దధీచి

     
                                                

                అధర్వ్ బ్రాహ్మణి లది అన్యోన్య దాంపత్యం. వారికి లేక లేక  ఒక పుత్రుడు జన్మింంచాడు.అతనికి దధీచి అని నామకరణం చేశారు.దధీచికి చిన్నతనంలోనే అన్ని విద్యలు నేర్పించాడు అధర్వుడు.దధీచి కుశాగ్ర బుద్ది గలవాడు.దధీచి యుక్త వయసుకు రాగానే లోకరీతులు తెలుసుకోవడానికి  దేశ పర్యటనకు తండ్రి అనుమతి తీసుకొని బయలుదేరాడు. అతడు వెళ్లేదారిలో ఎక్కడ చూసినా అడవులు ఉన్నాయి. అడవిలో ఆటవికులు ఎక్కువగా నివసిస్తుంటారు. వారు అసురగణానికి చెందినవారు. ఇతర గణానికి చెందిన వారు కనబడితే చంపేసేవారు.


             దధీచి అడవిలోకి ధైర్యంగా ప్రవేశించే వాడు. అసుర గణానికి చెందిన అటవికులు అతనిని ఆట కాయిస్తే వారితో  తలపడి పోరాడేవాడు. కొద్ది మంది దగ్గర తెలివిగా తప్పించుకుని దాటుకుంటూ పోతున్నాడు. ఒకరోజు అతనికి ఒకచోట ఒక గుర్రం కనిపించింది దాన్ని అధిరోహించాలని అతనికి ఆశ కలిగింది. అప్పటికి గుర్రం గురించి చాలా మందికి తెలియదు. గుర్రాన్ని మచ్చిక చేసుకోవడానికి దానికి  గడ్డిని ఆహారంగా పెట్టి దాన్ని మెల్లగా నిమిరేవాడు. కొన్ని రోజులకు ఆ గుర్రం అతనికి బాగా మచ్చిక అయ్యింది. మెల్లగా దాన్ని అధిరోహించి స్వారీ చేయడానికి ప్రయత్నించాడు. మొదట్లో అది అతన్ని కింద పడేసింది. అలా రెండు రోజులు ప్రయత్నించాక మెల్లగా దాన్ని అధిరోహించాడు.ఆ గుర్రాన్ని తన అదుపులోకి తెచ్చుకుని దాన్ని ముందుకు నడిపించాడు.


            గుర్రం ఎక్కి ముందుకు పోతూ  మరో అడవి లోకి ప్రవేశించాడు.  అక్కడ అశ్విని గణం కనిపించింది.  వారి దగ్గర చాలా గుర్రాలు ఉన్నాయి.   వారు గుర్రాలను మచ్చిక చేసుకున్నారు కానీ వారికి వాటిపై సవారి చేయడం  తెలియదు.గుర్రాలపై స్వారీ చేయడం ఒక దేవగణానికి మాత్రమే తెలుసు. 

 దధీచి దానిపై సవారి చేయడం చూసి  అతన్ని చాలా గొప్ప వ్యక్తిగా భావించి తమ ఆశ్రమానికి ఆహ్వానించారు . గుర్రాన్ని స్వారీ ఎలా చేయాలో నేర్పమని అడిగారు.  వారి ఆతిథ్యానికి సంతోషించి ఆయన వారికి గుర్రపు స్వారీ నేర్పించాడు ఈ విషయం ఈ నోటా ఆ నోటా పడి దేవ గణాధిపతి ఇంద్రునికి తెలిసింది.  దధీచి అశ్విని గణానికి గుర్రపు స్వారీ నేర్పిస్తే వాళ్లు తమపై దాడి చేస్తారని తమ దేేవ గణానికి ముప్పు వాటిల్లుతుందని భావించి దధీచిని తీసుకురావడానికి  స్వయంగా తానే అతన్ని వెతుక్కుంటూ బయలుదేరినాడు.

            

             దధీచి కురుక్షేత్రంలో  శరణ్యావతి సరస్సు వద్ద ఆశ్రమం నిర్మించుకొని గుర్రాలను మేపుకుంటూ జీవిస్తున్నాడు.  చాలామందికి గుర్రపుస్వారీ నేర్పిస్తున్నాడు . ఇంద్రుడు దధీచి ఉన్న ప్రదేశాన్ని కనుక్కున్నాడు.

దధీచి దగ్గరికి వెళ్లి,”దధీచి, నువ్వు   గుర్రపు స్వారీ ఎవరికి నేర్పించకు. అది మన దేవగణానికి మాత్రమే తెలియాలి ఇతర జనాలకు తెలుస్తే ప్రమాదం.  వాళ్లు మనతో సులభంగా యుద్ధం చేస్తారు. మనకు మాత్రమే తెలిస్తే మనం వాళ్లను గుర్రంపై పోయి సులభంగా ఓడిస్తాం “అన్నాడు  ఇంద్రుడు.

                      

              ఇంద్రుని మాటలు విన్న దధీచి” గుర్రపు స్వారీ అందరికీ అవసరమే కదా!  ఎక్కడికైనా సులభంగా ప్రయాణం చేయవచ్చు. బరువును కూడా మోసుకుపోవచ్చు..  గుర్రం యుద్ధానికే కాదు మనిషి అన్ని పనులకు ఉపయోగపడుతుంది. నేను గుర్రపు స్వారీ అందరికీ అనుకున్నాను ఇది చాలా మంచి పని దయచేసి దీన్ని మీరు అడ్డుకో రాదు” అని అన్నాడు.

                 

              తన మాట వినని దధీచిని చూసి ఇంద్రునికి చాలా కోపం వచ్చింది.  వెంటనే ఇంద్రుడు అతనిపై తన ఆయుధాలతో దాడి చేశాడు. వారి మధ్య  భీకరయుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో ఇంద్రుడు దధీచి తలను నరికేశాడు.  అక్కడికి నేర్చుకోవడానికి వచ్చిన ఇతర గణాలను వధించాడు. దధీచి తొడ ఎముక తో  ఒక ఆయుధాన్ని తయారుచేసుకుని వెళ్ళిపోయాడు.


               దధీచి మరణ వార్త తెలిసిన అశ్విని గణం  ఆయన ఆశ్రమం దగ్గరికి వచ్చారు. ఆయన మరణానికి వారంతా విలపించారు.  ఆయనను తమ ఇలవేల్పుగా భావించారు. దధీచి తలకుబదులు గుర్రం తలను అమర్చి  ఆయనను అశ్వినీదేవతలు తమ గణదేవతగా ఆరాధించడం మొదలుపెట్టారు.

(ఈ కథ రుగ్వేదంలో ఒకటో మండలంలో 84 వ సూక్తం చెప్తుంది. భాగవతం లో మరో రకంగా రాసినారు.)


__ పిళ్లా విజయ్
9490122229

Comments

Popular posts from this blog

ఇండియాలో_ఆక్సిజన్_వదిలే_ఆవులున్నాయా

Control over NSE