గుంటూరు దయ్యం
అప్పటికింకా నావయస్సు పదేళ్ళు దాటలేదు. మేమప్పుడు కడపజిల్లా రాజంపేటలో ఉండేవాళ్ళం. అందరికంటే చిన్న వాన్ని కావడం వల్ల, తల్లిలేని వాణ్నవడం వల్ల అందరూ నన్ను అల్లారు ముద్దుగా చూసుకొనే వారు. మా వదినె మరీనూ. ఓ రోజు ఉన్నట్టుండి భోజనం చేస్తూ ఉండగా గట్టిగా అరుస్తూ మా వదినె గభాల్న లేచి మంచం మీదకి వెళ్లి పడుకొనింది.
గుంటూరు యాసలో “ఏమండీ! ఇలాగానే భోజనం పెట్టేది? " అంటూ మాట్లాడటం ప్రారంభించింది. కొంత సేపు ఎవరికీ అర్థం కాలేదు. పదినిమిషాల తరువాతమామూలు మనిషైంది.
అప్పుడు ఇంట్లో అందరూ మావదినెకు దయ్యం పట్టిందని తీర్మానించారు. మా అన్న మాత్రం ఊర్లో లేడు. ఆయన రాగానే వదినెకు దయ్యం పట్టిన విషయం చెప్పారు. ఆయన ఒక్కమాటలో 'దయ్యం లేదు గియ్యం లేదు' అంటూ కొట్టిపారేశాడు.
మానాన్న మాత్రం దయ్యం పట్టిందనే నమ్మాడు. రెండు రోజుల తరువాత ఒక మంత్రగాణ్ని
పిలుచుకు వచ్చాడు. మంత్రగాడు ఇంట్లో నడి మధ్యలో ఒక ముగ్గువేశాడు. ముగ్గు ముంగిట
మావదినెను కూర్చోబెట్టి మంత్రాలు చదవనా రంభించాడు. వేప మండలు పట్టుకొని మంత్రాలు ఉచ్ఛరిస్తూ మధ్య మధ్యలో "పలుకవే! అంబ పలుకవే" అంటూ వేప మండలతో కొట్టడం మొదలు పెట్టాడు. ఆమె ఊగిపోతూ ఉంది. జుట్టు విరబోసుకొని ఉంది. మంచి పసుపు వన్నె చీర కట్టింది. బిగుతైన జాకెట్టు ధరించి ఉంది.
కొంత సేపట్లోనే మావదినె మాట్లాడటం మొదలు పెట్టింది.
“ఒరేయ్! నేను సుశీలను రా!" అంటూ " ఊగుతూ ఉంది. గుండ్రంగా నడుము నుంచి వంగి
శరీరాన్ని తిప్పుతూ ఉంది. జుట్టు నేలంతా పారాడుతూ ఉంది. “ఓం! హ్రీం! క్లీం!" అంటూ ముగ్గులో ఉంచిన అగ్నిలో సాంబ్రాణి చల్లాడు మంత్రగాడు.
పొగదట్టంగా లేచింది.
'ఏ ఊరే నీది?" మంత్రగాడి ప్రశ్న.
“గుంటూరురా!"
“ఎందు కొచ్చావే!"
"నా కోరికలు తీరలేదురా!"
“ఏం కావాలే నీకు?"
“నువ్వే కావాలి రా!
“ఎందుకే?"
“నువు బాగున్నావని"
“ఇదిగో వచ్చానుగా"
"నువ్వు కాదురా! నీ ప్రాణాలు కావాలిరా!"
“ఏమే! నీకు పొగరు!" వేపమండలతో రెండు దెబ్బలు కొట్టాడు మంత్రగాడు.
వెంటనే ఊగుతూ, తిరుగుతూ ఉన్న మావదినె స్పృహ కోల్పోయింది. స్పృహ నుంచి తేరుకున్నాక మామూలు మనిషయింది. అంతవరకు జరిగినవేవి ఆమెకు గుర్తుకు లేవు.
పక్కింటి రఘురామ్ వచ్చి ఎవరైనా మంచి డాక్టరుకు చూపించమన్నాడు. నాల్గు రోజులు చూసి చూపిస్తామన్నాడు మానాన్న.
“ఏదో మెంటల్ గా అప్ సెట్ అయ్యుంటుంది. రెండ్రోజుల్లో సర్దుకుంటుంది లే” అన్నాడు మా అన్న.
వారం రోజుల వరకూ బాగానే ఉంది. ఎనిమిదో రోజున మళ్ళీ మావదినె నట్టింట్లో ఊగడం మొదలు పెట్టింది. జుట్టంతా విరబోసుకుంది. పైటజారి పోయినా పట్టించుకోలేదు. కళ్ళు వెడల్పు చేసి చింతనిప్పుల్లా చూస్తోంది. మా అన్న విచిత్రంగా చూస్తున్నాడు.
“ఆకోతిగాన్ని తెస్తారా! వాడు నన్ను వదిలించేవాడా! నేను వదలుతానా! నేను వచ్చింది ఎందుకండీ? నాదాహం తీరాలి కదా!" పళ్ళుపటపట కొరుకుతూ పైట సర్దుదామని దగ్గరకు వెళ్లాడు మా అన్న, ఒక్క తోపున దూరంగా తోసింది. విసిరిపడ్డాడు
మా అన్న. “అంత బలం ఆమెకు ఎలా వచ్చిందా" అంటూ ఆశ్చర్య పడ్డాడు.
రెండు నిమిషాల్లో ఆమె మెల్లగా కిందకు పడిపోయింది. ఆమెను మెల్లగా పడిపోకుండా
తన చేతుల్లో పొదివి పట్టుకున్నాడు మా అన్న.
డాక్టరు వచ్చి చూశాడు.
“శారీరకంగా ఆరోగ్యంగా ఉంది. మానసికంగానే ఏదోలోపం ఉంది. ఎక్కడో టెన్షను ఉండవచ్చు. ఏదో అశాంతి ఉండవచ్చు. సైకియాట్రిస్ట్ కు చూపండి. అంటూ సలహా ఇచ్చాడు డాక్టరు.
మనోవ్యాధి నిపుణుడు చందాల సూర్య ప్రకాశ్ దగ్గరకు తీసుకెళ్లాడు మావదినెను మాఅన్న,
ఆమెను చిన్న సైజు ఇంటర్యూ చేశాడు.
కుటుంబ పరిస్థితులన్నీ కనుక్కున్నాడు. ఆమె అనారోగ్యానికి మూలకారణం 'ఏమిటో'
చూచాయగా అర్థమైంది ఆయనకు.
కొద్ది సేపట్లోనే మావది నెను బయట కూర్చోమన్నాడు. మాఅన్నతో డాక్టరు చెప్పడం మొదలు పెట్టాడు.
"మీరేం ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఆమెకు హిస్టీరియా లక్షణాలు ఉన్నాయి. ఏదో
మానసిక అశాంతి వేదిస్తోంది. పెళ్ళయి ఆరు నెల్లయింది. పుట్టింటి మీద ధ్యాస ఉంది. మీ ఇంట్లో
వేధింపులు ఉన్నాయి. ఆమె అత్త, అవ్వో, మరదుల్లో ఎవరో ఒకరు వేధిస్తూ ఉండవచ్చు. సూటిపోటి మాటలు కావచ్చు. పనిభారం కావచ్చు. ఇలా ఏదైనా ఉండవచ్చు."
జాగ్రత్తగా వింటున్నాడు మా అన్న.
"మీరు చేయవలసిందల్లా ఆమెను కొంతకాలం పుట్టింటికి పంపండి. మానసికంగా ప్రశాంతంగా
ఉండేందుకు రోజూ గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేయమనండి. సమస్యల నుంచి దూరంగా ఉంటే
కల్లోల మనస్సు కుదుటపడుతుంది. సముద్రంలో తుఫాను చెలరేగితే ఎలా ఉంటుందో అలా ఉంది
ఆమె మనస్సు. తుఫాను తీరం దాటితేనే సముద్రంలో ప్రశాంతత వస్తుంది. అలాగే ఆమె మనస్సు కూడా.
“నాకో సందేహం డాక్టర్"
“అడగండి' మా అన్న వైపు చూస్తూ అడిగాడు డాక్టరు.
"నా భార్య సొంత వూరు కడప. కాని మాట్లాడింది. గుంటూరు యాసలో పైగా ఆమె చదువుకోనూ లేదు. ఆమె అలా ఎలా మాట్లాడగలిగింది?" ఆశ్చర్యంగా అడిగాడు మా అన్న
చిరునవ్వుతో డాక్టరు చెప్పడం మొదలు పెట్టాడు. "ప్రతి మనిషికి మెదడులో రెండు అరలుంటాయి. ఒకటి బాహ్యంగా, ఇంకోటి అంతర్గతంగా, బాహ్యంగా ఉన్నది చైతన్యంలో ఉంటుంది. అంతర్గతంగా ఉన్నది నిద్రావస్థలో ఉంటుంది. మనం చిన్నప్పుడు పొందే అనుభవాలన్నీ నిద్రావస్థలోకి వెళతాయి. భయం, ధైర్యం, దు:ఖం, బాధ, దయ్యం, దేవుడు భావనలు మొదలైనవన్నీ నిద్రావస్థలో ఉంటాయి.చీకటి పడ్డప్పుడు దెయ్యాలుంటాయని అమ్మ పిల్లలతో చెపితే చీకటి అయినపుడల్లా ఆ దెయ్యం
భావన మెదడులోకి అంతర్గతంగా గుర్తుండి పోతుంది. పెద్దయ్యాక కూడా చీకటి అయినపుడల్లా
దెయ్యం భావన గుర్తుకొస్తూ ఉంటుంది. పైగా ఆ భయం తాలుకూ ప్రేరణలు చైతన్యంలోకి వచ్చి
భయకంపితుల్ని చేస్తాయి. అలాగే ఆమె యాసకూడా. చిన్నతనంలో ఎవరో ఒకరు గుంటూరు
వాళ్ళు మాట్లాడిన యాస ఆమె మెదడులో నిలిచిపోయింది. అదే యాస ఈ సందర్భంలో వచ్చింది అంతే.
ఆశ్చర్యంగా ఆసక్తిగా వింటున్నాడు మా అన్న. “తగ్గిపోతుందంటారా?" ఆందోళనగా అడిగాడు
"తప్పకుండా! మీరు ఆమెను ప్రేమగా చూసుకోండి. ఆమెకు తల్లిదండ్రులు దూరంగా ఉన్నారన్న భయం తొలగి మీరు కొండంత అండగా ఉన్నారన్న ధైర్యాన్ని ఇవ్వండి! అప్పుడు ఇలాంటి సైకో భయాలు అసలురావు".
“థాంక్యూ! డాక్టర్. మంచి సలహాలు చెప్పారు" అంటూ నిశ్చితాభిప్రాయంతో లేచాడు మా
అన్న.
__ పిళ్లా విజయ్,9490122229
Comments
Post a Comment