సంప్రదాయాలు మనుషుల్ని మూర్ఖులుగా చేస్తాయా...





అది 1985 ప్రాంతం. 
సూర్యారావుగారి అబ్బాయి నరేష్ ఆ జిల్లానుండి ఉద్యోగం కోసం అమెరికా వెళ్లిన మొట్టమొదటి యువకుడు కావడంతో వాళ్ళ కుటుంబానికి అమాంతం పలుకుబడి పెరిగిపోయింది. నరేష్ ఎమ్.టెక్ చేయడమే కాదు స్టేట్ లోనే టాప్ స్టూడెంట్. 
అమెరికాలో లక్షల డాలర్ల జీతమని తెలిసిన వెంటనే ఆ జిల్లా చైర్ పర్సన్ గారు తన మేనకోడలితో పెళ్ళి కుదిర్చేసుకున్నారు. ఆ అమ్మాయి డాక్టర్ చదివింది. బెంగళూర్ లో ఎమ్ ఎస్ చేస్తోంది. ఆరోజుల్లో ఆ జిల్లాలో మొట్టమొదటగా మెడిసిన్ చేసిన అమ్మాయి ఆమె.. అతడితో పెళ్లి జరిగితే అమెరికాలో ప్రాక్టీస్ చేయొచ్చూ అన్న ఊహాలతో సంతోషంగా ఒప్పేసుకుంది. 
   అయితే నరేష్ వాళ్ళ కుటుంబం నియమనిష్ఠలు ,శిష్టాచారాలు ఎక్కువగా ఉన్న వైష్ణవ సంప్రదాయ కుటుంబం. ఆ కుటుంబంలో ఆడవాళ్లు బయటకు రావడం, కాలేజీకి వెళ్లి చదువుకోవడం నిషేధం. అందుకే నరేష్ అక్కచెల్లెళ్లు అందరూ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ లోనే చదువుకున్నారు.
    నిశ్చితార్థం అయ్యింది.  నరేష్ కి కూడా కుటుంబ వారసత్వం బాగా వంటబట్టింది. తన భార్య ఉద్యోగం చెయ్యడం ఇష్టం లేదు. ఆడవాళ్లు ఉద్యోగాలు చెయ్యడం భారతీయ సంప్రదాయం కాదు అని అతడి ఉద్దేశ్యం. పెళ్లి అయ్యాక ఆమెని ఇంటికి పరిమితం చెయ్యాలని భావించాడు. 
    ఒకరోజు కాబోయే భార్యని చూడటానికి బెంగళూర్ వెళ్ళాడు.నరేష్ వెళ్లిన సమయంలో హాస్పిటల్ లో ఒక ఎమెర్జెన్సీ కేసు వచ్చింది. . ఐ సి యూ లోకి తీసుకెళ్లే టైం కూడా లేదు. ఒక వ్యక్తి గుండె ఆగిపోయింది. నరేష్ కాబోయే భార్య అతని ఛాతీ మీద చేతులతో గట్టిగా అదుముతూ ప్రధమ చికిత్స చేస్తోంది. నరేష్ వెళ్ళగానే కనబడిన దృశ్యం అది. అప్పుడే కార్డియాలజిస్టు రావడం అతణ్ణి పేషంట్ ని లోపలికి తీసుకెళ్లిపోవడం జరిగింది. తరువాత ఆ అమ్మాయి నరేష్ ని కలిసింది. నరేష్ కోపంగా ఉన్నాడు. ఆవేశంలో విచక్షణ మర్చిపోయాడు. పరాయి మగాడి ఛాతీ మీద చెయ్యి వేయడానికి సిగ్గులేదా. మనమేంటి..మన కుటుంబమేంటి.. మన సంప్రదయమేంటి.. కనీసజ్ఞానం ఉండక్కర్ల .. అసలు మా ఇంట్లో ఆడవాళ్లు ఎలా ఉంటారో తెలుసా.. సొంత అన్నదమ్ముల దగ్గరైనా సరే  తలవంచుకొని అణకువగా ఉంటారు.. ఆ పనేదో నర్సులకి అప్పగించవచ్చూగా.. నువ్వే చెయ్యాలా అతణ్ణి ముట్టుకొని..?? ఛీ ఛీ అని అసహ్యంగా తిట్టి వెళ్ళిపోయాడు. కాబోయే భర్త వచ్చాడు.. మనసులోని అభిప్రాయాలు పంచుకోవాలని, కబుర్లు చెప్పాలని సంతోషంగా వెళ్లిన ఆమెకు కన్నీళ్లు మిగిలాయి. 
  నరేష్ మాటలు విన్న కొందరు నర్సులు ,డాక్టర్లకు అసహ్యం వేసింది. వీడు మనీషా పశువా.. ఇలాంటి వాడిని జీవితంలోకి 
రానివ్వకండి. అని సూచించారు వెంటనే.

అయితే సూర్యారావు కూడా తన కొడుకునే సమర్ధించాడు. ఇంక చేసేదేం లేక నాలుగు రోజుల్లోనే సంబంధం రద్దు చేసుకున్నారు. ఆ రోజుల్లో నిశ్చితారధం అయ్యాక ఆడపిల్ల పెళ్లి ఆగిపోవడం అంటే కష్టమే. కానీ వాళ్ళు చాలా ధనవంతులు కావడం వల్ల ధైర్యం చేశారు. సంస్కారం లేని ఆ తండ్రీ కొడుకులిద్దరికీ దేహశుద్ధి చేశారు. నష్ట పరిహారంగా రెండులక్షలు వసూలు చేశారు.  చేసినపనికి ఏమీ అనలేక నోరుమూసుకున్నారు సూర్య కుటుంబం వాళ్ళు. 
    ఆ అమ్మాయికి ఒక డాక్టర్ తో పెళ్లి అయ్యింది.
     ఇరవై ఏళ్ళ తరువాత ఒకరోజు నరేష్ ప్రమాదంలో గాయపడి ఆ అమ్మాయి చేస్తున్న హాస్పిటల్ కి వచ్చాడు. 
తానొక డాక్టర్ కాబట్టి అవేమీ మనసులో పెట్టుకోకుండా అతడికి ప్రాణం పోసింది. స్పృహ లోకి వచ్చాక  విషయం తెలిసిన నరేష్ సిగ్గుపడ్డాడు. ఆమెతో మాట్లాడే ధైర్యం చేయలేకపోయాడు. 
   ఒక మనిషి ప్రాణం కాపాడటం ఒక డాక్టర్ గా నా బాధ్యత.నువ్వు పరాయి మగవాడివి కదా  నిన్ను ముట్టుకోవడమేంటి అని వదిలేసి ఉంటే ఈపాటికి నువ్వు చనిపోయి ఉండేవాడివి. నీలాంటి వాళ్ళకి చదువున్నా జ్ఞానం లేకపోవడం దురదృష్టకరం.వెళ్ళు. అని ఆమె చెప్పడంతో తలదించుకొని వెళ్ళిపోయాడు .

Comments

Popular posts from this blog

ఇండియాలో_ఆక్సిజన్_వదిలే_ఆవులున్నాయా

Control over NSE