చతురత



ములకనాడు (కడప జిల్లా ప్రాంతం)లో విజయనగరాన్ని ఉదారుడనే రాజు పాలిస్తున్నాడు. ఉదారుని సైన్యాధిపతి దృఢవర్మ కుమారుడు జయకేతన
మంచి చురుకైన యువకుడు. చక్కదనం, భుజబలంతో పాటు బుద్ధిబలం ఉన్న
వాడు.
         జయకేతన్ తల్లిదండ్రులకేగాక రాజ కుటుంబీకులందరికీ తలలో నాల్కవంటివాడు. అలాంటి అబ్బాయికి రాజు మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలనుకున్నాడు. మంచి సౌందర్యం, శృంగారవతి అయిన కన్యను వెదకమని తన పురోహితునికి చెప్పినాడు. ఈ విషయం జయకేతనకు తెలిసింది.
       జయకేతనకు పెళ్లంటే ఇష్టం లేదు.అందువల్ల తనకు తెలిసిన మంత్రులతో “సంసార దు:ఖానికి మూలంపెళ్లి. పెళ్ళంటే నాకు పడదు. బ్రహ్మచారిగానే ఉంటాను. అదే నాకు ఆనందం' అన్నాడు.
       మంత్రులు 'జయా! పెళ్లి చేసుకుంటే భార్యతో వచ్చే సుఖం, ఆనందంఅంతాఇంతా కాదు. పిల్లలు కలిగితే వారిని ఆడించి, పాడించి మీ జీవితం ఆనందమయం చేసుకోవచ్చు. ప్రతి మనిషి కర్తవ్యం మానవ పరంపరనుముందుకు తీసుకుపోవడమే. అదే మనిషి ధర్మం 'అన్నారు.
         'స్త్రీల మొహం చూడలేను. ఏదైనా వేరే ప్రాంతానికి వెళ్లిపోతాను. నన్ను విడిచి పెట్టండి' అన్నాడు జయకేతన.
         అందరూ ఎంతగానో నచ్చ చెప్పే ప్రయత్నం చేసినారు. బలంవంతగా పెళ్లి చేస్తారేమోనని శంక కలిగింది జయకేతనకు.
ఒక రోజు అర్థరాత్రి ఎవరికీ చెప్పకుండా తమ రాజ్యం వదలి పెట్టి వెళ్లిపోయాడు.పాండ్యదేశం చేరుకున్నాడు. అక్కడ ఒక దేవాలయం సమీపంలో ఉన్న ఒక నల్ల ద్రాక్ష పందిరి తోటలో ఉన్న ఒక ఇంటిలో బసచేసినాడు.
       ఆ తోట యజమానికి ఒక కూతురు ఉంది. ఆమె జయకేతనను చూసి మోహించింది. అదే విషయం తన తండ్రితో చెప్పింది.
         ఆయన జయకేతన్ తో వివాహ విషయమై చర్చించాడు. మంత్రులతో
చెప్పినట్లే పెళ్ళంటే తనకు ఇష్టం లేదని చెప్పినాడు. ఈ విషయం మెల్లగా పాండ్య
రాజు చెవిన పడింది.రాజు అతనిని సాదరంగా తన రాజభవనానికి ఆహ్వానించాడు.
 'జయ కేతన్ ! ఎందుకు మా దేశం చేరుకున్నారు ? ఏదైనా మాతో పని ఉందా ?”
అడిగాడు రాజు.
'మా తల్లిదండ్రులు నాకు పెళ్లి చేయాలను కున్నారు. నాకిష్టం లేదు. అందుకే ఇల్లొదిలి  మీ దేశంలోకి వచ్చాను'
     "పెళ్లి వద్దనే వారుంటారా ? ఇంకేదైనా కారణం ఉంటే చెప్పు'
         జయకేతన కొంచెం ఆలోచించి చెప్పడం మొదలు పెట్టాడు. 'నాకు పూర్వజన్మ గుర్తుంది. ఆ జన్మలో నేను మగ హంసను. నా ప్రియమైన సఖి నన్ను ప్రేమగా చూసుకొనేది. ఒక రోజు మేమున్న సరోవరానికి దగ్గరలో బంగారు
పద్మాలున్న సరోవరం ఉందని తెలిసి చూడటానికి నేనొక్కడనే వెళ్లాను. అక్కడ
విహరిస్తున్న సమయంలో వీచిన చల్లని గాలికి నిద్రపట్టేసింది. ఆదమరచినిదరపోతున్న నన్ను ఎవరూ లేపలేదు. నేనెంతకూ రాకపోయేసరికి ఇంకో హంసను తగులుకొని రాలేదని విలపిస్తూ ఉండింది నా భార్య. ఆ వియోగంతో
అమితవేదన చెంది ఆమె మరణించింది. తిరిగి వచ్చిన నేను ఆమె మరణించి ఉండడంతో నేనూ ఎంతగానో బాధపడి హంస జన్మను విడిచి పెట్టాను. ఈ జన్మలో మనిషిగా జన్మించాను. ఆమె మీద ప్రేమతో నేనిప్పుడు ఎవరిని పెళ్లి చేసుకోలేదు' అన్నాడు.
       పాండ్యరాజు కుమార్తె 'శాలిక' చెలికత్తెల ద్వారా తెలుసుకొందీ విషయాన్ని.శాలిక అతన్ని చూడాలని అతనున్న భవనం దగ్గరకు పోయింది. అతన్ని దూరం నుంచి చూడగానే అతని అందం దర్పం వృక్షం చూసి వీడురా నా వయసుకు సరి జోడు అనుకుంది.ఆమె మన్మథ
స్థానం చెమ్మగిల్లింది.పాలిండ్లు భారమయ్యాయి
 అతన్నే పెళ్లి చేసుకొని తన మన్మధ బాధను తీర్చుకోవాలన్న ప్రగాఢ వాంఛ కలిగింది. తన మనసులోని కోరిక తన తండ్రితో చెప్పింది.
       జయకేతనను ఎలా ఒప్పించాలో రాజు తన మంత్రులతో చర్చించి మంత్రాంగం నడిపాడు.
      మంత్రుల్లో ఒక మంత్రి భార్య శాలిక పెళ్లి జయకేతనతో జరిగేటట్లు చేస్తానని హామీ ఇచ్చింది. ఒక పథకం ప్రకారం శాలికను ఒక ఉద్యానవనానికి తీసుకువచ్చింది...
జయకేతనను కూడా అదే ఉద్యానవనానికి తీసుకువచ్చారు పరిచారికలు.
        అక్కడ ఉద్యానవనానికి కాపలాగా ఉన్న శాలిక చెలికత్తే వారిని ఆపేసింది. కారణమడి గారు పరిచారికలు. ' మా రాజకుమార్తె శాలికకు పెళ్లి అన్నా, మగడన్నాపడదు. ఎందుకంటే క్రితం జన్మలో ఆమె హంస. తన భర్త వేరొక సరోవరం పోయి రాకపోవడంతో ఇంకో హంసని తగులుకొని ఉంటాడని భావించి ప్రాణాలు
విడిచింది. ఆ హంసయే మా రాజకుమార్తెగా జన్మించింది' అని చెప్పిందా చెలికత్తె.
     మంత్రి భార్య ఇలా చెప్పమని ముందే చెప్పింది వాళ్లకు.
     జయకేతన ఆనందంతో శాలికను చూడాలని పట్టుబట్టి ఉద్యానవనం లోపలికి ప్రవేశించాడు.
     శాలికను చూడగానే ఆమె తన కోసం పుట్టిన గత జన్మలోని హంసగా భావించాడు. 'నీ సౌందర్యం అమర స్త్రీలకు కూడా లేదు. నీవే నా భార్యవు. ఎంత కాలం నుంచో నీకోసం ఎదురుచూస్తున్నా' అన్నాడు.
       రాజు సంతోషంతో వారిద్దరికీ వివాహం జరిపించాడు.
        కథను ముగించి చిలుక
‘భర్తను ఏవగించుకొనే భార్యను, భార్యను ఇష్టపడని భర్తను కలపాలంటే
చతురత కలిగిన దూతిక ఉండాలి. అలాంటి లక్షణాలు ఆ మంత్రి భార్యకున్నాయి'.
    “ఇలాంటి చతురత నీకుందా?' అడిగింది చిలుక. 
     ప్రభావతి ఏమి చెప్పాలో తోచక ఆలోచిస్తుండగానే భల్లున తెల్లవారింది.

Comments

Popular posts from this blog

ఇండియాలో_ఆక్సిజన్_వదిలే_ఆవులున్నాయా

Control over NSE