నిశ్శబ్దం బద్ధలైంది
"నిన్ను ప్రేమిస్తున్నా"
"నీ మనసును ప్రేమిస్తున్నాను"
"నిన్ను మనసారా ప్రేమిస్తున్నా"
''ఐలవ్యూ మధు"
సూటిగా అతని కళ్లలోకి చూసింది మాధవి.
" ఎలా చెప్పగలగుతున్నావ్ ? మనమింకా టీనేజ్ పిల్లలు అనుకున్నావా ? మీకు పెళ్లయింది. పిల్లలున్నారు. నాకూ పెట్టింది. ఇద్దరు పిల్లల తల్లిని, మీరు ప్రేమించినా నేనెలా ప్రేమిస్తాననుకున్నారు ? నేను నా భర్తను, పిల్లలను ప్రేమిస్తూ ఉన్నా" .
ఆమె మాటలు విని నిశ్చేష్టుడయ్యాడు మురళి. గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్లు గుటకలు మింగసాగాడు.
తను అంత సూటిగా చెప్తుందనుకోలేదు.
'ఇంకెప్పుడూ ఇలా మాట్లాడకు" అంది మాధవి. కొంత కోపం, అసహనం ధ్వనించింది. ఆమె గొంతులో.
కాసేపు మౌనం రాజ్యమేలింది. పక్షుల రెక్కల చప్పుడు వినిపించేంత నిశ్శబ్దం అలుముకుంది.
వెంటనే తేరుకున్నాడు. చిరునవ్వు నవ్వుతూ... 'నువ్వు ఇంత సూటిగా చెస్తే ఎలా ? నువ్వు నాతో చనువుగా, నవ్వుతూ, తుళ్లుతూ మాట్లాడుతుంటే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావనుకున్నా ?" అన్నాడు మురళీ..
'ఆడది నవ్వితే, మాట్లాడితే చాలు ప్రేమిస్తూ ఉన్నట్లా ? నవ్వితే నాలుగందాలచేటు అంటే ఇదేనేమో ? స్నేహంగా ఉన్నంత మాత్రాన దాన్ని ప్రేమగా అనుకుంటే ఎట్లా? అలా అయితే ఇక నుండి మీతో నవ్వుతూ మాట్లాడనులే" మూతిని బిగిస్తూ సీరియస్ గా ముఖం పెట్టి ఎక్కడో దూరంగా చూస్తూ చెప్పింది.
'అలా మూతిబిగించకు మధు', నా మనసులో మాట చెప్పినా, నీ అభిప్రాయం కనుక్కొందామని. సరే నీ
యిష్టం. నీకు ఇష్టం లేకపోతే మానేయి. ఈ విషయాన్ని వదిలేసేయ్. నువ్వు మాత్రం నవ్వుతూనే మాట్లాడమ్మా తల్లీ".
మాధవి మౌనంగా ఉండిపోయింది.
మురళి, మాధవి ఇద్దరూ ఒక స్వచ్ఛంద సంస్థలో పనిచేస్తుంటారు. మురళి ఆర్గనైజర్ అయితే మాధవి ఆయన అసిస్టెంట్. ఇద్దరూ ఫీల్డ్ వర్క్ కు పోతూవుంటారు. వారి మధ్య సాన్నిహిత్యం పెరిగి బాగా చనువు ఏర్పడింది. ఆ చనువును ఆసరాగా చేసుకున్నాడు మురళి. అందుకే తన మనసులో మాట నిర్లజ్జగా చెప్పేశాడు.
మాధవి భర్త ఆర్.టి.సి. డ్రైవరుగా పనిచేస్తుంటాడు. ఇంట్లో ఖర్చులు సరిపోక తను పనిచేస్తే ఆసరాగా
ఉంటుందని ఆ సంస్థలో చేరింది. చేరిన మొదట్లో మురళి చలాకీగా ఉంటూ ఎంతో మర్యాదగా మాధవితో వ్యవహరించాడు.
మాధవి అందమైన యువతి. చూపరులకు ఆకర్షణీయంగా హుందాగా కనిపిస్తుంది. అందరితో నవ్వుతూ కలుపుగోలుగా మాట్లాడుతూ ఉంటుంది.
మురళికి పెళ్లై సంవత్సరమైంది. భార్య గర్భవతి. పుట్టింటికి వెళ్ళిపోయింది. ఇంట్లో ఒక్కడే ఉంటాడు. మరో తోడులేకపోవడంతో మురళికి హఠాత్తుగా మాధవిపై మనసు పారేసుకున్నారు. మనసు పారేసుకున్నాడడం కన్నా 'వల విసిరాడు' అంటే బాగుంటుంది.
గాలానికి చిక్కలేదే "ఈ పిల్ల' అనుకుంటూ తన బండి స్టార్ట్ చేసుకొని వెళ్లిపోయాడు.
మాధవి మౌనంగా మురళి గురించి ఆలోచిస్తూ 'మగవాళ్లంతా ఇంతే'. తాను డిగ్రీ చదువుకునే రోజుల్లో ఎంతో మంది ప్రపోజ్ చేయడం గుర్తొచ్చింది. ఆడది కలుపుగోలుగా నవ్వితేచాలు, మగవాళ్లకు కోరికలు పుట్టుకొస్తాయోమో! ప్రతిమగాడు ఆడదాన్ని తన పక్కలోకి రావాలను కుంటాడేమో! తన మొగుడు కూడా అంతేనా ? ఇలా ఆలోచిస్తూ ఇంట్లోకి అడుగు పెట్టింది. అప్పుడే పిల్లలు స్కూలు నుంచి వచ్చినారు. ఆలోచనలన్నీ అదృశ్యమై రోటీన్ పనిలో పడిపోయింది.
రెండో రోజు మామూలుగానే గడిచిపోయింది.
మూడో రోజు మళ్లీ మురళీ తన పాత పాటను ఆలపించడం మొదలు పెట్టాడు. అయితే ఈ సారి మాటలతోనే కాదు చేతల్లో కూడా.
ఆ రోజు సుమోలో ఒక పల్లెకు వెళ్లారిద్దరూ. ఒక చోట రైల్వే క్రాసింగ్ దగ్గర గేటువేసి ఉన్నారు. అక్కడ ఆపాడు.
పక్కనే ఉన్న మాధవిని చటుక్కున దగ్గరకు లాక్కుని పెదాలపై ముద్దు పెట్టుకున్నాడు.
వెళ్ళుమని చెంప పగులగొట్టింది మాధవి. ఆరోజంతా మాట్లాడకుండా సీరియస్ గా ముభావంగా ఫీల్డ్ వర్క్
ముగించింది.
** ** **
'గుడ్ మార్నింగ్ సార్!"
“గుడ్ మార్నింగ్'' అంటూ తలెత్తి చూశాడు డైరెక్టరు శ్రీనివాస్.
ఎదురుగా మాధవి.
'కూర్చోండి. మేడం' అంటూ సీటు ఆఫర్ చేశాడు.
"సర్ మీతో ఒక విషయం చెప్పాలని వచ్చాను".
'చెప్పండి, ప్లీజ్'
'మురళి సారు నాతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు సార్" అంటూ జరిగినదంతా వివరంగా చెప్పింది.
'ఓపిగ్గా విని" మీరు చెప్పినదాన్ని ఒక కాగితంలో రాసివ్వండి" అన్నాడు
రాసిచ్చింది మాధవి... ఎంక్వైరీ మొదలైంది.
రెండ్రోజుల తరువాత...
మురళీని పిలిపించాడు డైరెక్టరు శ్రీనివాస్
'మురళీ ! మీరు గత ఏడేళ్లుగా పనిచేస్తున్నారు. మన సంస్థలో, మీ మీద ఒక్క రిమార్కు లేదు. కానీ ఈ రోజు వచ్చింది. మాధవి గారు మీపై కంప్లైంట్ ఇచ్చారు." ఆగి మురళీ కళ్లల్లోకి చూసినాడు శ్రీనివాస్.
'సార్ ! సార్ ! నాదేం తప్పులేదు సార్' తడబడుతూ వినయంగా చెప్పినాడు మురళీ,
'తప్పుచేసిన వాడు చెప్పేది ఇదే ఎప్పుడైనా! ఆమె కంప్లైంట్ ఎందుకు ఇచ్చిందో తెలుసా ? తెలీకుండానే తప్పులేదంటున్నావ్'
'ఆమెను లైంగికంగా వేధించావంట. అసలే మన సంస్థ మహిళల కోసం పనిచేసే సంస్థ. అలాంటి దాంట్లో నువ్వు ఇలా చేయడం మన సంస్థ రూల్స్ కు విరుద్ధం. నేను ఆమె కంప్లైంటును హెడ్ ఆఫీసుకు పంపిస్తున్నాను. వాళ్లేది నిర్ణయిస్తే అదే ఫైనల్.
'సార్ ! నేను చెప్పేది వినండి సార్. వెహికల్ లో అనుకోకుండా ఆమెకు నా చెయ్యి తగిలింది. అంతే ఆమె నన్ను అపార్థం చేసుకుంది.'
''అవన్నీ నాకు తెలీదు. నీ ఎక్స్ప్లవేషన్ రాసివ్వు, దాన్ని కూడా పంపిస్తా. అయినా నీకు పెళ్ళయిందే. ఆమెతో నీకేంపనీ...
..... మరిచిపోయాను... నీ భార్య పుట్టింటికి వెళ్లింది కదూ ! చూడు మురళీ, ఆడది ఒప్పుకుంటేనే సహకరిస్తుంది.ఒప్పుకోకపోతే నువ్వెంత బలవంతం చేసినా లాభం లేదు. ఇప్పుడు అదే జరిగింది. మాధవికి ఇష్టం లేకుండా నువ్వు ముద్దులు పెట్టుకోవడం, తగలరాని చోట నువ్వు తడమడం అవన్నీ నువ్వు చేసిన తప్పులు. ఆమె గనుక కేసు పెట్టి వుంటే నిర్భయ చట్టం కింద నువ్వు జైల్లోకి పోయేవాడివి. కంప్లైంటు మాత్రమే రాసిచ్చింది. సంతోషించు, యు కెన్ గో''.
మౌనంగా వెళ్లి సీట్లో కూర్చున్నాడు. ఎదురుగా మాధవి ఉన్నా ఆమె వంక తలెత్తి చూడకుండా తన పని తాను చేసుకోవటం మొదలు పెట్టాడు మురళి.
మురళీ గత పదేళ్లుగా పనిచేస్తున్నాడని అతని పై ఏనాడూ రిమార్కు రాలేదని, ఇప్పుడు మాత్రమే కంప్లైంట్ వచ్చిందని రిపోర్టు రాసినాడు డైరెక్టరు. గత చరిత్రము దృష్టిలో ఉంచుకొని క్రమశిక్షణా చర్యలు తీసుకుంటా హెడ్ ఆఫీసు నుంచి ఆర్డర్స్ వచ్చాయి.
వచ్చిన రోజే మురళిని పిలిపించాడు డైరెక్టరు.
'మురళీ! నిన్ను డిస్ మిస్ చేయాల్సింది. నా రిపోర్టు చూసి నిన్ను కన్సిడర్ చేసినారు. నిన్ను నీ పోస్ట్ నుంచి కింది పోస్టుకు డిమోట్ చేసినారు.! మళ్లీ నీ ప్రవర్తన చూసి నీకు ప్రమోషను ఇస్తారు. "
మురళీ బాధగా వణుకుతున్న చేతుల్లో ఆర్డరు తీసుకున్నాడు.
'నిగ్రహం కోల్పోయినప్పుడు మనిషి తనపై అదుపు కోల్పోతాడు. అందుకే మనిషి తన్నుతాను ఎప్పుడు అప్రమత్తగా ఉంచుకోవాలి. నేను నిగ్రహం కోల్పోయాను. ఫలితం అనుభవిస్తున్నాను. అయినా మాధవి ఇలా ఫిర్యాదు చేస్తుందని ఊహించలేదు. " మనసులో అనుకుంటూ తన సీట్లో కూలబడ్డాడు.
ఇంతలో మాధవికి పిలుపొచ్చింది. డైరెక్టరు నుంచి.
'మాధవి మేడమ్! కంగ్రాచులేషన్స్. మీ పనితనాన్ని చూసి నేను మీరు ప్రమోషన్‌కు అర్హురాలని రిపోర్టు రాసి పంపినా. ఇప్పుడు మీ కంప్లైంటుకు బహుమతిగా మిమ్మల్ని మురళీ ఉన్న పోస్టుకు ప్రమోట్ చేసినారు. ఒన్స్ ఎగైన్ కంగ్రాట్స్' అన్నాడు డైరెక్టరు.
'థ్యాంక్యూ సర్' అంది మాధవి. మాధవి వెళుతుంటే ఆమె ఒంపు సొంపులు శ్రీనివాస్ లో కాసేపు అలజడి రేపాయి.
రెండ్రోజుల తరువాత మురళి మనస్థాపంతో తన ఉద్యోగానికి రాజీనామా చేసి వెళ్లిపోయాడు. ఇప్పుడు మురళి వర్క్ కూడా తానే చేయాల్సి వచ్చింది మాధవికి.
ఇప్పుడు డైరెక్టరుతో పాటు హెడ్ ఆఫీసుకు, ఇతర ప్రాజెక్టు వర్కుల కోసం ఢిల్లీ, హైదరాబాదు వెళ్లాల్సి
ఉంటుందని చెప్పినారు ఆఫీస్ స్టాఫ్.
వారం తిరక్కముందే ఢిల్లీ వెళ్లాలని పిలుపు వచ్చింది హెడ్ ఆఫీసు నుంచి.
ఇంట్లో పిల్లలను చూసుకొనేందుకు అమ్మను పెట్టి, భర్తకు చెప్పి డైరెక్టరు శ్రీనివాస్ తో పాటు బయలుదేరింది.
ఆఫీసు వాల్లే రూమ్స్ కూడా బుక్ చేసినారు. సాయంత్రం మళ్లీ ఫైట్లో బయలుదేరి వెనక్కు వెళ్లిపోవాలి.
స్టార్ హోటల్ లో దిగడం తనకు ఇదే మొదటిసారి. అదే విషయాన్ని చెప్పింది. ఆనందంతో మాధవి ఫైట్ లో.
ఎక్కడం థ్రిల్లింగ్ గా ఉంది. ఫైట్ లో విండో సీటు కావాలంటే ఇస్తారని చెప్పినాడు డైరెక్టర్. విండో సీటు అడిగి తీసుకుంది.
'ఎకానమీ క్లాసులో అయినా తనలాంటివారికి ఫైటు ఎక్కడం గొప్ప అదృష్టం' అనుకుంటోంది మనసులో. ఆనందం పురులు విప్పి నాట్యం చేస్తుంటే విండో సీట్లో కూర్చొని ఎయిడ్ పోర్టునంతా చూస్తోంది.
దూరాన ఎన్నో విమానాలు.విమానాల బస్టాండు అది. విమానంలో కూర్చుంటే బస్సులో కూర్చునట్లే ఉంది.
నడుముకు బెల్టు కట్టుకోవాలని చెప్పినారు. కొద్ది సేపట్లో బయలుదేరుతుందన్నారు. రన్‌వే పై కొంచెం సేపు పరుగెత్తి మెల్లగా గాల్లోకి లేచింది.
లేస్తూ ఉంటే ఎంతో త్రిల్లింగా ఉంది.
పక్కనున్న డైరెక్టరు ఆమె కళ్ళలో కనిపించే ఆనందపు మెరుపుల్ని తన కళ్లతో బంధిస్తున్నారు.
"బెల్ట్ కట్టుకోండి" అంటూ చొరవగా ఆమె నడుము దగ్గర బెల్ట్ బిగించాడు. అతని చేతివేళ్లు ఆమె నడుము వంపుల్ని సున్నితంగా తాకాయి. గిలిగింతలు పెట్టినట్లు ఫీలైంది మాధవికి.
విమానం పైకి ఎగిరింది. మూడు వేల కి.మీ.ఎత్తులోకి పోయిందని మైకులో చెపుతున్నాడు పైలట్. కిందవన్నీ చీమల్లాగా కనిపిస్తున్నాయి. నదులు వంకల్లాగా, పెద్ద వంతెనలు చిన్న రహదారుల్లాగా కనిపిస్తున్నాయి.
ఇంతలో ఎయిర్ హోస్టెస్ కాఫీ, టీ కావాల్సిన వాళ్లకు ఇవ్వడానికి ఒక ట్రేను లాగుతూ సీట్ల మధ్యలో వయ్యారంగా వెళుతోంది.
కాఫీ తాగమన్నాడు డైరెక్టరు.
'నాకొద్దు " అంది.
తీసుకోండి ప్లీజ్.... అంటూ రెండు కాఫీలకు ఆర్డరిచ్చాడు.
కాఫీ తాగి రిలాక్స్ అయ్యింది. అప్పటి వరకు ఉన్న టెన్షన్ లాంటి ఆనందం అంతా మంచులా కరిగిపోయింది.
ఇప్పుడు ఎక్కడో ఒక ఆనంద శిఖరంపై ఉన్నట్లు ఉంది. తాను మూడువేల అడుగుల ఎత్తులో ఒక మేఘంపై రతీదేవిలా కూర్చొని ఉన్నట్లు ఉంది. కళ్లు మూసుకుంది.
అంతలోనే ఢిల్లీ వచ్చినట్లు అనౌన్స్ చేసినారు. బెల్ట్ లు మళ్లీ బిగించుకోవాలని కూడా చెప్పినారు.
అందరూ ఆలర్ట్ అయ్యారు. ప్లేన్ ల్యాండ్ అయింది.
సరాసరి నేరుగా తమకిచ్చిన త్రీస్టార్ హెటల్ కు వెళ్లిపోయారు మాధవి, శ్రీనివాస్ లు.
ఫ్రెష్ ఆప్ అయి మళ్లీ అదే హోటల్ కాన్ఫరెన్స్ హాలుకు వెళ్లిపోయారు.
మధ్యాహ్నంగా కాన్ఫరెన్స్ లో ఛైర్మెన్ పచ్చి "మీరంతా వన్ డే ఇక్కడే స్టే చేయండి కాన్ఫరెన్స్ రేపు కూడా
ఉంటుంది. అయితే అకామిడేషన్ మీరే చూసుకోవాలి" అన్నాడు.
శ్రీనివాస్ వన్డే రూమ్ ఎక్స్ టెన్షన్ అడిగాడు హోటల్ వాళ్ళను. కానీ అప్పటికే అన్ని రూములు బుక్ అయినందున ఎక్స్టెండ్ చేయలేమన్నారు. ఒక సూట్ ఉంది. కావాలంటే ఇస్తామన్నారు. వేరొక హోటల్ కోసం చూస్తే అది చాలా దూరంలో ఉంది. మాధవికి విషయం చెప్పినాడు.
మీకిష్టమైతే సూట్ తీసుకుందాం అన్నాడు శ్రీనివాస్. ఆమె సమ్మతిస్తుందన్న ధీమా ఉందతనిలో.
డైరెక్టర్ శ్రీనివాస్ సామ్యుడు. మర్యాదస్తుడు. అతనితో ఏమీ సమస్య రాదులే అనుకుంది మనసులో మాధవి.
'ఓకే' చెప్పింది. ఇంటికి ఫోన్ చేసి ఎక్స్ టెన్షన్ గురించి చెప్పింది, పిల్లలు ఎలా ఉన్నారో ఏమో అనుకుంటూ. సూట్ లోకి ప్రవేశించింది. అది చాలా విశాలంగా హనీమూన్ జంట కోసం కట్టినట్లుగా ఉంది.రౌండ్ బెడ్. ఎదురుగా నిలువుటద్దం.
చుట్టూ హోటలు ఫోటోలు, సినీతారల ఫోటోలు. వేరే బెడ్ తెప్పించి విడిగా పడుకొంది మాధవి.
అర్ధరాత్రి లేచి శ్రీనివాస్ ఆమె పక్కలో చేరినాడు. నిద్రలో ఆమె ఎంత వారించినా అతను ఆమెను ఆక్రమించాడు. అక్కడ ఆక్రందన నిశ్శబ్దంలో విలీనమైంది.
ఆమె వెక్కి వెక్కి ఏడ్చింది. తను ఎంతగా నమ్మింది అతన్ని. మగవాళ్ళంతా ఇంతే. తాను ఎంత తప్పు చేసింది.అనుకుంటూ మనసులో కుమిలిపోయింది. ఎవరితో చెప్పుకోవాలో ఏమి చేయాలో అర్ధంకాలేదామెకు. అందరూ హిందీలో మాట్లాడు తున్నారు. తనకేమీ అర్థం కాలేదు.
మరుసటి రోజు కాన్ఫరెన్స్ లో ముభావంగా ఉండిపోయారిద్దరూ.సాయంత్రం తిరిగి ప్రయాణమ య్యారు.
ఇంటికి రాగానే పిల్లలడిగారు."ఢిల్లీ నుంచి తమకు ఏమి తెచ్చినారని ”
భర్త మొగంవాచినట్లు ఎదురుచూస్తున్నాడు. ఆ రోజు రాత్రి ఆమెకు దగ్గరకు తీసుకున్నాడు. తమకంతో. ఆమె అతన్ని దూరంగా తోసింది. కానీ లాభం లేకపోయింది.
ముందు రాత్రి పశుబలం, కామావేశం,
ఇప్పుడు మళ్లీ అదే,ప్రేమావేశం.
ఆడది అంటే ఇంతే ! మగవానికి సుఖాన్నిచ్చే సాధనమేమో ? ముందురాత్రి జరిగింది. భర్తకు చెప్పాలా ? వద్దా? చెబితే నన్ను రామునిలాగా బయటకు పొమ్మంటే, పరపురుషుడు తాకినాడంటే భర్త ఒప్పుకుంటాడా ? నాపై నిందవేస్తాడా ? ఏమో ? చెప్పకపోతే తాను జీవితాంతం మానసికంగా కుంగిపోవాలి. ఎటూ తేల్చుకోలేక నిద్రరాక
అప్పుడప్పుడు కునుకుపట్టి మధ్యలో ఉలిక్కిపడి లేచి బెడ్ పై కూర్చునింది.
'భగవంతుడా ! ఎందుకు నాకీ పరీక్ష ! నేనేం పాపం చేశాను ? ఏ జన్మలో ఏ పాపం చేశావో ఏమో ?'
అనుకుంటూ మెల్లగా నిద్రలోనికి జారుకుంది. అప్పుడప్పుడే మసీదులో 'అజా' ఇస్తున్నారు. పాలవాడు పాల పాకెట్ డోర్ దగ్గర పెట్టి వెళు తున్నాడు. పేపరు బాయ్ పేపరు విసిరేసి పోయాడు.
భల్లున తెల్లారింది.
టీ తాగుతూ పేపరును యధాలాపంగా చూసింది మాధవి.
జిల్లా ఎడిషన్లో 'నేడే మీటూ సమావేశం' శీర్షికతో
వార్తను చూసింది. ఇదేదో కొత్తగా ఉందే అనుకుంటూ ఆ వార్త చదివింది. సెక్సువల్ గా మగవాళ్లతో బాధలుపడిన మహిళల గురించి మాట్లాడడానికి మీటూ సభ డిగ్రీ కాలేజీలో పెడుతున్నారంట.... స్వచ్ఛంద సంస్థలు, మహిళలు రావాలని
నిర్వాహకులు కోరినారు. 'వెళదామా' అన్న ఆలోచన వచ్చింది మాధవికీ.
ఎందుకో బయటకు చెప్పుకోలేని భయం ఆవరించి మళ్లీ ఇంటి పనిలో నిమగ్నమైంది.
ఆఫీసుకు వెళ్లిందే కాని మనసులో తీవ్ర సంఘర్షణ, అందరికీ తెలిసిందేమో, శ్రీనివాస్ అందరికి తన మగతనాన్ని చాటుకోవడానికి అందరికి చెప్పేసినాడా ? నన్ను అందరూ ఏమనుకుంటారు ? నా తప్పేమిలేకపోయినా నాకు శిక్షపడిందే, ఏమి చేయడం, ఆలోచనల ఊబిలోంచి బయట పడడం కష్టంగా ఉంది.
అన్య మనస్యంగా వర్క్ పూర్తి చేసి బయటపడింది.
ఆటో ఎక్కి ఇంటికి పోవాలని బయలుదేరింది.
నగరంలో మినిష్టరు వస్తున్నాడని వన్ వే పెట్టినారు. ఆటో వేరే రూటులో వెళుతోంది. ట్రాఫిక్ ఎక్కువై డిగ్రీ
కాలేజీ ఎదురుగా నిలిచింది ఆటో.
అక్కడ "మీటూ సభకు అందరికి ఆహ్వానం" ఫెక్సీ కనపడింది...
ఒకసారి వెళ్లి చూద్దామన్న కోరిక బలంగా మనసులో కలిగింది.
ఆటోకు డబ్బులిచ్చి కాలేజీలోకి వెళ్లిపోయింది.
సభకు అప్పుడప్పుడే చాలా మంది వస్తున్నారు. ఒకరినొకరు పరిచయం చేసుకుంటున్నారు. వచ్చిన వారిలో ఆడవాళ్లే ఎక్కువగా ఉన్నారు. మగవాళ్లు తక్కువగా ఉన్నారు.
తానేమో ముందు వరుసలో ఖాళీగా ఉన్న ఒక కుర్చీలో కూర్చునింది.
ఇంతలో నిర్వాహకురాలు గీత వేదిక మీదకు వచ్చి "మిత్రులారా ! నమస్కారం!మీటు ఉద్యమం గురించి దాని ప్రాధాన్యతను గురించి మాట్లాడడానికి వచ్చిన లెక్చరర్ శ్రీదేవి గారిని వేదిక మీదకు ఆహ్వాని స్తు న్నాను" అంది.
అందరూ కరతాళ ధ్వనులు చేశారు.
శ్రీదేవి వేదిక మీదకు వచ్చి మాట్లాడడం మొదలు పెట్టింది.
'మిత్రులారా ! ఈ మధ్య బాలీవుడ్ తార తనుశ్రీ ధైర్యంగా ముందుకు వచ్చి కొన్నేళ్ల క్రితం ఒక పాట చిత్రీకరణ సమయంలో నటుడు నానా పాటేకర్ తనను అదేపనిగా చాలా చోట్ల అదేపనిగా తడిమాడని బహిరంగంగా చెప్పింది. ప్రియారమణి అనే పాత్రికేయురాలు ఇప్పుడున్న కేంద్ర మంత్రి ఎమ్.జె. అక్బర్ - ఏషియన్ విజి పత్రిక ఎడిటర్ గా ఉన్న కాలంలో అనేకమార్లు తన ఆఫీసు గదిలో తనను తాకరాని చోట తాకుతూ లైంగికంగా వేధించాడని ఆరోపించింది.ఆమెకు మద్దతుగా గజాలా కూడా చెప్పింది. ఆఖరుకు అక్బర్ తన మంత్రి పదవికి రాజీనామా కూడా చేసినాడు. ఇంతలా మహిళలు తమ నిశ్శబ్దాన్ని ఎలా బద్దలు చేయగలుగుతున్నారో తెలుసుకోవాలంటే 'మీటూ' గురించి తెలుసుకోవాలి."
సభికులు ఆమె చెప్పేదాన్ని ఆసక్తిగా వింటున్నారు. అప్పుడే ఎస్.పి.గారు కూడా వచ్చారు. ఆయన వేదిక
మీదకు పోకుండా సభికుల ముందు వరుసలో కూర్చున్నారు. తక్కిన ఆఫీసర్లు కూడా ఆయన్నే అనుసరించారు.
"1998లో మొదటిసారిగా ఆఫ్రికన్ మహిళ టారానాబర్క్ తన పైన జరిగిన లైంగిక వేధింపులను నిర్భయంగా బయట పెట్టింది. ఆమె చొరవతో చాలా మంది "ఫేస్బుక్' ద్వారా 'మీటూ' అంటే 'నేను కూడా అంటూ తమ బాధలను చెప్పడం మొదలు పెట్టారు. ఆ ధిక్కార స్వరం హాలివుడ్ సోషల్ మీడియాలో ప్రతిధ్వనించింది.
మన దేశంలో కేరళలో దిలీప్ అనే నటుడు 2017లో తన తోటి ఓ సినీ నటిని బలవంతంగా కిడ్నాప్ చేయించి ఆమెపై లైంగికంగా దాడి చేయించారు. అప్పుడు చాలా మంది సినీనటులు దాన్ని ఖండించారు. 2016 అక్టోబరులోతెస్ జోసిస్ అనే సినీనటి తనను డైరెక్టర్ ముఖేష్ తన రూముకు రమ్మన్నాడని ఆరోపిస్తూ ట్విట్టర్ లో పోస్ట్ చేసింది.
2013లోనే పని ప్రదేశాల్లో మహిళలపై జరిగే వేధింపు నిరోధక చట్టం వచ్చింది. కాని దానిని అధికారులు
ఎవరూ సరిగ్గా అమలు చేయలేదు. ఇప్పుడు మీటూ ఉద్యమం ద్వారా అది బలోపేతమైంది.
మన సమాజంలో లైంగిక విషయాలనుబహిరంగంగా చర్చించం. యుక్తవయసులో వారికి అవేతెలుస్తా యని అనుకుంటాం. ఆడపిల్లలకు ఒంటరిగా బయటకు వెళ్లకూడదు వంటి జాగ్రత్తలు చెప్తాం. కాని, ఏఏ ప్రమాదాలు ఎదురవుతాయో, ఏఏ జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పం. ఎవరికైనా ఏదైనా జరిగితే తమకు జరిగిన అవమానాన్ని ఎవరికీ చెప్పుకోలేక తమలో తాము కుమిలిపోతారు. అది చెప్పుకోలేని విషయంగా భావిస్తారు. అవి చెప్పటానికి కూడా
మన భాష సహకరించదు. దీనికి కారణం శీలం విషయంలో స్త్రీ, పురుషుల పట్ల ఉన్న ద్వంద్వ వైఖరి. పురుషులు లైంగిక చేష్టలను వాళ్లు పురుషత్వానికి చిహ్నంగా చూస్తారు. వాడు మగాడు అనే మాట వింటూ ఉంటాం, లేదంటే శృంగార పురుషుడనో, రసికుడనో, కళాపోషకుడనో సంభోదిస్తారు. లేదంటే అతనికి అమ్మాయిల పిచ్చి ఆ అంటుంటారు. అది అతని ప్రతిభాపాటవాలకు ఎలాంటి అడ్డంకిగా భావించరు. అదే స్త్రీ శీలం దగ్గరకు వస్తే మాత్రం ఆమె మొత్తం వ్యక్తిత్వానికి కేంద్రంగా నిర్వచిస్తూ అదే ఆమె గుణగణాలకు కొలబద్దగా భావిస్తారు. చూశారా సమాజంలో ఉన్న రీతి' అంటూ తన ఉపన్యాసాన్ని ఆపి ఒక సారి సభ వైపు తేరిపార చూసింది.
దూరంగా ముందు వరుసలో కూర్చున్న మాధవి తననే చూస్తూ ఉండటం గమనించింది. "ఇప్పుడు నేను నా చిన్నతనంలోని సంఘటన చెపుతాను"అంది.
అక్కడ సూది పడితే వినబడేంత నిశ్శబ్దం ఆవరించింది.
" నా చిన్నతనంలో పక్కింటి అంకుల్ నన్ను ముద్దు పెట్టుకొని హత్తుకునే వాడు. నన్ను గట్టిగా చేతులతో నిమిరేవాడు. అవన్నీ నాకు అప్పుడు లైంగిక చేష్టలని తెలీదు. కాని అతని నుంచి గుంజుకుని గట్టిగా అరచి పారిపోయేదాన్ని, అతన్ని చూసినప్పుడల్లా భయమేసేది. ఇప్పుడు తాను లేడు. చనిపోయాడు' అంటూ దీర్ఘశ్వాస విడుస్తూ తన ఉపన్యాసాన్ని కొనసాగించింది.
"నా పెళ్ళయ్యాక మా యింటికి నా భర్త స్నేహితుడు మాచిరాజు తరచూ వచ్చేవాడు. తన భార్యతో కొట్లాడానని ఆమెతో తనకు సుఖం లేదని చెబుతూ ఉండేవాడు. అతనొక రచయిత కూడా. ఒకసారి మా యింటికి వచ్చాడు. మధ్యాహ్నం నేను నిద్రపోతున్న సమయంలో నా పెదాలపై ముద్దు పెట్టి తగలరానిచోట తన చేతులతో తడిమాడు.
అతనిప్పుడు ప్రఖ్యాత సంస్థలో పనిచేస్తున్నాడు" అంటూ తనలో గూడుకట్టుకున్న భారాన్ని మాటల్లో దించేసుకుంది.
మళ్లీ తను చెప్పడం మొదలు పెట్టింది.
"ఏదైనా తమకు జరిగిన అవమానాలను బహిరంగంగా చెప్పుకోవటానికి ఈ వేదిక. మీరూ నిర్భయంగా చెప్పుకోవచ్చు. రండి! మీలో ఉన్న భయాలను వదలి అనుమానాలు పక్కకు నెట్టి చెప్పండి. అవసరమైతే పోలీసులు వాళ్ళపై కేసులు కూడా పెడతారు. వారిపై చర్యలు తీసుకొనేటట్లు చేస్తాం. మీకు న్యాయం జరిగే వరకు అందగా
ఉంటాం".
మాధవి ఆమె మాటలు వింటూ తనకు జరిగిన అవమానాలు చెప్పాలా వద్దా... చెపితే కుటుంబ పరువు ఏమన్నా అవుతుందేమో ? అనుకుంటూ మౌనంగా కూర్చుంది..
ఇంతలో ఎస్.పి. వేదిక ఎక్కి మైకు అందుకుని
' ఈరోజు నాకానందంగా ఉంది. మహిళలు నిర్భయంగా తమకు జరిగిన అన్యాయాన్ని బహిరంగంగా చెప్పడం చాలా గొప్ప ముందడుగు. తమ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ మాట్లాడుతున్నారు.
అయితే ఈ స్వేచ్ఛను మీరు దుర్వినియోగం చేసుకోకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ మీదే ఉంది. మీరు నిర్భయంగా చెప్పండి. నేను మీకు అండగా ఉన్నా' అన్నాడు.
మాధవి స్థిరనిశ్చయానికి వచ్చి మాట్లాడడానికి మైకు ముందుకు వచ్చి నిలబడింది.
* * * *
(మానవి మాస పత్రిక, నవంబరు,2019)
(1000 బహుమతి పొందిన కథ.)
__ పిళ్లా విజయ్,9490122229
Comments
Post a Comment