కథలు ఎట్ల రాస్తాం?
కథలు ఎట్ల రాస్తాం?
అభౌతికమైన ఈశ్వరుడు ఆదిమధ్యాంతరహితుడు కావచ్చు. కానీ మట్టి పిసుక్కుని బతికే ఒక రచయిత రాసిన కథకు ఆదిమధ్యాంతాలు తప్పనిసరి. కానీ ఈ సృష్టిలో మనం దేన్ని 'ఆది' అనుకుంటామో అది నిజంగా ఆది కాకపోవచ్చు. దీన్ని'అంతం' అనుకుంటామో అది నిజానికి అంతం కాకపోవచ్చు. ఆద్యంతాల బిందువులు మారినప్పుడు, ఏది మధ్యస్థం అనుకుంటామో అది నిజానికి మధ్యస్థం కాకపోనూవచ్చు.
జీవితానుభవాల ఆది మధ్యాంతాలు కథలోకి వచ్చేటప్పటికి, అవి కూడా అంతే!
కథ ఒక ముగింపు సన్నివేశంతో అంతమైపోతుంది. కానీ ఆ ముగింపు సన్నివేశంనుంచే రచయిత మెదడులో కథా నిర్మాణం మొదలుకావచ్చు. సావుకూడు అట్లాంటి కథ. ఆ కథలోని ముగింపు సంఘటనే ఆ కథ రచనా ప్రయత్నానికి నాంది పలికింది. కాగితమ్మీద చట్టబద్ధమైన కథకూ, చట్రంలోకి ఇంకా ఒదిగి రాకుండా రచయిత మనసులో నలిగే అనుభవాల పరంపరకూ ఆది మధ్యాంతాల విషయంలో అంత తేడా వుంటుంది. చట్రం రచయిత కోసం కాదు, పాఠకుడి కోసం. చట్రం రచయిత అనుభూతి కోసం కాదు, రచయిత చేసే అనుభూతి వ్యక్తీకరణ కోసం. ఈ చట్రం కోసమే,రచయిత వ్యక్తిగత అనుభూతికి సంబంధించిన ఆదిమధ్యాంతాలు రచనలో తారుమారు అయిపోతాయి. ఆ తారుమారు కావడం వెనక ఒక పథకముంటుంది. ఒక ప్రక్రియ వుంటుంది. ఒక కథను ఎట్లా రాసినానో చెప్పడమంటే ఆ రచన వెనక వున్న పథకాన్ని
గురించి విశ్లేషించడమే అనుకుంటాను. దీనికి ముందుగా పాఠకులకు కథను పరిచయం చేయాల్సిన అవసరముంది. కథలోని రక్త మాంసాల్ని మినహాయించి కేవలం అస్తిపంజరాన్ని పరిచయం చేయడంలో నాకు ఉత్సాహం లేదు. కానీ సందర్భానుసారం తప్పదు కదా!
ఒక ఊర్లో ఒక ముసిలోడుంటాడు. ఆ ముసిలోని పేరు పెద్దప్పయ్య. ఆ పెద్దప్పయ్య చిన్నప్పటినుంచీ మంచి తిండి పుష్టి కలిగినోడు. పెళ్ళి చేసుకుంటాడు. భార్య కాపరానికి వస్తుంది. తన తిండి పుష్ఠితో భార్యను కూడా పస్తులు పడుకోబెట్టినవాడు పెద్దప్పయ్య!
పెద్దప్పయ్యకు ముగ్గురు కొడుకులు. ఆ కొడుకుల్ని పెంచి పెద్దచేసేదానికి జీవితమంతా కడుపుకట్టుకుని బతికినవాడు పెద్దప్పయ్య. అట్లాంటి పెద్దప్పయ్య ముసిలోడు అయిపోతాడు. ఇంక రేపో మరునాడో చచ్చిపోతాడు. అప్పుడు ఆ ముసిలోడు
పెద్దప్పయ్యకు కల్లు తాగలని కోర్కె పుడుతుంది. అది ఒక చిన్న కోర్కె. కానీ అప్పుడు ఊర్లో దుర్భరమైన కరువు తాండవిస్తూ వుంది. కూటికి జరిగేదే గగనమైన ఆ కష్టకాలంలో
కల్లు తాగల్ల అనేదే చానా పెద్ద కోర్కె. .పెద్ద కొడుకు వస్తాడు. కల్లుకు డబ్బులడుగుతాడు ముసిలోడు. ఇవ్వల్లా వద్దాఅని కొంచెం సేపు తర్జనభర్జన పడి చివరికి పెద్ద మనసు చేసుకుని డబ్బులిస్తాడు పెద్ద కొడుకు. సచ్చిపోయే ముసిలోడు కడుపులో కల్లుపడగానే లేచి కూర్చుంటాడు. కల్లుకు
డబ్బులిచ్చిన పెద్దకొడుకు తన పెండ్లాంతో మాటలు పడతాడు. "
ఆ తరువాత ముసిలోడు మళ్లీ మంచంలో పడతాడు. ఈసారి ముసిలోనికి సియ్య(మాంసం) తినల్ల అని కోర్కె పుడుతుంది. కల్లుకు దుడ్లు ఇచ్చినాడు కాబట్టి పెద్ద కొడుకు వంతు అయిపోయింది. చిన్న కొడుకుది గంపెడు సంసారం కాబట్టి కూర
(మాంసం) తినబుద్ది అవుతాంది అని అడిగేదానికి నోరు రాదు. ఇంక మిగిలినవాడు నడిపి కొడుకు. ఆ నడిపి కొడుకును అడిగి చూసినాడు ముసిలోడు. కరువు దెబ్బకు తట్టుకోలేక కడుపునొప్పి పెండ్లాం మరెవరితోనే లేచిపోతే, ఆ పెండ్లాం విడిచి పెట్టిపోయిన పిల్లలతో ఎట్లో జీవితం నెగ్గుకొస్తున్నవాడు ఆ నడిపోడు. తండ్రి మాంసం తినబుద్ధి అవుతాంది అని అడగ్గానే ముందు ఆశ్చర్యపోయి ఆ తరువాత తలొంచుకుని
వెళ్ళిపోతాడు. జీవిత పరంత్రమూ పిల్లోల్ల కోసం బతికిన ముసిలోడు, సచ్చేముందన్నా కొంత సుఖపడి సచ్చిపోదామనుకుంటాడు. కానీ చివరి కోరిక తీరకుండానే సచ్చిపోతాడు. మాంసం మాంసం అని అలమటించి ముసిలోడు సచ్చిపోతే, ఆ ముసిలోని దినాల
కార్యక్రమం కోసం యాట కోసుకుని తిని అంతా పండుగ చేసుకుంటారు. ఆదినాల తర్వాత మూడో దినం పున్నెం దుత్త దింపుతారు. ఆ రోజు ముసిలోని పెండ్లాం ఎక్కిళ్ళు పెట్టి ఏడుస్తుంటుంది. ఆయమ్మ చచ్చిపోయిన మొగుని కోసమే
ఏడుస్తాంది. అనుకుని ఆయమ్మ చిన్నకొడుకు ప్రేమగా మందలించేదానికి పోతాడు. అప్పుడు ముసిల్ది ఏమంటుంది-
3
దినాలకోసం యాట కొట్టి, మీరు తునకలు తిని నా మొగానికి నీళ్ళు కలిపిన పులుసు పోసిరి కదరా! అని వలవలా ఏడుస్తుంది. కథ అయిపోతుంది.
1982-87 మధ్య నేను గుడిపల్లి గ్రామంలో ఏకోపాధ్యాయునిగా పనిచేసినాను. ఆ అయిదేండ్లు ఆ గ్రామంలో సరిగా వానల్లేవు. పంటల్లేవు. గొడ్డు కరువు! ఈ కరువు గురించి కథ రాయాలని ఒక సంవత్సరంపాటు అనుకున్నాను. అనుకోవడమే తడవుగా
కవిత్వం మొదలు పెట్టవచ్చేమో కానీ, కథ ప్రారంభించలేమని నాకు స్వానుభవం ద్వారా తెలుసు. కథ రాసేదానికి మూడ్ కావల్ల. కానీ మూడ్ కు మించి మరేదో కూడా కావల్ల.
అది ఏది? ఇక్కడి తెలుగుదేశంలో సోమాలియా కరువు గురించి కవులు కవిత్వం రాయగలరు కానీ, కథకులు కథ రాయలేరు. ఎందుకు రాయలేరు అన్న ప్రశ్నకు జవాబు వెతుక్కోవడంలోనే, కథకుడికి ఉండాల్సిన ముఖ్య లక్షణం తెలిసిపోతుందను కుంటాను.
స్థూలంగా చెప్పాలంటే, ఒక కథ రాసేదానికి ముఖ్యంగా కావలసింది అంతో ఇంతో జీవితానుభవం! ఈ జీవితానుభవంలోనే కథా వస్తువు పుడుతుంది. కథ పుడుతుంది. పాత్రలు పుడతాయి. సన్నివేశాలూ, సంభాషణలూ పుడతాయి. కథలకు కాణాచి జీవితమే!
అనుభవమే!! అంతేగానీ, సోమాలియా కరువుగురించి ఎంత భావోద్వేగం చెందినా అక్కడి జీవితపు అనుభవం లేకుండా ఇక్కడ కథలు రాయడం కుదరదు. సావుకూడులో కొన్ని యధార్ధ జీవితానుభవాలు వున్నాయి. కానీ ఆ
జీవితానుభవాల స్థల కాలాలు వేరువేరు. మొగుడు చచ్చిపోతే, తట్టలోకి తునకలేయలేదని ఏడ్చిన ముసిల్ది మా పెద్దవ్వ. ఆ అనుభవం అనంతపురంలోది. ఎన్ని సంగటి ముద్దలు చేస్తే అన్ని సంగటి ముద్దలూ తిని పెండ్లాన్ని పస్తులు పడుకోబెట్టిన
పెద్దప్పయ్య నాకేమీ కాడు. ఆ ముసిలోని కథ గోళ్ళ గ్రామం (నా భార్య పుట్టినిల్లు)లోది. ఆ పెద్దప్పయ్య కడసారి కోర్కె తీర్చలేని ముగ్గురు కొడుకులూ నేను పనిచేసే గుడిపల్లి గ్రామస్తులు. ఈ విధంగా సావుకూడు కథలోని ముసిలోడూ-ముసిల్దీ-ముగ్గురు కొడుకులూ నిజజీవితంలో ఒకరికి ఒకరు ఏమీ కారు. వారు జీవించిన కాలం వేరు. స్థలం వేరు. జీవనసందర్భాలు వేరు. కానీ వారి వ్యక్తిత్వాలను నమూనాలుగా స్వీకరించి, ఒక కథా
వాతావరణంలోకి సమీకరించుకున్నప్పుడు ఆ ముసిల్దీ, ముసిలోడూ, ముగ్గురు కొడుకులూ పరస్పర సంబంధీకుల అయినారు. ఇదీ కథలోని కల్పన! ఈ కల్పన యధార్థ జీవితానికి భిన్నమయింది కావచ్చు. కానీ సామాజిక వాస్తవికతకు భిన్నమైంది కాదు. ఈ కల్పన ఇంకొక విధంగా కూడా వుంటుంది. ఒక పాత్రకు సమాజంలోని ఏ ఒక్క వ్యక్తి మాత్రమే నమూనాగా వుండాల్సిన పరిమితి లేదు. ఇద్దరు ముగ్గురు వ్యక్తుల్ని కలిపి ఒక పాత్రగా మలచవచ్చు. కానీ ఆ
ఇద్దరు ముగ్గురు వ్యక్తుల భౌతిక మూలాలలో, సామాజిక స్వభావంలో ఒక ఏకత వుండాల్సిన అవసరముంది.
ముగ్గురు భిన్నమైన వ్యక్తులుంటారు. వారికి ఆడపిల్లలు పుడితే, ఆ ముగ్గురికి ఆడపిల్లల తండ్రులుగా ఒక సామాజిక స్వభావముంటుంది. తమ కూతుర్లకు పెళ్ళిళ్ళు చేసి అల్లుళ్ళను తెచ్చుకున్న తరువాత జీవితంలో మామ పాత్ర ధరించినవారిగ ఆ ముగ్గురు వ్యక్తులకు ఒక సామాజిక స్వభావముంటుంది. ఈ సామాజిక స్వభావపు ఏకతా ప్రాతిపదిక మీద, ఆ ముగ్గురు వ్యక్తులకు చెందిన స్వభావాల్ని, సంఘటనల్సీ సంయోగం చేసి ఒక పాత్రగా రూపొందించవచ్చు. అప్పుడు ఆ పాత్ర ఏ ఒక్క వ్యక్తినో ప్రతిబింబించేదిగా వుండదు. అట్లాంటి ఎందరెందరో వ్యక్తుల సామాజిక స్వభావానికి ప్రాతినిధ్యం వహించే పాత్రగా వుంటుంది. నేను మా అమ్మ గురించి ఒక కథ రాస్తే, ఆ
పాత్ర-కాయకష్టం చేసుకుని బతికే ఇంకెంతో మంది శూద్రకులాల తల్లుల సామాజిక స్వభావాన్ని పట్టిచ్చేదిగా వుండాలని కోరుకుంటాను. ఈ విధంగా వ్యక్తిగత అనుభవాన్ని సాధారణీకరించే కళాప్రయత్నం ఏ రచయితకైనా అవసరమే అని భావిస్తాను. సావుకూడులోని ముసిలోడు పెద్దప్పయ్య పాత్ర నిర్మాణం వెనుక కూడా ఈ పథకమే వుంది.
ఈ విధంగా జీవితంలోని వివిధస్థలాల్నీ, కాలాల్నీ, వ్యక్తుల్ని ఏక స్థల కాల పాత్రలలోకి ఐక్యం చేయడం ద్వారా ఒకానొక సామాజిక వాస్తవికతను
యదార్ధజీవితమంత బలంగా చిత్రించవచ్చు అనిపిస్తుంది. అనంతపురంలో మా పెద్దవ్వ తునకల కోసం ఏడ్చిన సంఘటన జరిగింతరువాతే సావుకూడు కథకు ప్రేరణ వచ్చింది.
ఆ సంఘటనను ప్రధానంగా తీసుకుని ఒక కథానిక రాయొచ్చు. కానీ నాకందులో తృప్తి లేదు. ముసిలోన్ని ప్రధాన పాత్రగా మలుచుకోకపోతే ఆ పాత్రకూ ముగ్గురు కొడుకులకు మధ్య ఇంటర్ యాక్షన్ కు ఆ కథలో అవకాశం వుండదు. పాత్రల మధ్య బలమైన ఇంటర్ యాక్షన్‌కు అవకాశం లేకపోతే, కథలోని వాస్తవికతే జడప్రాయంగా
కనిపిస్తుంది. కానీ సచేతనంగా కనిపించదు. అందుకని కథకు ప్రేరణనిచ్చిన అనుభవాన్ని కథకు ముగింపుగా మాత్రమే మలచుకున్నాను.
సావుకూడులోని ఇతర పాత్రలను కూడా ఏ పాత్రకు ఆ పాత్రనే ప్రధానంగా తీసుకుని వేరువేరు కథలు రాసే ప్రయత్నం చేయొచ్చు. ఆ కథల్లో చివర చమత్కారమైన
ముగింపులు వుండొచ్చు. కానీ కొన్ని పాత్రలకు సంబంధించిన 'కథల్ని' ఒకే కథలోకి క్రోడీరించి, ఆ అన్ని పాత్రలకూ, వాటి 'కథ'లకూ వుండే ఏకైక భౌతిక మూలాన్ని ఆవిష్కరించే ప్రయత్నం ఒక మంచి కథ అవుతుందనుకుంటాను. అట్లాంటి కథలకుండే లోతూ, సౌష్ఠవమూ ప్రత్యేకమైనవి.
ప్రథమ పురుషలో నడిచే కథల్లో 'కథ చెప్పేవాడు' ఒక పాత్ర కాదని అందరికి తెలుసు. కానీ, పాత్రలు అనుభవించే జీవితంలో కథ చెప్పేవానికి కూడా కొంత అనుభవముందని పాఠకులకు నమ్మకం కలిగించడం నాకిష్టం. అందుకోసం నేనుపాత్రలకు నమూనాలు వెదుక్కున్నట్లే కథకుడి గొంతుకోసం కూడా నమూనాలు వెదుక్కునే ప్రయత్నం చేసినాను కొన్నిసార్లు. నేను మొట్టమొదట అట్లాంటి ప్రయత్నం చేసింది పాపుకూడు కథలోనే! ఆ ప్రయత్నంలోనే వక్కాకు నోటితో బీడీ పొగ ఊదుతూ నాకు కథలు చెప్పిన చిత్తయ్య గొంతు గుర్తుకు వచ్చింది. భూతకాలపు క్రియల్లో ప్రత్యక్ష వ్యాఖ్యానంలా సాగే, అతడు చెప్పే పద్ధతిని దాదాపుగా నాపైఆవహింప జేసుకున్నాను. దీనివల్ల నాకు తెలియకుండానే పావుకూడు కథ మౌఖిక మార్గంలోకి వెళ్ళిపోయింది. కాబట్టి సావుకూడు కథనంలో రచయిత వ్యక్తిత్వానికి చెందిన భాష, వ్యక్తీకరణలు మృగ్యమనుకుంటాను.
సంభాషణలు రాసేటప్పుడు నాకు తెలిసిన నమూనా వ్యక్తుల్ని కథా సందర్భంలో ప్రవేశపెడతాను. వారితో మాట్లాడించి వారి గొంతులు వింటూ మాత్రమే సంభాషణలు
రాస్తాను. కథా స్వభావాన్ని బట్టి, సంభాషణలు, కథనం ఈ రెండిటి నిష్పత్తి మారుతుంటుంది. పాత్రల సంభాషణల్లో రావలసిందాన్ని కథనంలోకి రానిచ్చినా, కథనంలో వుండాల్సిన విషయాన్ని పాత్రల సంభాషణల్లో ఇరికించినా... పాత్రలు
బలహీనమవుతాయి. లేక అనౌచిత్య దోషానికి లోనవుతాయి. ఆ కథాశిల్పం దెబ్బతినడానికి కథనమూ సంభాషణల నిష్పత్తి ఒక కారణమైపోయినా ఆశ్చర్య లేదు. సావుకూడు కథలో వున్న నాటకీయతే ఈ కథనమూ, సంభాషణల నిష్పత్తిని శాసించింద నుకుంటాను.
సావుకూడు కథ ముసిలోని చావుతో మొదలవుతుంది. ముసిలోని చావునుంచీ కథ కొంచెం వెనక్కు నడుస్తుంది. ఆ తరువాత ముసిలోని చావునుంచి కథ ముందుకు
నడుస్తుంది. ఒక సరళరేఖలో మాత్రం కథ నడవదు.
బతికి వున్న మనిషి గురించి వినడంకంటే, చచ్చిపోయిన మనిషి గురించి వినడానికి శ్రోతలు ఎక్కువ ఆసక్తి ప్రదర్శిస్తారు. అందుకే అనుకుంటాను ముందుగా ముసిలోడు చచ్చిపోయినట్లు చిత్రించి, ఆ తరువాత అతని జీవిత నేపథ్యాన్ని చెప్పడం మొదలు పెట్టినాను. ఈ విధంగా జీవితంలోని సంఘటనలను కథనంలో తారుమారుచెయ్యడం వెనుక అనుభూతిస్పోరకమైన ఒక సోపాన క్రమముంటుందనుకుంటాను.
సావుకూడు కథ ముసిలోనికి సంబంధించిన కథ కాదు. కరువుకు సంబంధించిన కథ. అందుకని ముసిలోడు చచ్చిపోయిం తరువాత కూడా కథ సాగుతుంది. ముసిలోని
బతుకును వెంటాడిన కరువు, అతని శవాన్నీ, అంత్యక్రియల్నీ కూడా వెంటాడటం చిత్రించదలచుకున్నాను. ఆ అంత్యక్రియల తతంగాన్ని నా వ్యక్తిగత జీవితంలో ఎంతో దగ్గరగా అనుభవించి వుండడంవల్ల ముసిలోని చావు తరువాత నడిచిన కథాభాగం మీద నాకు పట్టుపోలేదు.
కథారచన అంటేనే మెమరీ? కథకు ప్రేరణ వచ్చిన తరువాత నా జ్ఞాపకాల్లోంచి వివిధ వ్యక్తుల్ని, సంఘటనల్ని, అనుభవాల్ని గని కార్మికుడిలా తవ్వుకోవడం
మొదలు పెట్టినాను. మా అమ్మ దినాలప్పుడు వచ్చిన బాపనయ్య వారిని నమూనాగా తీసుకుని, ముసిలోని దినాలప్పుడు మంత్రం నీళ్ళు చల్లి దక్షిణ దండుకుపోయిన బాపనయ్యపాత్రను చిత్రించినాను. తండ్రి చావుకు తప్పిడి కొట్టించలేదని తిట్టేవాళ్ళూ,శవాన్ని పక్కన పెట్టుకుని గుంత తొగవాళ్ళతోటే బేరాలాడేవాళ్ళూ, పీనిగని తాపంచేసి వచ్చేటప్పుడు ఆంజనేయస్వామి గుళ్ళో కూర్చుని దినాల తేదీ నిర్ణయించడం, మా అమ్మ దినాలప్పుడు ఇంట్లో యాటలు కోసి, వాటిని తలకిందుల వేలాడగట్టి,చర్మం ఒలిచి పొట్ట చీల్చి, వాటిని భాగాలుగా కోసిన దృశ్యం, దినాలప్పుడు గీకించుకున్న గడ్డాలూ,బోడిగుండ్లు, వారి పరాచికాలూ, కడుపులోకి కల్లుపడగానే మంచంలోంచి లేచి కూర్చున్న
మా పెద్ద తాతా, బంతిలో కూర్చుని అన్నం తినని పిల్లోల్లని పిడిగుద్దులు గుద్దే తల్లూలూ... ఈ విధంగా నా మెదడు నుంచి బైటపడిన జీవిత దృశ్యాల చిత్రణలతో నింపి సావుకూడు కథకు ఒక సాంస్కృతిక వాతావరణం నిర్మించే ప్రయత్నం చేసినాను.
శూద్ర సంస్కృతి వాతావరణం!! ఒక మొక్కను మట్టినుంచీ పీకితే ఆ మొక్క వేర్లకు అంటుకుని పైకి లేచి వచ్చే మట్టి పిల్లలు మాదిరి, పాత్రలనుంచీ కథా వాతావరణం విడదీయరానిది.
రచయిత బైట భౌతిక ప్రపంచ ముంటుంది. అదే రచయిత లోపల అనుభవ ప్రపంచముంటుంది. ఈ రెండు ప్రపంచాల మధ్యా రచయిత లోలకంలా ఊగుతాడు. అదృశ్య దారాలతో ఈ రెండు ప్రపంచాలనూ కలుపుతాడు. ఈ బాహ్యాంతర్గత ప్రపంచాల మధ్య జరిగే పర పరాగ సంపర్కంనుంచే రచయితలోని సృజనా త్మకత ఫలదీకరణం చెందుతుందను కుంటాను..
___ బండి నారాయణ స్వామి
( 3 జూన్ 1952లో అనంతపురం పాత ఊరులో జన్మించారు. అనంతపురం జిల్లా వివిధ గ్రామాల్లో సింగిల్ టీచర్ స్కూల్లోనూ, అనంతరం ఉన్నత పాఠశాలలోనూ ఉపాధ్యాయుడిగా చరిత్రను బోధించారు.
1987 నుంచి రచనా వ్యాసంగంలో ఉన్నారు.
పెద్ద కథ రంకె తో కలిపి 35 కథలు రాశారు.)
Comments
Post a Comment