మాన‌వ మ‌హావిషాద‌యాత్ర







*Exodus- ఎక్స్‌డ‌స్ అంటే డిక్ష‌న‌రీ అర్థం దేశ త్యాగం.*

 *మ‌నుషులంతా తాము ఉంటున్న ప్రాంతాన్ని వ‌దిలి వేలు, ల‌క్ష‌ల్లో త‌ర‌లి వెళ్ల‌డం. మోజ‌స్ వెంట ఇలాగే యూదులు ల‌క్ష‌ల్లో త‌ర‌లి వెళ్లారు. ఎక్క‌డికి వెళుతున్నామో వాళ్ల‌కి తెలియ‌దు. ఒక దేశం కోసం, కాసింత నేల కోసం , బ‌త‌క‌డం కోసం వెళ్లారు. ఎర్ర‌స‌ముద్ర‌మే రెండుగా చీలి వాళ్ల‌కి దారి ఇచ్చింది.*

*కానీ నిన్న మొన్న మ‌నం పేప‌ర్ల‌లో, టీవీల్లో చూసినా మాన‌వ మ‌హాయాత్ర వేరు. వీళ్ల‌కి సొంత దేశం ఉంది, సొంత ఊరు ఉంది. కానీ బ‌తుకు కోసం ఎక్క‌డెక్క‌డికో వెళ్లారు. హ‌ఠాత్తుగా బ‌తుకు ఆగిపోయింది. ఆక‌లితో చావ‌లేక‌, ఉన్న‌చోట ఉండ‌నివ్వ‌రు కాబ‌ట్టి సొంత గ‌డ్డ కోసం వంద‌ల కిలోమీట‌ర్లు న‌డుస్తూ బ‌య‌ల్దేరారు.*

*పైన ఎండ‌, నెత్తీ మీద మూట‌లు, చంక‌లో బిడ్డ‌లు, క‌డుపులో ఆక‌లి....క‌నుచూపు మేర‌లో లేని గ‌మ్యం. కానీ న‌డిచారు. మ‌ట్టి పాదాల‌తో ఇంకా న‌డుస్తూనే ఉన్నారు. ఎవ‌రు వీళ్లంతా? ఢిల్లీలో ఉన్న ప్ర‌ధాని , రాష్ట్ర‌ప‌తి, మంత్రులు, దేశాన్ని న‌డిపించే యంత్రాంగం అంతా అక్క‌డే ఉంది. మ‌రి ఈ ల‌క్ష‌ల మంది ఉన్న‌ట్టు వాళ్ల‌కి తెలుసా?*

*మ‌నం ఉండే అపార్ట్‌మెంట్లు క‌ట్టేది వీళ్లే. ప‌ని చేసే ఆఫీసులు క‌ట్టింది వీళ్లే. ఫ్లైఓవ‌ర్లు, ఎక్స్‌ప్రెస్ ర‌హ‌దారులు వేసింది వీళ్లే. ఇటుక మీద ఇటుక ఎలా పేర్చాలో తెలియ‌ని వాళ్లంతా భ‌ద్ర‌మైన భ‌వంతుల్లో ఉన్నారు. నాగ‌రిక‌త‌ల‌ను నిర్మించిన వాళ్లు న‌డిరోడ్డు మీద ఎండ‌కు న‌డుస్తున్నారు.*

*గాలి వెలుతురు లేని షెడ్ల‌లో జీవిస్తూ ఉంటారు. ఇప్పుడు ఆ షెడ్ల నుంచి కూడా త‌రిమేశారు. కూలి డ‌బ్బులు ఎగ్గొట్టినా అడిగే దిక్కు లేదు. అన్ని రంగాల్లో క‌లిపి మ‌న దేశంలో ప‌ది కోట్ల మంది వ‌ల‌స కూలీలు ఉంటార‌ని అంచ‌నా. క‌రోనా కోసం క‌ఠిన చ‌ర్య‌లు అవ‌స‌ర‌మే, ఎవ‌రూ కాద‌న‌రు. హ‌ఠాత్తుగా ఈ జ‌నం ఏమై పోతారు, ఎలా బ‌తుకుతారు అని ఎవ‌రైనా ఆలోచించారా?*

*రోడ్డు మీద‌కొచ్చిన కుర్రాళ్ల‌ను శిక్షించ‌డం న్యాయ‌మే అయిన‌ప్పుడు , ఇంత మందిని రోడ్డుపాలు చేసిన కాంట్రాక్ట‌ర్ల‌ను అరెస్ట్ చేసి లాఠీల‌తో కొట్టాలా? వ‌ద్దా?*

*వాళ్ల‌కి ఏ శిక్షా ఉండ‌దు. ఎందుకంటే డ‌బ్బున్న వాళ్లు. కూలీల‌కు కార్మికుల‌కీ ద‌య‌తో జీతాలు ఇవ్వాల‌ని , క‌ట్ చేయ‌కూడ‌ద‌ని ప్ర‌ధాని కోరాడు. ద‌య‌తో ఎవ‌రైనా జీతాలు ఇస్తారా? త‌ప్ప‌ని స‌రి అయితే ఇస్తారు.*

*దేశ విభ‌జ‌న త‌ర్వాత ల‌క్ష‌ల్లో మ‌నుషులు త‌ర‌లి వెళ్ల‌డం ఇదే మొద‌టిసారి. ఎవ‌రినీ నిందించ‌కుండా, నిశ్శ‌బ్దంగా, భారంగా న‌డుస్తున్న గ‌ర్భిణీ మ‌హిళ‌లు, న‌డ‌వ‌లేక ఏడుస్తున్న చిన్న పిల్ల‌లు దారిలో ఎవ‌రైనా ఏదైనా ఇస్తే ఆబ‌గా అందుకునే చేతులు. ముస‌లి వాళ్ల‌ని తోపుడు బండ్ల‌లో తీసుకెళుతున్న వాళ్లు . శాప‌గ్ర‌స్తుల్లా, తెగిపోయిన గాలిప‌టంలా, ఎవ‌రు మోసం చేసినా త‌మ పాదాలు త‌మ‌ని మోసం చేయ‌వ‌నే న‌మ్మ‌కంతో న‌డుస్తున్న వాళ్లు.*

*నోట్ల ర‌ద్దు త‌ర్వాత కూలీ లేక , మొద‌ట ఆ భారాన్ని మోసింది వీళ్లే. క‌రువు వ‌స్తే మొద‌ట బ‌లి అయ్యేది వీళ్లే. క‌రోనా వ‌చ్చినా గుండెలు బ‌రువెక్కి ఆయాస ప‌డుతున్న‌ది వీళ్లే. టైటానిక్ మునిగిన‌ప్పుడు మొద‌ట చ‌నిపోయింది ఇంజ‌న్ కార్మికులే.*

*73 ఏళ్ల స్వాతంత్ర్యం త‌ర్వాత అభివృద్ధికి చెందిన గ్రాఫ్‌లు కాగితాల మీద క‌నిపిస్తున్నాయ్ కానీ, కంటికి క‌నిపించే గ్రాఫ్ ఈ మాన‌వ మ‌హా విషాద‌యాత్ర‌.*

*వాహ‌నాల‌కు దారి చూపించే GPS ఉన్నాయి కానీ,*
*జీవితానికి దారి చూపించే GPS ఎక్క‌డ?*


(G.R.మహర్షి గారు రాసిన ఈ జీవనదృశ్యాన్ని దేవీ మలపాల గారు Babu Gogineni గ్రూపులో షేర్ చేశారు.నేను దాన్ని ఇక్కడ కాపీ పేస్టు చేశాను.ఇది చాలా ఆలోచింపజేసే పోస్టు.)
        - డా. సత్య వర ప్రసాద్.

[08/04, 9:00 AM] Pilla Vijay: వలస కార్మికులను ఆదుకోవటమే కరోనా కట్టడిలో మొదటి చర్య 

♀️భారతదేశంలో కరోనా రోగుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. కరోనా వైరస్‌ పాశ్చాత్య దేశాలకు 1918 నాటి ఫ్లూ జ్వరాన్ని గుర్తు చేస్తుంటే భారతదేశానికి మాత్రం మధ్యయుగాల నాటి కాలా హజార్‌ అనుభవాలను గుర్తు చేస్తోంది. లక్షలాది మంది అసంఘటిత రంగ కార్మికులు నగరాలు వదిలి గ్రామాలకు కాలిబాట పట్టారు. 

♀️1918లో స్పానిష్‌ ఫ్లూ గ్రామాల్లో విస్తరిస్తే లక్షలాదిమంది గ్రామాలు వదిలి పట్టణ ప్రాంతాలకు బతుకు దెరువు కోసం బయల్దేరారు. కానీ దేశంలో 150ఏండ్ల పెట్టుబడిదారీ విధానం వేళ్లూనుకున్న తర్వాత ముంచుకొచ్చిన కరోనా ముప్పుతో లక్షలాది మంది తిరిగి గ్రామాలకు పయనమయ్యారు. జాతీయ రహదారుల వెంట నడుస్తున్న ఈ లక్షలాదిమందిని చూస్తే 1947లో దేశవిభజన నాటి చిత్రం గుర్తురాక మానదు.

♀️నాడు సుమారు రెండు దేశాల సరిహద్దులు దాటి సుమారు కోటిన్నర మంది వెళ్లారు. నాడు ఉన్న చోటు విడిచి వెళ్తున్న వారికి పోలీసులు, సరిహద్దు రక్షణ బలగాలు సాధ్యమైనంత బందో బస్తు కల్పిస్తే నేడు పనిచేసే చోటు వీడి వెళ్తున్న వలస కార్మికులపై పోలీసు లాఠీలు నృత్యం చేస్తున్నాయి. నాటిలాగానే నేడు కూడా ఢిల్లీ నుంచి ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, బీహార్‌లకు వెళ్లే బస్సులు ఊపిరాడనంతగా కిక్కిరిసిపోతున్నాయి. 

♀️ఉత్తర ప్రదేశ్‌ వంటి రాష్ట్రాల్లో వలస కార్మికులపై క్రిమి సంహాకర మందు కలిపిన నీళ్లు పిచికారీ చేస్తున్న అమానవీయ చిత్రాలు కండ్లముందున్నాయి. వలస కార్మికులను ప్రభుత్వాలు, పోలీసులు పశువుల కంటే దారుణంగా చూస్తున్నాయి. 

♀️నాటి వలసలు ప్రాణభయంతో జరిగాయి. వలసలను ప్రేరేపించిన సామూహిక మారణ కాండ నాడు తక్షణ నేపథ్యంగా ఉంది. దారిపొడవునా కొన్ని చోట్ల బందిపోట్లకు బలైన సంఘటనలు కూడా నమోదయ్యాయి. మతోన్మాద ఉద్రిక్తతలు ఈ హింసాకాండకు నిప్పుకు నెయ్యి తోడైనట్టు తోడయ్యాయి. 

♀️కానీ నేటి వలసల్లో తక్షణ మతోన్మాద ఉద్రిక్తతల పాత్రలేదు. పని ప్రాంతాలు వదిలి పోతున్న వారిలో హిందూ వలస కార్మికులు, సిక్కు వలస కార్మికులు, ముస్లిం వలస కార్మికులు ఉన్నారు. మతాలు వీళ్లను చీల్చటానికి ఎంతగా ప్రయత్నిస్తున్నా ఆపద వీళ్లను జాతీయ రహదారుల వెంట ఒక్కటిగా చేసింది.

♀️1947 నాటి వలసలకు నేటి వలసలకు మధ్య ఓ ఉమ్మడి లక్షణం కూడా ఉంది. రెండూ ప్రభుత్వాలకు నాయకత్వం, వ్యక్తులకు ముందు చూపు లోపించటం వల్లనే జరిగాయి. స్వాతంత్య్ర సిద్ధి ప్రకటనకు ముందే దేశ విభజన అనివార్యం అని తేలింది. 

♀️అయినా సరిహద్దుకిరువైపులా ఉన్న ప్రజలు తమతమ మత విశ్వాసాలతో నిమిత్తం లేకుండా జీవనోపాధి లభ్యత ఆధారంగా ఎక్కడ ఉండాలో నిర్ణయించుకుంటారన్న గుడ్డినమ్మకంతో ఉన్నారు నెహ్రూ, జిన్నాలు. కానీ నెహ్రూ, గాంధీ, పటేల్‌, జిన్నాలు అధికార విభజన, దేశ విభజన వ్యూహరచనలో నిమగమై ఉన్న మూడు నాలుగేండ్లల్లో దేశంలో వెర్రితలలు వేసిన మెజారిటీ మతోన్మాదం, మైనారిటీ మతోన్మాదం, దాంతో పొంచి ఉన్న ప్రమాదాన్ని ఆ నాయకులు తక్కువ అంచనా వేశారు. 

♀️దేశం విడిపోయినా కలిసి ఉన్నా బెంగాల్‌ మాత్రం చీలిపోక తప్పదని నాటి నెహ్రూ నేతృత్వంలోని ఉమ్మడి క్యాబినెట్‌లో మంత్రిగా ఉన్న హిందూమహాసభ శ్యాంప్రసాద్‌ ముఖర్జీ మాటలు గుర్తు చేసుకుంటే ఆరెస్సెస్‌, హిందూ మహాసభలకు దేశ విభజన పట్ల ఉన్న అవగాహనేమిటో తేటతెల్లమవుతుంది. 

♀️ఆదేశ విభజన పాపమంతా కాంగ్రెస్‌దేనీ, నాడు జరిగిన పొరపాట్లు సరిదిద్దటానికే నేడు పౌరసత్వ సవరణ చట్టం తెస్తున్నామనీ నేటి పాలకులు దేశ విభజనకన్నా ఘోరమైన తప్పును సమర్ధించు కుంటున్నారు. దేశ విభజన నాటి నేపథ్యంలో ఉన్న భయాందోళనలు నేటి వలస కార్మికుల కాలిబాటకు నేపథ్యంగా లేకపోవచ్చు. కానీ వీరికున్న భయాలు వేరు. 

♀️యావత్‌ ప్రపంచాన్నీ ఆందోళనకు గురి చేస్తున్న కరోనా వైరస్‌ ఒక్కటే తాజా తిరుగు వలసలకు కారణం కాదు. జీవనోపాధి భద్రత, నివాస ప్రాంతాల సమస్య తక్షణ కారణాలుగా ఉన్నాయి. దేశంలో దాదాపు 12కోట్లమంది వలస కార్మికులు కరోనా కారణంగా జీవనోపాధి కోల్పోయారు. వీరికి ప్రభుత్వం ప్రకటించిన రాయితీలు అందించటానికి వారి వివరాలు అందుబాటులో లేవని ప్రభుత్వాధి కారులు చెప్పటాన్ని గమనిస్తే ఈ వలస కార్మికుల దుస్థితి ఏమిటో అర్థమవుతుంది.

♀️ఈ పన్నెండు కోట్ల మంది స్వంత ఊళ్లు వదిలి వివిధ ప్రాంతాల్లో పని చేయటానికి వచ్చిన వలస కార్మికుల సమస్యలు, అవసరాల పట్ల ప్రభుత్వాధినేతలకు ఏ మాత్రం అవగాహన లేదన్న విషయం కరోనా కాలంలో స్పష్టమైంది. మూడు వారాల పాటు దేశ ఆర్థిక వ్యవస్థ తలుపులు మూసుకుని కూర్చుంటే ఈ మూడు వారాల పాటు తినటానికి కావల్సిన ఆహార పదార్థాలు, వెచ్చాలు నిల్వ పెట్టుకునే ఆర్థిక సామర్థ్యం లేని సామాజిక తరగతి ఇది. 

♀️ఈ కీలక అంశం గురించి కరోనా ప్యాకేజీ ప్రకటించిన ఆర్థిక మంత్రికి గానీ, చెప్పా పెట్టకుండా లాక్‌డౌన్‌ ప్రకటించిన ప్రధానికిగానీ ఏ మాత్రం అవగాహన లేదన్నది దేశం నలుమూలలా సాగుతున్న ఆకలి యాత్రలు రుజువు చేస్తున్నాయి. ఈ ఆకలి యాత్రలో ఉన్న వలస కార్మికులు సామాజిక దూరాన్ని పాటించలేక పోతున్నారంటూ ఏసీ గదుల్లో కూర్చుని టీవీ షోల్లో విశ్లేషణలు చేస్తున్న అభినవ మధ్యతరగతి మేధావులకు కూడా సమస్య తీవ్రత అర్థం కావటం లేదు.

♀️ఈ సమయంలో వారికి అవగాహన కల్పించటం గురించి బుర్రలు బద్దలు కొట్టుకోవటానికి బదులు వారు ఉన్న చోటే బతకటానికి కావల్సిన నిత్యావసర సరుకులు ఉచితంగా అందుబాటులోకి తెచ్చేందుకు మార్గాలు అన్వేషిస్తే పరిస్థితి కాస్తంత మెరుగుపడే అవకాశం ఉంది. ఎక్కడికక్కడ తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేయటం, తాగునీటి వసతి కల్పించటం, వీలైతే ఉమ్మడి వంట శాలలు ఏర్పాటు చేసి వారికి కనీస ఆకలి దప్పులు తీర్చటం ఇప్పుడు ఆలోచన కలిగిన ప్రభుత్వాధినేతలు చేయాల్సిన మానవతా చర్య. ఆ మాత్రం కుటుంబానికి తిండి పెట్టేందుకు కూడా వీలులేకుండా నేడు ఈ వలస కార్మికులంతా ఉపాధి కోల్పోయారు.

♀️వలస కార్మికులు స్వంత ఊరు వదిలి వచ్చాక ఏదో దుకాణంలోనో, భవన నిర్మాణ కాంట్రాక్టరు వద్దనో, జాతీయ రహదారులు, ఇతర నిర్మాణాలు పర్యవేక్షించే కాంట్రాక్టరు వద్దనో పని చేస్తున్నారు. ఆ పరిస్థితుల్లో వలస కార్మికులు పని ప్రదేశాలు వదిలి వెళ్లకుండా చూడటం వారిని పనిలో పెట్టుకున్న లేబర్‌ కాంట్రాక్టర్లు, ఇతర కాంట్రాక్టర్ల బాధ్యత అంటూ ఆదేశాలివ్వాలన్న ఇంగితం లేని అధికార యంత్రాంగం చేతిలో పాలన చిక్కుకుపోయింది. 

♀️దీనికి బదులుగా ఆకలి యాత్రతో ఇండ్లు చేరదామని కాలిబాట పట్టిన వారిని అడ్డగిచటం, బారికేడ్లు నిర్మించటం, వాటర్‌ కానన్లు, ప్లాస్టిక్‌ బుల్లెట్లతో అడ్డుకోవటానికి ప్రయత్నించటం కంటే హేయమైన చర్య మరోటి ఉండదు. ఇదీ ఏడు దశాబ్దాల తర్వాత ఈ దేశ ప్రజల అవసరాలు తీర్చటానికి మనం ఏర్పాటు చేసుకున్న పాలనాయంత్రాంగం సామర్ధ్యం.

♀️ఈ వలసలను నియంత్రించటానికి, వలసలతో విస్తరించే కరోనాను కూడా కట్టడి చేయటానికి ప్రభుత్వం అనుసరించాల్సిన వ్యూహం ఒక్కటే. వలసకార్మికుల బతుకు భద్రతకు భరోసా ఇవ్వగలడటం. దీనికోసం కంప్యూటర్లు ముందేసుకుని గణాంకాలతో తిమ్మినిబమ్మిని చేసే ప్రభుత్వా ధినేతలుపనికిరారు. ఈ వలస కార్మికులందరికీ నిలువ నీడ, కడుపు నింపుకోవటానికి ఇంత అన్నం కల్పించటం ఇటువంటి ఉపద్రవాల సమయంలో ప్రభుత్వాల కనీస బాధ్యత.

♀️ప్రత్యేక రైళ్లు, బస్సులు ఏర్పాటు చేసి వారిని ఇంటికి చేర్చాలి. హరిద్వార్‌లో చిక్కుకుపోయిన గుజరాతీ తీర్థయాత్రీకులను నేరుగా రెండు బస్సుల్లో ఏకంగా ఉత్తరాఖండ్‌ నుంచి గుజరాత్‌ వరకు చేర్చగలిగిన ఈ ప్రభుత్వానికి వలస కార్మిలకు ప్రత్యేక రవాణా సదుపాయాలు ఏర్పాటు చేయటం ఏమంత కష్టమైన పని కాదు. 

♀️ఇంటి బాట పట్టిన వలస కార్మికులందరికీ రోగనిర్థారణ పరీక్షలు చేయాలి. ఆయా గ్రామాల్లో ఉన్న పాఠశాలలను క్వారంటైన్‌ వార్డులుగా మార్చి వీరి ఆరోగ్యం పట్ల ఉన్న సందేహాలన్నీ నివృత్తి అయ్యేవరకు క్వారంటైన్‌లో ఉంచాలి. 

♀️మార్గ మధ్యంతో ఆకలికి, పోలీసుల లాఠీలకు లేదా మండే సూర్యతాపానికి బలైన వారికి ప్రధాన మంత్రి జీవన్‌ బీమా పథకం కింద ఐదు లక్షల నష్టపరిహారం చెల్లించాలి. మోడీ ప్రారంభించిన అనేక సంక్షేమ పథకాలు, ఈ సంక్షేమ పథకాలు నేరుగా ప్రజలకు చేరటానికి అనివార్యమంటూ మన మీద రుద్దిన ఆధార్‌ కార్డు లింకేజిల సామర్థ్యం ఇప్పుడు బయటపడుతుంది.

కొండూరి వీరయ్య
సెల్‌: 98717 94037
[08/04, 11:05 AM] Pilla Vijay: విషాదంలో వలస కార్మికులు
➖➖➖➖➖➖➖➖

కోవిడ్‌-19 మరణాల కంటే స్వగ్రామాలకు బయలుదేరి మార్గమధ్యంలో చనిపోయిన వారి సంఖ్య ఎక్కువగా ఉంది. స్వగ్రామాలకు వస్తుండగా 40 మంది పేదలు ప్రాణాలు కోల్పోయారు. తొమ్మిది మాసాల గర్భణితో సహా సహరాన్‌ పూర్‌ నుంచి వంద కిలోమీటర్ల కాలినడకన బయలుదేరిన వలస కార్మిక కుటుంబాన్ని 50 కిలోమీటర్లు తర్వాత ప్రజలు ఆదుకొని అంబులెన్స్‌లో సొంతూరుకు పంపారు. నాగపూర్‌ నుంచి కాలినడకన చెన్నై బయలుదేరిన వలస కార్మికుడు హైదరాబాద్‌ శివారులో గుండెపోటుతో మరణించాడు. 

తొమ్మిది నెలల నిండు గర్భిణీ కాళీబారు దీ అలాంటి గాధే. ఉత్తరప్రదేశ్‌ లోని మధుర నుంచి కాలినడకన బయలుదేరి మధ్యప్రదేశ్‌ లోని స్వగ్రామానికి...అనేక అవస్థలు పడుతూ ఐదు ట్రక్కులు మారి...ఏప్రిల్‌ 1న ఇంటికి చేరింది. ఇలాంటి వలస కార్మికుల బాధలు, గాధలు రోజూ పత్రికల్లో పుంఖానుపుంఖాలుగా వస్తూనే ఉన్నాయి. అత్యంత వెనుకబడిన ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు వీరిలో అత్యధికంగా ఉన్నారు.

కరోనా నివారణకు మార్చి 23న ప్రధాని మోడీ చేసిన లాక్‌డౌన్‌ ప్రకటన వలస కార్మికులకు శాపంగా మారింది. అప్పటి వరకు ఉన్న పని పోయింది. అన్ని చోట్ల పోలీస్‌ బారికేడ్లు స్వగ్రామానికి పోకుండా అడ్డుగా మారాయి. ఉన్నచోట బతకలేని పరిస్థితి ఏర్పడింది. మధ్య దళారులు, కాంట్రాక్టర్లు వీరిని వదిలించుకుని ఫోన్లు స్విచ్‌ ఆఫ్‌ చేశారు. ఆహారం, నివాసం, మంచినీరు వంటి కనీస సౌకర్యాల వలస కార్మికులకు అందని దుస్థితి ఏర్పడింది.

యజమానులు వారి జీతాల్లో కోత విధించవద్దు, ఉద్యోగాలు తొలగించవద్దు అని కేంద్ర కార్మిక మంత్రి ప్రకటన చేసినా వలస కార్మికులను పట్టించుకున్న యజమాని లేడు. కేంద్రం చిత్తశుద్ధి లేని ప్రకటనలు వెలువరించింది తప్ప కచ్చితంగా అమలుపరిచే జీవోలు, ఆదేశాలు జారీ చేయలేదు. పని లేని దగ్గర ఉండలేక, సొంతూరు వెళ్లడానికి కాలినడకన బయలు దేరిన వలస కార్మికులు ఇంటికి చేరకుండా మధ్య దారిలోనే ప్రాణాలు వదలడం అత్యంత బాధాకరం.

మన దేశంలో వలస కార్మికులు 90 లక్షలు మంది ఉన్నారని అంచనా. వీరిలో అత్యధిక భాగం మంది నిర్మాణ రంగంలో పని చేస్తున్నారు. వీరిలో సగం మంది ఉత్తర ప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, బీహార్‌, తమిళనాడు రాష్ట్రాల నుంచి ఢిల్లీ, ముంబై నగరాలకు వలసలు వెళ్లిన వారే. దక్షిణాది రాష్ట్రాల నుంచి కూడా పొట్ట చేత పట్టుకొని వేలాది కిలోమీటర్లు వలస పోతుంటారు. గుజరాత్‌ లోని పోర్‌బందరు, వెర్వేల్‌ సముద్ర ప్రాంతానికి ఉత్తరాంధ్ర నుంచి మత్స్య కార్మికులు ప్రతి సంవత్సరం పనుల కోసం వెళ్తుంటారు. 

ప్రతి సంవత్సరం మార్చి, ఏప్రిల్‌ నెలలో 70 శాతం చేపల వేట అవుతుంది. ఒక ట్రిప్పు సముద్రం లోకి వెళ్లి వచ్చేసరికి పరిస్థితి అంతా తారుమారైంది. లాక్‌డౌన్‌ తో ట్రాలర్ల నుంచి బయటికి వెళ్లడానికి లేదు. ఐస్‌ ఫ్యాక్టరీలు ఆగిపోవడంతో వేటాడి తెచ్చిన చేపలు బాక్స్‌లో పెట్టడానికి ఐస్‌ లేదు. ఈ సీజన్లో వేట అయిపోయినట్లే. ప్రతి ట్రాలర్‌లో పది మంది చొప్పున ఇరుకు బోట్లలో నేటికీ నరకం అనుభవిస్తున్నారు. గుజరాత్‌ ప్రభుత్వం ట్రాలర్ల యజమానులకు భోజనాలు, ఇతర సౌకర్యాలు కల్పించాలని చెప్పి చేతులు దులుపుకుంది. ట్రాలర్‌ యజమానులు మేం చేయలేమని తప్పించుకుంటున్నారు. మధ్యలో మత్స్యకారులు నలిగిపోతున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో చూస్తే...రూ.28 వేల కోట్ల పెట్టుబడితో ఇప్పుడు హిందూస్థాన్‌ పెట్రోలియంలో 'ఎల్‌ అండ్‌ టి' ద్వారా జరుగుతున్న విస్తరణ పనుల్లో స్థానికులు నామమాత్రంగా వున్నారు. పరవాడ ఫార్మా సిటీలో మూడు వేల మంది, అచ్యుతాపురం ఎస్‌ఇజెడ్‌, రాంబిల్లిలో మరో మూడు వేల మంది వలస కార్మికులు పని చేస్తున్నారు. నెల్లూరూ జిల్లా ముత్తుకూరు క్లస్టర్‌, చిత్తూరు జిల్లా సత్యవేడు ప్రాంతం లోని శ్రీ సిటీతో సహా ప్రతి జిల్లా లోనూ హిందీ రాష్ట్రాల్లోని వలస కార్మికులు పని చేస్తున్నారు.

ప్రస్తుతం లాక్‌డౌన్‌ కారణంగా తమ సొంత గ్రామాలు వెళ్లాలని బయలుదేరిన వలస కార్మికులు ఊరూవాడా తెలియని చోట బందీలుగా ఉన్నారు. వీరి పట్ల కనీస జాలి, దయ, సానుభూతి లేని బడా పెట్టుబడిదారులు వలస కార్మికులు వెళ్లి తిరిగి రాకపోతే తమ ఆర్థిక వ్యవస్థ ఏమౌతుందని గుండెలు బాదుకుంటున్నారు. అంతే తప్ప...వారి బతుకులు ఏమవుతాయని ఆలోచించడం లేదు. పని చేసిన కాలానికి జీతాలు చెల్లించాలని వలస కార్మికులు అడిగిన చోట ఉత్తర ప్రదేశ్‌ వంటి పలు రాష్ట్రాల్లో వారిపై భాష్పవాయువు ప్రయోగించారు. ఎక్కడ వలస కార్మికులను కదిలించినా మా ఊరు ఎప్పుడు వెళ్తామని ఘోషిస్తున్నారు.

దేశంలో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్ళిన వలస కార్మికులకు అన్ని రకాల భద్రత కల్పించడం ప్రభుత్వాల బాధ్యత. ఈ విషయంలో కేరళ లోని వామపక్ష ప్రభుత్వం ఆదర్శంగా వుంది. వలస కార్మికులకు 'అతిథి కార్మికులు' పేరుతో ప్రభుత్వ సౌకర్యాలన్నీ వారికి వర్తింపజేస్తోంది.

తిండి, నీరు, నివాసం లేని వీరికి తాత్కాలికంగా భోజన వసతితో కూడిన సౌకర్యాలు ఏర్పాట్లు చేసి సహాయపడడంలో దేశం లోనూ, రాష్ట్రం లోనూ సిఐటియు ముందుంది. ప్రతి రోజూ ఇతర రాష్ట్రాల నుంచి రాష్ట్ర నాయకులకు వచ్చే ఫోన్లకు స్పందించి, వలస కార్మికులు ఎక్కడున్నా వెతికి వారికి సిఐటియు ఆపన్నహస్తం అందిస్తున్నది. ఆహారం వసతులతో పాటు ధైర్యాన్ని కల్పిస్తున్నది.

- సిహెచ్‌ నర్సింగరావు (వ్యాసకర్త సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు)

సులోచన, వయసు 24 సంవత్సరాలు. గర్భవతి. తమిళనాడు, తిరుచిరాపల్లి జిల్లా రెట్టియపట్టి గ్రామం. నొప్పులు రావడంతో, భర్త మరో బంధువుతో కలిసి  తమ గ్రామం నుండీ 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న మనప్పరాయ్ లోని ఆస్పత్రికి అంబులెన్స్ లో వెళ్ళారు. సిజేరియన్ చేయించుకుంటే బెటర్ అని అక్కడి డాక్టర్లు సలహా ఇచ్చారు. కాకపోతే, సిజేరియన్ సమయంలో రక్తం ఎక్కించాల్సి ఉంటుందనీ, లాక్ డౌన్ వల్ల ఆస్పత్రిలో రక్తం అందుబాటులో లేదనీ, డోనర్ ని తీసుకుని రావాలని , లేకపోతే, ఊరికి వెళ్ళి, నాలుగురోజుల తర్వాత తిరిగి రావల్సిందిగా డాక్టర్లు సూచించారు.

ఆ ఊరిలో తమకు తెలిసిన వారు ఎవ్వరూ లేకపోవడంతో, రక్తం దొరకడం అయ్యేపని కాదని, తమ గ్రామానికి తిరిగి వెళ్ళిపోవాలనీ వారు డిసైడ్ చేసుకున్నారు. కానీ, తమను ఆ హాస్పిటల్ దగ్గర డ్రాప్ చేసిన అంబులెన్స్ అప్పటికే వెళ్ళిపోయింది. ఎలాగోలా సెంటర్ కి వెల్తే అక్కడ ఏవైనా వెహికల్స్ ఉండొచ్చని, సులోచన, ఆవిడ భర్త, మరో బంధువు , ముగ్గురూ కలిసి మెల్లగా రోడ్డుపై నడుచుకుంటూ బయల్దేరారు.

రోడ్డుపై విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ ఈ సమయంలో ఎక్కడికి వెళ్తున్నారని వారిని ఆపి అడిగాడు. ఆస్పత్రి నుండీ తమ గ్రామానికి వెళ్తున్నామని వారు చెప్పడంతో, వారికి ట్యాక్సీ ని అరేంజ్ చేశాడు. ఇంతలో అనుమానమొచ్చి, నెలలు నిండినతర్వాత, ఆసుపత్రికి కాకుండా, ఇంటికెందుకు వెళ్తునారని అడిగాడు. రక్తం దొరకకపోవడం వల్ల అని తెలియడంతో, కావలసిన బ్లడ్ గ్రూప్ ఏదో కనుక్కుని, వారిని తన డ్యూటీ ఐపోయే టైమ్ 2.PM వరకూ అక్కడే వెయిట్ చేయమన్నాడు. ఈ లోపలే ముగ్గురికీ లంచ్ కూడా తెప్పించాడు. డ్యూటీ ఐపోగానే, వారిని నేరుగా హాస్పిటల్ కి తీసుకెళ్ళి, తానే బ్లడ్ డొనేట్ చేశాడు. రాత్రి పది గంటలకు ఆడ పిల్ల పుట్టింది. పాపను చూసి, ఆ తర్వాతే ఇంటికెళ్ళాడు. తెల్లారేకల్లా , ఈ విషయం లోకల్ న్యూస్ లో రావడంతో, డిజీపీ 10000/- రూపాయలు పారితోషికం ప్రకటించారు. కానిస్టేబుల్ ఆ పదివేలను బాలింతరాలికి గిఫ్టుగా ఇచ్చేశాడు.
అతనే కింద ఫోటో కానిస్టేబుల్ , పేరు -సయ్యద్ అబూతాహిర్.🙏🙏🙏


చెప్పాలని ఉంది

వందల మైళ్ళు నడుస్తున్న గ్రామీణ యువకులు. నడచి నడచి సొమ్మసిల్లి చనిపోయిన 12 ఏళ్ల అమ్మాయి. సాధారణ జబ్బులకు వైద్యం అందని అభాగ్యులు. సకాలంలో వైద్యం అందక గుండెజబ్బుతో చనిపోయిన ముస్లిం మహిళ. జ్వర పీడిత పాపను భుజాన మోసిన కన్నతండ్రి ఆవేదన.ఆటోలు లేక కన్నతండ్రిని వీపుపై మోసుకెళ్తున్న కన్నకొడుకు కష్టం.చనిపోయిన కూతురు శవానికి పోస్టుమార్టం అంబులెన్స్ కు డబ్బులు కట్టలేక ఆటో లో ఇంటికి తీసుకొస్తున్న దంపతుల కన్నీళ్లు. భర్త శవాన్ని రోడ్డు పక్కన ఉంచి రోదిస్తూ కాపలా కాస్తున్న సగటు ఇల్లాలు. శవ దహన లకు కూడా అనుమతి నిరాకరిస్తున్నట్లు గ్రామస్తుల భయం. అందరూ అనుమానిత మనుషులే చుట్టూ మనుషులు లేనట్లే. ఢిల్లీలో బిస్కెట్ల కోసం గేట్ల వెనక చేయిచాచి ఉన్న యువకులు. అన్నం కోసం ఎదురుచూస్తున్న రోడ్డుపైన అనాధలు. ఒకవైపు ముంబై వలస కూలీల తిరుగుబాటు. క్వా రైంటిన్ లో నుండి పోలీసులపై రాళ్ల దాడి మరోవైపు. స్వచ్ఛంద నిర్బంధం కాదు ఇది బలవంతపు అణిచివేత.
పోలీసులు ఇతర అధికారులు తమ దర్పానికి హద్దు లేదు.
స్వచ్ఛందం సహాయం అంటూ వ్యక్తిగత కీర్తి కాంక్ష. సోషల్ మీడియా అంతా ఒక సంత.
ప్రయోజనం స్వల్పం ఆడంబరం కొండంత.
సీఎంలకు కొందరు చెక్కులు ఇస్తారు వారికి దూరం అక్కర్లేదు. ఎంత ఇస్తున్నారు? ఎంత వస్తుంది ?ఎంత పంచుతున్నారు ?ఇది ఒక శేష ప్రశ్న?

ఈ మహమ్మారి విపత్తు కొందరికి హాస్యం. మరికొందరికి వెటకార ధోరణుల చేష్టల పలుకులు.
సాహిత్యం ఎందుకు దాని ప్రయోజనం ఏమిటో తెలియకుండానే పుంఖానుపుంఖాలుగా కవిత్వం కథలు అంటూ సోత్కర్ష లు.
పత్రికల్లో బహుమతుల ప్రకటన వ్యక్తిగత ప్రోత్సాహ వాదమా సిగ్గుచేటు. ప్రజలను సమూహాలను చైతన్యం చేయడం చేతకాదు కొందరి కుహనా మేధావులకు.సందట్లో సడేమియా లాగా పరిస్థితిని అనుకూలంగా మార్చుకునే అవకాశవాదులు. ప్రజలను తమ భావాలతో అభిప్రాయాలతో విహారం చేస్తున్న చాందస శక్తులు.
ఎప్పుడు ఏదో పాతకాలపు చిట్కాలు అంటూ అంతా అందులో దాగి ఉంది అంటున్నారు . ఆధ్యాత్మిక మతం ముసుగులో కపట ఉపన్యాసకులు. వైద్యం ఆరోగ్యం పేరుతో అశాస్త్రీయ భావాల ప్రచారాలు. ప్రస్తుతం ఫ్యూడల్ రాజ్యం తాలూకా లక్షణాలన్నీ బహిర్గతమవు తున్నాయి. మనం ముందుకు పోవడం లేదు ఇంకా వెనక్కి పోతున్నాం పోతున్నాం.
నా మాటలకు ఒక సిద్ధాంతం ఉంది .నిర్దిష్ట పరిస్థితుల్లో నిర్దిష్ట ఆలోచన ,ప్రయత్నం ,ప్రయోగం, ఫలితం కావాలి. అందుకు మనిషి కృషి, సాధనలో ఘర్షణ ఎప్పుడూ ఉంటుంది.

     .... ప్రజ్ఞ సురేష్...

Comments

Popular posts from this blog

ఇండియాలో_ఆక్సిజన్_వదిలే_ఆవులున్నాయా

Control over NSE