షహీన్ బాగ్
సాయంత్రం నాలుగు గంటలు..
సహజంగా స్కూల్ నుంచి పిల్లలు ఇంటికి వచ్చే సమయం.. వాళ్లను చూసుకోవడమే పెద్ద పని
సాయంత్రం వంట పనులకు సంబంధించిన సన్నాహాల్లో వాళ్లు ఎక్కువగా గడిపేవారు.
కానీ ఇప్పుడు వారి టైమ్ టేబుల్ మారిపోయింది.
సాధారణ గృహిణి అయినా, ప్రైవేటు సంస్థల్లో పనిచేసే మహిళ అయినా , ఏ చిన్న వృత్తి చేసుకుంటున్న వారయినా సాయంత్రం అయితే చాలు ఓ చోటకి చేరిపోతున్నారు.
కాకినాడ నగరంలోని బాలాజీ చెరువు సెంటర్ కి వచ్చేస్తున్నారు.
ఎవరి ఆటో ఖర్చు వాళ్లే భరిస్తూ, ఎవరికి వారే అక్కడికి కావడం ఆశ్చర్యకరంగా కనిపించింది.
నాలుగైదు గంటల పాటు నినాదాలిస్తూ, నిరసన వ్యక్తం చేస్తూ నిత్యం అదే పనిగా సాగుతున్నారు.
ఢిల్లీలో షాహీన్ బాగ్ గురించి విన్నాను. అక్కడి మహిళల పోరాటం గురించి మీడియాలో చదివాను.
వారి స్ఫూర్తితో కాకినాడ మహిళలు ఆజాద్ చౌక్ అంటూ చేపట్టిన ఆందోళన ఎలా సాగుతుందో తెలుసుకుందామని వెళ్లాను.
ఆదివారం కావడంతో మహిళలతో పాటుగా చిన్నారులు కూడా పెద్ద సంఖ్యలోనే వచ్చారు. సాయంత్రం ఆరు తర్వాత ఇంకా ఎక్కువ మంది వస్తుంటారట. ఎనిమిది, తొమ్మిది వరకూ అంటే రోజూ ఐదుగంటల పాటు తమ నిరసన కొనసాగిస్తున్నారన్న మాట.
సీఏఏ, ఎన్నార్సీకి వ్యతిరేకంగా జగన్ స్పందించాలని అక్కడ చిన్నారుల ప్లకార్డులో రాసి ఉంది. ఏపీలోనే మొదటిసారిగా కాకినాడలో మునిసిపల్ కార్పోరేషన్ పాలకవర్గం తీర్మానం చేసింది. ప్రస్తుతం ఆ నగరంలో తప్పా ఇంకెక్కడా పాలకవర్గాలు లేవు. ఇక ఆ తీర్మానాన్ని టీడీపీ కార్పోరేటర్ ప్రవేశపెడితే, వైసీపీ సంపూర్ణంగా మద్ధతు ఇచ్చింది. బీజేపీ తరుపున ఒక్క కార్పోరేటర్ మాత్రం వ్యతిరేకించినా తీర్మానం ఆమోదం పొందింది.
తీర్మానం ప్రవేశపెట్టిన కార్పోరేటర్ నేను వెళ్లిన సమయానికి అక్కడ ఉన్నారు. ఆమెతో మాట్లాడితే అనుకోకుండా జరిగిపోయింది. అందరూ సహకరించారు. జీహెచ్ఎంసీ చేసిన తీర్మానం గురించి తెలుసుకుని కాకినాడలో చేశాం. మా మేయర్ రెండు సార్లు ఆజాద్ చౌక్ కి వచ్చి మాకు మద్ధతు తెలిపారు. ఆమె కూడా సంపూర్ణంగా సపోర్ట్ చేయడం తో జరిగిపోయింది. దేశంలో అందరికీ నష్టం చేసే చట్టాల గురించి స్పందించకపోతే ఇక పాలకవర్గంలో ఉండి ఏం ప్రయోజనం అని నాకు అనిపిస్తోంది అంటూ అభిప్రాయం వ్యక్తం చేశారు.
అక్కడున్న ఓ మహిళను మీరెందుకు ఎన్నార్సీని వ్యతిరేకిస్తున్నారని అడిగితే ఆశ్చర్యం వేసే సమాధానం వచ్చింది. షాహీన్ బాగ్ మహిళల ఆందోళన మమ్మల్ని కదలించింది. మా ప్రాంతంలో గతంలో జమాతే ఇస్లామీ వారితో కొందరు బయటకు వెళ్లేవారు. మేమెప్పుడూ ఎటువంటి నిరసనల్లో పాల్గొనలేదు. కానీ ఇప్పుడు అందరినీ అనుమానించే చట్టం తీసకొచ్చారు. మా పూర్వీకుల ఆధారాలు చూపకపోతే మమ్మల్ని శిక్షిస్తామంటూ తెచ్చిన చట్టం వల్ల మతాలతో సంబంధం లేకుండా అందరికీ ఇబ్బంది వస్తుంది. అది గ్రహిచిన అన్ని మతాల వాళ్లు మా వెంట వస్తున్నారు. ఇంకా తెలియని వాళ్లకు రోజూ పొద్దున్నే రోజూ ఓ గంట పాటు ఇంటింటికీ తిరిగి చెబుతున్నాం. అందరూ స్పందిస్తున్నారు అంటూ వివరించింది.
ఆజాద్ చౌక్ లో ఆందోళన చేస్తున్న మహిళలకు అండగా మతాలతో సంబంధం లేకుండా చాలామందే వస్తున్నారు. ముస్లీం మహిళల వెంట వారి కుటుంబాలకు కొందరు కొందరు మగాళ్లు కూడా వస్తున్నారు. వారిలో ఒకాయన్ని పలకరించాను. 13 రోజులవుతుంది. ఎన్ని రోజులయినా ఇలా చేస్తూనే ఉంటాం. అలాంటి చట్టాలను అందరూ వ్యతిరేకించాలి. కానీ రాజకీయ పార్టీలు స్పందించడం లేదు. టీడీపీ, వైసీపీ కూడా అవకాశవాదంతో ఉన్నాయి. జనసేన వెళ్లి బీజేపీలో కలిసిపోయింది. కమ్యూనిస్టులు ఒక్కరే రోజూ వచ్చి మద్ధతు చెబుతున్నారు. అందరూ కలిసి వచ్చేలా చేస్తాం. మా ఎమ్మెల్యే గారిని కలుస్తాం. అందరం ఒక్కటయితేనే ఇలాంటి ప్రమాదం నుంచి తప్పించుకోగలం..అన్నారు.
పిల్లల్లోనూ అదే స్ఫూర్తి కనిపించింది. పెద్దల్లోనూ పట్టుదల ఉంది. ఎన్నార్సీ, సీఏఏ, ఎన్పీఆర్ మీద వ్యతిరేకత మూలంగా మొదలయిన ఉద్యమం కొత్త పుంతలు తొక్కుతున్నట్టు కనిపిస్తోంది. ఇలాంటి ప్రయత్నాలు పలువురిలో ఉత్సాహాన్ని నింపుతున్నాయి. సామాన్యుల మహిళలు ముందుకొచ్చి స్వచ్ఛందంగా చేపట్టిన ఈ నయా తరహా నిరసనలు కొత్త సెక్షన్లు ఉద్యమంలో భాగస్వాములవడానికి దోహదం చేస్తున్నాయి.
-శంకర్, జర్నలిస్ట్
*షాహీన్ బాగ్ కి రేపటికి యాబై రోజులు!*
అరబ్ మల్లెల విప్లవ కాలంలో (2011) ఈజిప్ట్ రాజధాని కైరో లో ప్రజాఉద్యమ స్ఫూర్తి కేంద్రంగా 'తెహ్రిక్ స్క్వేర్' పేరొందిన విషయం గుర్తు వుండే వుంటుంది. సుమారు తొమ్మిదేళ్ల తర్వాత నేడు ఢిల్లీ షాహీన్ బాగ్ కూడా దేశవ్యాపిత ఉద్యమ స్ఫూర్తి కేంద్రంగా వర్ధిల్లుతోంది. డిసెంబర్ 15న జామియా మిలియా విశ్వవిద్యాలయం విద్యార్థులు మొదటిసారి NRC, CAA లకు వ్యతిరేకంగా ప్రజాతంత్ర పోరాట బావుటా ఎగర వేయడం తెల్సిందే! అదే తాజా దేశవ్యాపిత ప్రజావెల్లువ కి దారిదీపం అయ్యుంది. (దానికి నాలుగు రోజుల ముందే అస్సాం విద్యార్థులు కూడా పోరాట బావుటా ఎగరేసినా, అది NRC కి అనుకూలం, కేవలం CAA కి వ్యతిరేకం మాత్రమే కావడం గమనార్హం. అది ఫాసిస్టు వ్యతిరేక ఉద్యమానికి స్ఫూర్తి ఇచ్చినా, దేశవ్యాపిత NRC వ్యతిరేక ఉద్యమానికి దారిదీపం కాదు) దాని స్పూర్తితో ఆ మారునాడే అంటే డిసెంబర్ 16 న షాహీన్ బాగ్ శిబిరాన్ని మహిళలు చొరవతో ప్రారంభించారు. రేపు ఫిబ్రవరి 3వ తేదీకి 50 రోజులు నిండనున్నది. ఈ సందర్భంగా ఓ చిన్న సందేశమిది.
తొలిరోజు కొద్దిమంది మహిళలు, అదికూడా ముస్లిం మహిళలు ప్రారంభించిన షాహీన్ బాగ్ నేడు దేశవ్యాపిత ప్రజావెల్లువకి ఒక ప్రతీకాత్మక ఉద్యమ స్ఫూర్తి కేంద్రంగా వర్ధిల్లుతోంది. దాని స్పూర్తితో 50 కి పైగా అలాంటి శిబిరాలు నేడు దేశంలో సాగుతున్నాయి. మోడీ-షా ఫాసిస్టు ప్రభుత్వానికి రాజకీయ వణుకు పుట్టిస్తోంది. ఢిల్లీ ఎన్నికలకు ముందు ఓ మారణహోమంతో దాన్ని నిర్మూలించే దుస్సాహసానికి మోడీ షా ప్రభుత్వం నేడు వెనకాడుతోంది. అదేసమయంలో అది కొనసాగడాన్ని భరించలేక పోతోంది. అందుకే రకరకాల కుట్రలకు పధకం రచన చేయాల్సిన స్థితిలో పడింది. అందులో భాగమే వారుసవారీ కాల్పుల సంఘటనలు కావచ్చనేది ఒక అంచనా! దాన్ని కాపాడుకోవడం దేశవ్యాపిత ప్రజాతంత్ర, ప్రగతిశీల శక్తుల రాజకీయ కర్తవ్యం! ఆ వెలుగులో రేపు 50 వ రోజు దీక్ష వహిద్దాం. షాహీన్ బాగ్ అర్ధశత దినోత్సవం సందర్బంగా దాని రాజకీయ ప్రాధాన్యతను ప్రచారం చేద్దాం.
ఈరోజు ఉదయం ఇదే అంశంపై fb లో ఒక చిన్న వ్యాఖ్య ను పోస్ట్ చేశా. ప్రతిస్పందనతో పాటు ఒక సూచనను కొందరు మిత్రులు చేశారు. ఓ చిన్న రైటప్ ని వాట్సాప్ గ్రూపులలో పెట్టమని సూచించారు. ప్రచారం జరిగి రేపు వాడవాడల్లో అన్ని ధర్నా శిబిరాలలో షాహీన్ బాగ్ స్మారక స్ఫూర్తి కి ప్రయత్నాలు చేసే అవకాశం ఉంటుందని మిత్రుల సూచన మేరకు దీన్ని పోస్ట్ చేస్తున్నా.
*-ఇఫ్టూ ప్రసాద్ (పిపి) 2-2-2020*
*షాహీన్ బాగ్ వెలుగు రేఖలు : ఆశ, విశ్వాసం*
*ముష్కరులు, పాలకులు, దుండగులకు ఈ వెలుగు రేఖలు మసకబార్చే అవకాశం ఇవ్వకూడదు. అద్భుతమైన ప్రజాతంత్ర ప్రయోగం పై నిందలేసే అవకాశం ఇవ్వకూడదు.*-- హరీష్ ఖరే
మనం నిర్మించబూనుకున్న నవ భారతం ఎలా ఉంటుందో చూపించటానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ని ఆహ్వానించినట్టున్నాము. కానీ వాషింగ్టన్ నుండి వచ్చిన అతిధి పాత భారతాన్నే చూసి వెళ్ళాడు. మధ్యాయుగాల మూర్ఖత్వంలో మునిగిన భారతాన్ని చూసి వెళ్ళాడు. ట్రంప్ పర్యటన విజయాన్ని దక్కనీయకుండా చేసేందుకు కుట్ర జరిగింది అన్న ప్రభుత్వ సమర్ధకుల వాదననే పరిగణనలోకి తీసుకుంటే మన పాలనా వ్యవస్థలన్నీ విఫలం అయ్యాయని, అంతా సజావుగా ఉందని చెప్పుకునేందుకు ప్రభుత్వం కేవలం నటిస్తోందని అర్ధమవుతుంది. ఈ వైఫల్యానికి పునాదులు గత కొంత కాలంగా సిద్ధమవుతున్నాయి. సమాజంలో శాంతి సౌబ్రాతృత్వాలను కాపాడాల్సిన పాలకులు తమ బాధ్యత మరిచిన రోజున ఈ వైఫల్యం మరింత వేగంగా ముందుకు రావటం ఖాయం.
*ఉద్యమాన్ని అభాసుపాల్చేసే ప్రయత్నం*
షాహీన్బాగ్ ఉద్యమాన్ని అభాసు పాల్చేసే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతుండటంతో గత కొన్ని రోజులుగా ఢిల్లీ చవి చూసిన మారణహోమానికి, వికృత దాడులకు కొంతకాలంగా రంగం సిద్ధం అవుతూ వచ్చిందన్నది వాస్తవం. 2019లో కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన లోపభూయిష్టమైన పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా షాహీన్బాగ్ లో గత మూడు నెలల నుండి శాంతియుతంగా నిరసనలు జరుగుతున్నాయి. గత రెండు నెలలుగా ఢిల్లీ లో గడ్డ కట్టే చలిని సైతం ఎదుర్కొంటూ షాహీన్బాగ్ నిరసన శిబిరంలో కూర్చున్న వృద్దులు, యువతులు, పిల్లల ముఖాలు దేశమంతా చూస్తోంది. ఈ మహిళలను రెచ్చగొట్టేందుకు జరిగిన అన్ని ప్రయత్నాలు బెడిసి కొట్టాయి. ప్రలోభ పెట్టె ప్రయత్నాలు ఫలించలేదు.
రాజ్యాంగం, జాతీయ గీతం, జాతీయపతాకం వంటి జాతీయ చిహ్నాలను షాహీన్బాగ్ ఉద్యమంలో ముస్లింలు సృజనాత్మకంగా ఉపయోగించటాన్ని చూసాము. ఇదంతా ఈ దేశ పౌరలుగా మైనారిటీ మతానికి చెందిన పౌరులుగా తమ హక్కులను ఎలుగెత్తి చాటాటానికి మాత్రమే ఈ ఉద్యమం పరిమితం అయ్యింది. షాహీన్బాగ్ కు కాళ్ళు ఇచ్చింది ముస్లింలే అయినా లౌకిక ఉద్యమంగా రూపాంతరం చెందే దిశగా ఈ ఉద్యమం సాగుతోంది. ఓ నూతన పౌరతర్కం రూపు దిద్దుకొంటోంది. అన్నిటికీ మించి షాహీంబాగ్ సరికొత్త నైతిక విలువలకు ప్రతిరూపంగా నిలవడంతో ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. మన 'నవ భారత నిర్మాతలు' కళ్ళు తెరిచేలోగా దేశ వ్యాప్తంగా అనేక చోట్ల షాహీన్ బాగ్ స్ఫూర్తి తో ఉద్యమ కేంద్రాలు వెలిశాయి. ఈ నూతన ధిక్కార స్వరాలు క్రమంగా రాజకీయ ప్రధాన స్రవంతిగా మారుతున్న తరుణం ఇది. వీధుల్లో, మీడియాలో స్వైరవిహారం అని భావించిన వాళ్లకు, అందరూ తమ కళ్ళతోనే దేశాన్ని చూడాలని కోరుకున్న వాళ్లకు ఈ ఉద్యమం కంటగింపుగా మారింది.
దేశంలో శాశ్వతమైన విభజన తీసుకురావటానికి అత్యంత చాకచక్యంగా పౌరసత్వ చట్టాన్ని ముందుకి తెచ్చిన పాలకులకు షాహీంబాగ్ ప్రయోగం, దాని శాంతియుత స్వభావం గంగవెర్రులెత్తించింది. షాహీన్బాగ్ కేవలం ముస్లిం తిరుగుబాటు అని ముద్ర వేయటానికి అపర చాణుక్యులు చేసిన ప్రయత్నం బెడిసి కొట్టడంతో ఈ మూకలు మరింతగా గందరగోళానికి గురయ్యాయి. రాజ్య దమననీతి తో ఎటువంటి నిరసనలనైనా, రాజకీయ ప్రజాతంత్ర అసమ్మతులనైనా నులిమి వేయవచ్చని నమ్మిన పాలకులకు షాహీనబాగ్ దిక్కుతోచని స్థితి కల్పించింది. గణతంత్ర విలువలనే లౌకిక నినాదాలుగా మార్చుకున్న షాహీంబాగ్ నవభారత నిర్మాతలమవుదామని ఆశించిన పాలకులకు సైద్ధాంతికంగా కూడా మింగుడుపడనిదిగా మారింది. దీంతో ఏదొకటి చేయాలన్న తపన మొదలైంది.
*ఎన్నికలలో తిరస్కృతి అనంతరం...*
తమ శక్తి సామర్ధ్యాలను ఎక్కువగా ఊహించుకున్న భారతీయ జనతా పార్టీ నాయకులకు ఢిల్లీ ఎన్నికలు తమ సత్తా చాటుకునేందుకు ఓ అవకాశంగా కనిపించాయి. కేంద్ర హోం మంత్రి మొదలు దేశంలోని వివిధ ప్రాంతాల నుండి ఎన్నికల ప్రచారానికి సమీకరించబడ్డ బిజెపి నేతలు ఉద్రిక్తతలకు, రెచ్చగొట్టుడు ఉపన్యాసాలు, హింసాత్మక చర్యలు, చివరకు దేశభక్తిని కూడా ఎన్నికల బరిలోకి దించారు. షాహీంబాగ్ నిరసనకారులకు సందేశం ఇవ్వాలని ఓటర్లను ఆహ్వానించారు. తన మతోన్మాద రాజకీయాలకు ఆమోదం పొందటానికి ఢిల్లీ ఎన్నికలను ఓ అవకాశమనే వ్యూహాన్ని బిజెపి అనుసరించింది. ఢిల్లీ ఓటర్లు ఈ బీజేపి వ్యూహాన్ని నిస్సంకోచంగా తిరస్కరించారు. ఈ ఓటమిని గుర్తించి స్వీకరించటానికి బదులు బిజెపి నాయకత్వం ఓటు షేర్ పెరిగిందని సమర్ధించబూనుకుంది. షాహీన్బాగ్ ను మరోసారి వివాదాస్పదంగా మార్చి ప్రజలను రెచ్చగొట్టడానికి సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ బిజెపి నేత కపిల్ మిశ్రా జఫ్ఫారాబాద్ లో సీఏఏ వ్యతిరేక నకరసన శిబిరాలను ఎత్తేయించాలని లేని పక్షంలో తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని ఢిల్లీ పోలీసులను హెచ్చరించారు.
షాహీన్బాగ్ నమునాతో ముస్లిం సాంప్రదయక నాయకత్వం కూడా అసంతృప్తి తో ఉందని బిజెపి నేతలు వాదించారు. షాహీంబాగ్ ఉద్యమంలో మహిళలు ముందు పీఠిన ఉన్నారు. ముల్లాలు మౌల్వీలు పురుషులు తెరమరుగయ్యారు. షాహీన్ బాగ్ కేవలం కాషాయ దళాలకే కాక అస్తిత్వ వాదాన్ని పెంచి పోషించే నాయకత్వానికి కూడా సవాలు విసురుతోంది. సాంప్రదాయక ముస్లిం నేతల పట్టు నుండి మహిళలు స్వేచ్ఛగా వ్యవహరించటానకి సిద్ధం అవుతున్నారనటానికి షాహీన్బాగ్ ఓ ఉదాహరణ. సుప్రీంకోర్టు నియమించిన దూతలు నేరుగా షాహీన్బాగ్ మహిళలతో మాటాడుతున్నారు తప్ప తమతో మాటాడటం లేదని ఈ మతతత్వ వాదులకు అర్ధం అయ్యింది.
షాహీంబాగ్ కు ఆమడ దూరంలో ఉన్న ఉత్తర ప్రదేశ్ లో యోగి ఆడిత్యనాధ్ ప్రభుత్వం సీఏఏ వ్యతిరేక ఆందోళనకారులపై పోలీసులను ఉసి గొల్పిన విషయం కూడా జాతీయ బిజెపి నాయకత్వానికి గమనంలో లేకుండా పోయింది. ముస్లింలకు వ్యతిరేకంగా ఉత్తర ప్రదేశ్ పోలీసులు సాగిస్తున్న దామనకాండ గురించిన వార్తలు యమునా నదిలో నీళ్లతో పాటు ఢిల్లీ కి చేరాయి. ఈ పరిణామాలన్నీ షాహీంబాగ్ ఉద్యమం శాంతియుతంగా కొనసాగుతుందా అన్న సందేహాన్ని కలిగించింది. మరీ ముఖ్యంగా ప్రజలపై కక్ష పూనినట్టు వ్యవహరిస్తున్న ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని అదుపు చేసే వ్యవస్థాగత ఏర్పాటు ఏమీ లేక పోవటం మరింత ఆందోళన కలిగిస్తోంది. పౌరసమాజం కానీ మీడియా కానీ రాజకేయ పార్టీలు కానీ న్యాయస్థానాలం కానీ కట్లు తెంచుకున్న ఆంబోతులా వ్యవహరిస్తున్న యూపీ పోలీసు యంత్రాంగాన్ని కట్టడి చేయటానికి చొరవ చూపలేకపోయాయి. ముస్లిం లలో ఆవేదన ఆగ్రహం ఉన్నాయి.
ఇటువంటి వాతావరణం లో ముస్లింలలోని లంపేన్ గాంగ్స్ అదుపు తప్పి వ్యవహరిస్తాయని సాంప్రదాయక నేతలకు తెలుసు. ఈ పరిస్థితుల్లో రెండు రకాల తీవ్రవాద స్వభావం కలిగిన శక్తులు ఏకమయ్యాయి. వీటి లక్ష్యం ఒక్కటే. షాహీంబాగ్ ముందుకు తెస్తున్న శాంతియుత, సంఘీభావాలతో కూడిన లౌకిక ఉద్యమ నమూనాను చెదరగొట్టాలి. నీరుగార్చాలి. రాజ్యాంగాన్ని చేతబూనిన ఈ ప్రజలు కేవలం ఓ గుంపుగా మారాలి. ఈ లక్ష్యాతో కూడిన శక్తులు ఏకం కావటంతో ఢిల్లీ గత వారంలో నిప్పుల కుంపటి అయ్యింది. 2002లో గుజరాత్ నరమేధానికి వ్యూహరచన చేసిన నిపుణులు వీధి పోరాటాల్లో తమదే ప్రతిభ అన్న ధీమాతో వ్యవహరించినట్టు కనిపిస్తోంది. 1984 సిక్కుల ఊచకోత తర్వాత తొలిసారి దేశ రాజధాని మతోన్మాద కలహాలకు వేదికైంది అన్న వికృతానందం ఈ శక్తులకు కలిగితే కలగవచ్చు. ఈ వాతావరణంలో హిందు ముస్లిం విభజన తీసుకురావటం తెలికవుతుందని కూడా ఈ నేతలు నమ్మొచ్చు. అటువంటి విభజన ఎన్నికల విజయాలకు సోపానమవుతుందని కూడా నమ్మవచ్చు.
*ఒంటెత్తు పోకడలను ఓడించాలి*
మోడీ ప్రభుత్వం నెహ్రు వారసత్వం రూపొందించిన సమ్మిళిత సమాజాన్ని కొంసాగించటానికి సిద్ధంగా లేదన్న విషయాన్ని బాహాటంగానే వ్యక్తం చేస్తున్నందున ఇటువంటి వికృతత్వం తలెత్తుతుందన్న అంచనా మనకు ఉంది. అదే మనముందు ఇపుడున్న సవాలు. ఈ దేశం కేవలం హిందువులదే అన్న రాజకీయాలను తిప్పి కొట్టే శక్తి మన రాజ్యాంగ వ్యవస్థలకు సాధనాలకు ఉందా అన్న ప్రశ్నలకు సమాధానం వెతకాలి. నిట్ట నిలువునా చీలిన సమాజంలో కొంత మంది సంకుచిత స్వభావం కలిగిన వాళ్ళు లబ్ది పొందే అవకాశం లేక పోలేదు. కానీ అటువంటి ఒంటెత్తు పోకడలను, దాని పర్యవసానాలను ఓడించటం మన ప్రజాస్వామిక వ్యవస్థలన్నింటికీ అవసరం.
సుప్రీంకోర్టు న్యాయమూర్తి దీపక్ గుప్త దేశం, ఆమాటకొస్తే పాలకులు ఎదుర్కొంటున్న మీమాంస - మెజారిటీ పాలన ప్రజాస్వామ్యంలో అంతర్భాగమే కానీ మెజారిటీతత్వం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం - అన్న మీమాంసను సరిగ్గానే గుర్తించే ప్రయత్నం చేశారు. దీపక్ గుప్త మౌలిక సూత్రాలను గుర్తుకు తెచ్చారు. ఓ రాజకీయం పార్టీ 51 శాతం ఓటు సంపాదించి అధికారానికి రావచ్చు. అంత మాత్రాన ఆ పార్టీ అధికారంలో ఉన్న ఐదేళ్లలో మిగిలిన 49 శాతం ప్రజలకు కనీస ప్రాధమిక హక్కులను తీసేస్తానంటే కుదరదు. ఈ చిన్నం సూత్రం అందరికీ తెలిసిందే. అయినా సరే సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఈ బాధ్యత తీసుకుని మరోసారి గుర్తు చేయాల్సి వచ్చింది.
*భారత రాజ్యాంగం అధికారంలో ఉన్న అన్నీ ప్రభుత్వాలపైన ఒకే గురుతర బాద్యత పెట్టింది. ఈ బాధ్యతలు రాష్ట్రపతి మొదలు పోలీసు కానిస్టేబుల్ వరకు ఒక్కటే. ప్రజంసంక్షేమమే వీరి బాధ్యత. ఈ బాధ్యతల పట్ల ప్రభుత్వాలకు ఉండాల్సిన జవాబుదారీ తనాన్నే షాహీన్బాగ్ రాజకీయాలు గుర్తు చేస్తున్నాయి. షాహీన్ బాగ్ నిరసనలు ఓ ఆశల దీపాన్ని వెలిగిస్తున్నాయి.ప్రజల సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వాలు ప్రజాతంత్ర పద్ధతులకు లోబడి వ్యవజారించాలన్నదే ఈ ఆశల దీపం ప్రసరిస్తున్న కాంతి. ఢిల్లీలో చెలరేగిన హింసాకాండ ఈ ఆశలు దీపాన్ని మసకబారెలా చేయకూడదన్నదే మన అందరి ఆశ.*
( ఈ రోజు ది హిందూ పత్రికలో వచ్చిన వ్యాసానికి స్వేచ్చానువాదం)
Comments
Post a Comment