండ్లయిపోయింది. ప్రాయంలోవుంది. పక్కింటి మల్లిగాడు ఆమెను పెళ్ళిచేసుకుంటానని రోజూ తాగొచ్చి గొడవ పెడుతున్నాడు. ఆ పిల్ల ఒప్పుకోలేదు. రోజు సతాయిస్తున్నాడు.ఆమె తండ్రి ఓబులేసేమో తాగుబోతు. పైగా రోడ్లపై అడుక్కుంటుంటాడు. మల్లిగాన్నించి తమను తప్పించాలని సుంకోజమ్మ తన కూతుర్ని
తనతో పాటు తీసుకొని వచ్చింది శివయ్య దగ్గరికి. 
    శివయ్య పని తాను పనిచేసే స్వచ్చంద సంస్థ తరపున మహిళల సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించడమే.
       శివయ్య అంతావిన్నాడు. పోలీసులకు  ఫిర్యాదు చేయమని సలహా ఇచ్చాడు."పోలీసులెవరూ తమ గోడు పట్టించుకోవటం లేదు సారూ! ఎట్లైనా మల్లిగాన్ని నువ్వే గట్టిగా అరుసు సారూ!" అని ప్రాధేయపడింది.

     ఆమెను చూస్తే జాలేసింది. ఆమె కూతురు వెంకటమ్మను చూశాక ఇంకా ఎక్కువగా జాలేసింది.
రేపు వాని కత చూసుకుంటానన్నాడు.మరుసటి రోజు మల్లిగాడుండే చోటికి పోయినాడు. 'మల్లి' అంటే నువ్వేనా అనడిగాడు శివయ్య.

“ఏం, ఏంకావాలి? నేనే!" అన్నాడు నిర్లక్ష్యంగా మల్లి.
వెంకటమ్మను వెంటపడుతున్నావట. ఏం వాళ్ళకు ఎవ్వరూ లేరనుకున్నావా? ఆమెకు ఇష్టం లేక పోయినా వాళ్ళతో నీకేంపని? గట్టిగా నిలదీసిట్లు అడిగాడు శివ.
“అదేం సస్వరా! రోజుకొకర్ని తగులుకుంటూ ఉంటాదే, నన్ను ఒకరోజు తగుల్కోమన్నా!
ఇప్పుడు నిన్ను తగుల్కునిందా? 'రంకు మొగుని లాగా వచ్చావా! అవి ఇడిసిన లంజలు. పెద్దదేమో
పెద్దలంజ, దాని కూతూరేమో చిన్నలంజ' ఇంకా అనరానిమాటలు మల్లి అంటుంటే శివయ్యకు
కోపం వచ్చింది.
“ఏం కూస్తున్నావురా లమ్డీకొడకా! ప్రతి ఆడదీ నీకు లొంగకపోతే లంజలంటావా! తంతా నాకొడకా" ఉరుముతూ వాని మీదకు పోయినాడు.
అప్పటికే చుట్టూ చాలామంది గుమిగూడి వీళ్ళ గలాటా చూస్తున్నారు. ఈలోపల ఆఫీసు లో పనిచేసే వారికి ఈ విషయం తెలిసిపోయింది. అ శివన్నపైన ఎవడో చేయి చేసుకున్నాడని వాళ్ళకు
వార్త అందింది. 
  వారు పోలీసులను పిలుచుకు వచ్చారు.
పోలీసుల్ని చూసినాక మల్లిగమ్మునుండిపోయినాడు.
“ఏమనుకున్నావురా! మాతో పెట్టుకోకు. మంచికి మంచి చెడ్డకు చెడ్డ. మర్యాదగా వుంటే
సరి. లేకపోతే ఇక్కన్నించి వెళ్ళిపో. రెండు రోజులు టైం ఇస్తున్నాం అన్నారు" అక్కడి కొచ్చిన శివ మిత్రులు.


                   **   **      **      **

శివ పెళ్ళి చేసుకుంటున్నాడని కార్యకర్తలంతా వచ్చి చెప్పేదాకా స్వామికి తెలీదు. శివ
వెంకటమ్మను చేసుకుంటున్నాడని. గుంటికింద సుబ్బరాయుని గుళ్ళో పెళ్ళంట. కొందరైతే
“అంతాఅయిపోయింది. పెళ్ళై రెండ్రోజులైంది." ఇలా రకరకాలుగా చెపుతున్నారు.
రెండ్రోజుల్నుంచి శివ కనిపించలేదు. కారణం తెలీదు. ఏదైనా పనుండి దగ్గరుండే ఊరికి
పోయినాడేమో ననుకున్నాడు స్వామి.
రెండ్రోజుల తరువాత శివ కనిపించాడు. అతనిలో ఎలాంటి ఆందోళన కనిపించడంలేదు.
పెళ్ళిచేసుకున్న ఆనందం కూడా కనిపించడంలేదు.
అందరూ చెప్పిన విషయాన్నే శివముందుంచాడు స్వామి. శివ ఏంచెప్తాడోనని ఆసక్తిగా
చూశాడు స్వామి.
వెంకటమ్మను తాను తప్పక పెళ్లి చేసుకుంటానని ఆమెకు మాటిచ్చినట్లు చెప్పినాడు శివయ్య.
ఒకసారి స్వామి సలహా తీసుకుందామని వచ్చానన్నాడు. స్వామి ఎంతో సంతోషించాడు.
“చేసుకో శివా నీ పెళ్ళి ఉద్యమానికి ఆటంకం కాకుండా చూసుకో. అంతే! ఆమె నిన్ను వెనక్కు లాగకుండా చూసుకో" అన్నాడు స్వామి.
ఇంతలో శివ తల్లిదండ్రులు వచ్చారు. “చూడండి సార్! మావాడు ఎట్లా చేస్తాన్నాడో!
బగిసినమైపోతాంది. అడుక్కునే వాళ్ళ పిల్లను చేసుకుంటాడంట. కులం తక్కువోళ్ళను చేసుకుంటే
మాపరువేంగాను. పల్లెల్లో మీకు తెలిందేముంది. మమ్మల్ని చిన్నచూపు చూస్తారు. బంగారట్టాంటి
సంబంధం చూసినాము. వీడేమో ఉన్నట్టుండి ఇట్లా చేస్తాన్నాడు. పార్టీలో పని చేస్తున్నాడంటే ఏదో
పదిమందికి మంచి చేస్తాన్నాడులే అనుకుంటిమి. వీడు ఇట్లా అయిపోతాడనుకోలే సామి” అంటూ
శివ తల్లి సుజాతమ్మ దాదాపు కన్నీళ్ళు పెట్టినంతగా గద్గగ స్వరంతో మాట్లాడింది.
“అతనిష్టం లేమ్మా!" చెడ్డపనేం చేయలేదు. మంచిపనే చేస్తున్నాడు. ఈ కాలంపిల్లోడు కాదమ్మా!
శివ చాలా మంచివాడు. మీకేమి చెడ్డ పేరు తీసుకురాడులేమ్మా! అతనికేమీ కాకుండా మేమంతా ఉన్నాంలేమ్మా!" ధైర్యం చెప్పాడు స్వామి.
శివ తల్లిదండ్రులు చాలా సేపు అక్కడే ఉండి శివ పట్టుదల చూసి "నీచావు నువుచావు"
అంటూ వెళ్ళిపోయారు.
రెండ్రోజుల తరువాత శివయ్య వెంకటమ్మను గుళ్లో పెళ్ళి చేసుకున్నాడన్న వార్త ఊరంతా వ్యాపించింది.
శివయ్యను పలుకరించడానికి పేదల గుడిసెలుండే ఇందిరానగర్ వైపు నడకసాగించాడు స్వామి సాలోచనగా.

రచన
పిళ్లా విజయ్
సెల్: 9490122229

Comments

Popular posts from this blog

ఇండియాలో_ఆక్సిజన్_వదిలే_ఆవులున్నాయా

Control over NSE