ఆదర్శ రచయిత





        సెల్ ఫోన్ మ్రోగింది. ఎవరు ఫోన్ చేశారా అని సెల్ ఫోన్ లో పేరు కనబడగానే ఆత్రంగా
మీట నొక్కాడు మాట్లాడటానికి.
    "మీ అక్క మరణించింది", అటువైపునుంచి బాధతో చెప్తున్న తన చిన్ననాటి మిత్రుడు.
“అరెరే! ఎంతపని జరిగింది. ముందుగా అనుకొన్నా. కానీ ఇంత తొందరగా ఇలా జరుగుతుందనుకోలేదు.” అన్నాడు కిశోర్. “ఇప్పుడే బయలుదేరుతున్నా. ఆఫీసులో లీవు తీసుకుని ఇప్పుడే బయలుదేరుతున్నా. నామేనల్లునికి ఫోన్ చేశారా? నేనే అందరికీ చేస్తాలే". అంటూ ఫోన్ కట్ చేశాడు కిశోర్.
       కిశోర్ ఏది మాట్లాడినా ముక్తసరిగా ఉంటుంది. పైగా ఆయన కథా రచయిత కావడంవల్ల ఎప్పుడు ఎలా మాట్లాడాలో బాగా తెలుసు.    
    మాట్లాడినప్పుడల్లా బూతు మాటలు వస్తాయి.
నోటిజిల. ఎవరైనా అట్లా మాట్లాడడం ఏమిటని అడిగితే అలవాటయిపోయిందని సమాదానం
వస్తుంది.
       బస్సు ఎక్కినాక అక్క గురించి ఆలోచనలు ముసురుకున్నాయి కిశోర్‌కు. బావమరణించాక
అక్కే కుటుంబ బాధ్యతలన్నీ మోసింది. తనను చదివించింది. కొడుకునూ బాగా చదివించింది.
మిషను కుట్టేది. చీరల వ్యాపారం చేసేది. ఎంతో పొదుపుగా సంసారం సాగించింది. అంతోఇంతో
సుఖపడే దశలో అకాలమృత్యువు అక్కను లాక్కెళ్ళి పోయింది.
       బస్సు పల్లెలో ఆగింది. దిగి దిగ గానే నేరుగా ఇంటికి వెళ్ళాడు ఆదుర్దాగా కిశోర్. బంధువులు
రోదిస్తున్నారు. కిశోర్ మేనల్లుడు దిగులుగా ఉన్నాడు. మామను చూడగానే దగ్గరకు వచ్చాడు.
దహన కార్యక్రమానికి కావలసిన ఏర్పాట్లు గురించి అడిగాడు కిశోర్,
    గుంత తీయడానికి ముగ్గురు కూలీలు వచ్చారు.
“ఎంత?" అడిగాడు కిశోర్
“ఎంతోకంతలే సారు. మీరియ్యాల, మేంతీసుకోవాల" అన్నాడో కూలీ.
    "సరేలే ఎంతో చెప్పు. నేను వందరూపాయలిస్తా మీకు సమ్మతమేనా?" మెలిక పెట్టాడు కిశోర్.
“వెయి రూపాయలీండి సామి" దీనంగా అడిగారు. ఇప్పుడు చనిపోయేవారు బాగా తగ్గిపోయినారు. పైగా కూలీలు బాగా తగ్గిపోయారు. ఎక్కువ మంది వలస వెళుతున్నారు. ఏదో ఇలాంటప్పుడే నాలుగు డబ్బులు రాల్చుకోవాల.
“నీయమ్మ! ఒక గుంత తీయటానికి వెయ్యి రూపాయలా? అరగంట పని".
“చాలా కష్టముంటది సామి. నేల గట్టిగా ఉంటాది. తవ్వాలంటే గడారుతో చాలా సెమపడాల సామి". చెప్పినారు ముగ్గురు ఒకేసారి.
“మీరేమి సెమపడొద్దు పోండి, దొంగనాకొడకల్లారా" అంటూ వాళ్ళను అక్కన్నించి పంపించేశాడు.
సెల్ ఫోన్ లో తన మిత్రుడు రామిరెడ్డికి ఫోన్ చేశాడు.
“గుంత తీయాల రామిరెడ్డి, నారొక జె.సి.బి. కావాల, మాఅక్క చనిపోయింది. గుంత తీయడానికి
కూలినాకొడుకులు ఎంతంటే అంత అడుగుతాండారు. నీ జే.సి.బి. పంపిస్తావా? గంటకు ఎంత?"
'గంటకు ఎనిమిది వందలన్నా. పనిలో ఉంది నువ్వు ఏదో కార్యమంటున్నావు గాబట్టి పంపిస్తాలే. ఎక్కడో చెప్పు మావాళ్ళు గుంతతీసేసి నీకు చెప్తారు. అటువైపునుంచి సమాధానం వచ్చింది.
సాయంత్రానికల్లా దహనం కార్యక్రమం ముగిసింది. “దొంగనాకొడుకులు అరగంట పనికి
మూడువేలు అడిగారు చూడన్నా! అదే జెసిబితో ఎనిమిది వందల్లో అయిపాయ".
"కూలీలంతే,మన అవసరముంటే ఎంతంటే అంత డిమాండు చేస్తారు"అంటూనడువ సాగాడు
బంధువు.
అక్క మరణించిందన్న బాధకన్నా కూలీలు మూడువేలు అడిగారన్న బాధే రచయితను
తోడేస్తోంది.

              **      ** ‌‌       **

        పొద్దున్నే ఆఫీసుకెళ్ళగానే “మనం సమ్మె చేయాలన్నా. జీతాలు పెంచాలని మన డిమాండు.
ధరలన్నీ పెరిగిపోయినాయి. మనవి మాత్రం కొంచెం కూడా పెరగలేదు." సంఘ నాయకుడురచయిత కిశోర్‌కు చెప్పాడు మెల్లగా.
“దానెమ్మ మనకెందుకు పెంచరన్నా? మనతో పనిచేయించుకోవడంలే? త్యారకిస్తాండారా
నాకొడుకులు. అయినా మనం ఎంత డిమాండ్ చేస్తున్నాం?" రచయిత ప్రశ్న.
“అరవైశాతం పెంచాలని, కనీసం 40శాతానికన్నా ఒప్పుకోవచ్చు"నాయకుని జవాబు.
"సరేలేన్నా, మనం చేసేపనికి ఇప్పుడిస్తున్నదే ఎక్కువ", పక్కనున్న మిత్రుడందుకున్నాడు.
చురాచురా చూశాడు రచయిత.

పిళ్లా విజయ్
సెల్: 9490122229


Comments

Popular posts from this blog

ఇండియాలో_ఆక్సిజన్_వదిలే_ఆవులున్నాయా

Control over NSE