నల్లచెవి గుర్రం




            

        విశ్వామిత్ర గురుకులాన్ని నడిపేవాడు. ఆయన దగ్గర గాలవ్ శిష్యునిగా చేరినాడు. గురువు దగ్గర శిక్షణ పూర్తయ్యాక గురువు విశ్వామిత్రునితో 'గురుదక్షిణఏమివ్వమంటారు, గురువుగారూ ?' అని అడిగాడు.
శిష్యుడు ఆశ్రమంలో శ్రద్ధాసక్తులతో చదివేవాడు. పైగా పేదవాడు. అందువల్ల 'నాకేమీ గురుదక్షిణ వద్దుపో' అన్నాడు విశ్వామిత్ర.
       గురువును సంతోషపెట్టాలని ఒకవైపు శిష్యుని మనస్సు ఉరకలేస్తోంది. ప్రతి శిష్యుడు గురువుకు గురుదక్షిణగా ఏదో ఒకటి ఇస్తుంటే తానొక్కడే ఇవ్వకపోతే ఎలా అనుకుంటూ ఉన్నాడతను.
“చెప్పండి గురువర్యా" అని బలవంతం చేసినాడు గాలవ్.
' ఒక చెవి మాత్రమే నల్లగా ఉండే ఎనిమిది వందల గుర్రాల్ని తీసుకురా, అదే నా గురుదక్షిణ'. చివరగా విచిత్రమైన కోరికను కోరాడు విశ్వామిత్రుడు. ఎలాగూ తీసుకురాలేడన్న ధీమా కూడా ఉందతనిలో.
      గాలవ్ అలాంటి గుర్రాల కోసం వెదికాడు. ఎక్కడా దొరకలేదు. చివరకు తన బాల్య స్నేహితుడైన గరుత్మంత్ ను అడిగాడు.
గరుత్మంత్ తన మిత్రుడు చెప్పింది విని 'ఏ గురువైనా ఇలాంటి విచిత్ర కోరిక కోరుతాడా? నిన్నేదో ఆటపట్టించ డానికి చెప్పివుంటాడు. అయినా ఆ గుర్రాలను ఆయనేం చేసుకుంటాడు?" అన్నాడు.
'ఏమో ! వాటిని ఎవరికైనా ఇచ్చి గురుకుల ఆశ్రమాన్ని బాగు చేయించుకుంటాడేమో'.
'సరే ! పద అలాంటి గుర్రాలు రాజుల దగ్గర వుంటాయి. మన దేశ రాజు యయాతి దగ్గర ఉండవచ్చు.ఆయన్ను కోరితే తప్పకుండా మనకు సహాయం చేస్తాడు' అన్నాడు గరుత్మంత్.
     యయాతి వాళ్ల కోరిక విని “ వాళ్లడగిన రకం గుర్రాలు తన దగ్గర లేవన్నాడు. అయితే నా కూతురు మాధవి తెలివైనది. ఆమెను మీతో పంపిస్తాను. ఆమెకు అలాంటి గుర్రాల గురించి అవగాహన ఉంది. అవి ఎక్కడ వున్నా మీకు ఇప్పిస్తుంది. ఆమెను మీతో పంపిస్తా ఆమె సహకారంతో వాటిని సాధించుకోండి. అంతవరకు సాయం చేయగలను' అన్నాడు.
      మాధవి అందగత్తె కూడా. మాధవి, గాలవ్, గరుత్మంత్ లు ముగ్గురూ పక్క దేశం అయోధ్య రాజు దగ్గరకు పోయినారు. ఆ రాజు దగ్గర రెండు వందల గుర్రాలున్నాయి. ఈ విషయాన్ని పశువుల కాపరుల ద్వారా తెలుసుకున్నారు. వాటిని సంపాదించడానికి ఒక పథకం వేసుకున్నారు ముగ్గురూ. 
    మాధవి రాజు దగ్గరకు వెళ్లి "రాజా నేను మంచి నాట్యకారిణిని. నాకోసారి నాట్య ప్రదర్శనకు అవకాశం ఇవ్వండి' అని అడిగింది.
ఆమె ముఖవర్చస్సుకు, నమ్రతకు ముగ్ధుడై నాట్య ప్రదర్శనకు అనుమతిచ్చాడు రాజు. ఆమె నాట్యాన్ని చూసి రాజు పరవశించిపోయాడు.
ఆమె నాట్య ప్రతిభను గుర్తించి ఆమెకు ఏం కావాలో కోరుకోమ్మని అడిగాడు.
     'చెవి నల్లగా ఉండే తెల్లగుర్రాలు ఎనిమిది వందలు కావాలి'తన కోరిక వెల్లడించింది.
      ' నా దగ్గర రెండు వందలు మాత్రమే ఉన్నాయి. వాటిని తీసుకెళ్లండి. అవి అందరి దగ్గరా ఉండవు.వేరొక రాజు దగ్గర మిగిలినవాటి కోసం ప్రయత్నించండి' అన్నాడు అయోధ్యరాజు.
       అక్కడ్నుంచి మరో రాజు దగ్గర కూడా అలాగే తన నాట్యంతో మెప్పించి మరోనాలుగు వందల గుర్రాలు సంపాదించింది మాధవి.
ఆవిధంగా గాలవ్ ఆరు వందల గుర్రాలు మాధవి సహాయంతో సంపాదించగలిగాడు.
ఆరువందల గుర్రాలను తీసుకెళ్లి గురువుకు సమర్పించాడు గాలవ్. మాధవి, గరుత్మంత్ ల సహకారాన్ని గురించి, మాధవి చేసిన త్యాగాన్ని గురించి గురువుకు తెలియజేశాడు. గాలవ్ శ్రమను మెచ్చుకొని, "నేను వద్దన్నా
నువ్వు ఇస్తానని మొండిగా వున్నావు. అందుకే అలాంటి కోరికను కోరాను' అన్నాడు విశ్వామిత్ర.
     మాధవి, గరుత్మంత్ లను శభాష్ అంటూ వారిని దీవించి పంపినాడు విశ్వామిత్ర.

(ఇది భారతం లోని కథ.చిన్న చిన్న మార్పులతో  రాశాను)


   - పిళ్లా విజయ్,సెల్: 9490122229

Comments

Popular posts from this blog

ఇండియాలో_ఆక్సిజన్_వదిలే_ఆవులున్నాయా

Control over NSE