ధర్మ సందేహాలు
(మహా భారతంలో అసలు కథ కన్నా ఉపకథలే ఎక్కువగా కనిపిస్తాయి. అయితే వాటిని అసలు
కథలోకి రాకచక్యంగా ప్రవేశపెట్టినారు. కురు పాంచాల ప్రాంతం (నేటి డిల్లీ, మీరట్, మధుర)లో కురువంశంవారు, హస్తినాపురాన్ని పాలించారు. ఇక్కడ జరిపిన తవ్వకాలలో క్రీ. పూ1000-700 నాటి నివాసాలు బయటపడినాయి. వీరు తమకు సోదరులైన పాండవులతో రాజ్యం కోసం క్రీ.పూ 950లో ఢిల్లీ కి దగ్గర కురుక్షేత్రం వద్ద యుద్ధం చేసినారు. ఈ యుద్ధమే మహాభారతానికి మూలం. ప్రారంభంలో మహాభారతంను వ్యాసుడు 'జయం' పేరుతో దాదాపు 50 పేజీల కథగా మాత్రమే రాసినాడు. అది క్రీ.పూ. 400 - క్రీ.శ. 400 మధ్యకాలంలో ఆనాటి సమాజములో జరుగుతున్న నీతినియమాలు, రాజనీతి సూత్రాలు, వర్ణవ్యవస్థ వేల్లూనుకుంటున్నప్పుడు ఏర్పడే చట్టాలు మొదలైన వాటిన్నటిని, అలాగే ప్రజలనోళ్ళలో నానే కథలను అన్నింటిని
కలుపుకుని “జయ'లో చేర్చినారు. దాంతో అది పెద్ద గ్రంథంగా మారి 'మహాభారతం'గా పేరొందింది.
ఇతిహాసమైంది.
ఉపకథలన్నీ ఎక్కువగా సూతులు చెప్పే కథలు. యజ్ఞం జరిగేటప్పుడు కథ చెప్పే వ్యక్తిని సూతుడు అంటారు.
ఇది ఒకరు చెప్తూఉంటే అందరూ వినేది. సూతుల కథలు జనంలో బాగా నాటుకుపోయేవి. ఆకథలను కొంతమంది కవులు భారతంలో చేర్చినారు. ఆ కథలను తీసివేసినా మహాభారత కథకు ఏలోటూ రాదు. కానీ ఆకథలనే పెద్ద పెద్ద కావ్యాలుగా తరువాతి కవులు విడివిడిగా రాసినారు. ఉదాహరణకు నలదమయంతుల కథ, అభిజ్ఞానశాకుంతలము, కచదేవయానుల కథ మొదలైనవెన్నో ఉన్నాయి.
మనమిప్పుడు ఇలాంటి చిన్నచిన్న ఉపకథలను చదవడం ద్వారా మానసిక వికాసాన్ని పొందవచ్చు. అయితే వాటిని యధాతథంగా గాక నేటి పరిస్థితులకనుగుణంగా కొద్దిగా మార్చి మనం సామాజిక, వైజ్ఞానిక అవగాహనను పెంచు కోవటానికి దోహదం చేసేవిధంగా కథలను మలిచినాను. వీటిని సహృదయంతో
స్వీకరించాల్సిందిగా కోరుచున్నాను).
ధర్మ సందేహాలు
ధర్మరాజు వనవాసం చేస్తున్న సమయంలో శౌనకరుషి ఆయన వద్దకు వచ్చాడు. కుశల
ప్రశ్నలయ్యాక శౌనకరుషికి ధర్మరాజు తన బాధల్ని చెప్పడం మొదలుపెట్టాడు.
జూదంలో తాను ఎలా ఓడిపోయింది, దుర్యోధనుడు తనభార్య ద్రౌపదిని ఎలా
అవమానించింది. తనను, తన తమ్ముళ్ళను ఎలా హస్తినాపురం పట్టణం నుంచి వెళ్ళగొట్టింది మొదలైన విషయాలను ఆయనకు చెప్పినాడు ధర్మరాజు.
ధర్మరాజు దు:ఖాన్ని చూసి శౌనకుడు, “ధర్మా! దుఃఖం రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి
శారీరకం, రెండు మానసికం. అయితే వివేక వంతుడు రెండింటిని సమంగా చూస్తాడు.
వందభయాలైనా వెయ్యిదు:ఖాలైనా చలించనివాడిని స్థితప్రజ్ఞుడని అంటారు" అని చెప్పినాడు. “మీరు స్థితప్రజ్ఞలు, దు:ఖించరాదు” అని హితబోధ చేసినాడు.
'మానసిక దు:ఖం మనిషి శరీరాన్ని దహించివేస్తుంది. అందువల్ల కాలే ఇనుప గుండును నీళ్ళలో వేస్తే చల్లారినట్లు, మానసిక దు:ఖాన్ని చల్లార్చుకోవడానికి ప్రశాంతత చాలా ముఖ్యం. అది దు:ఖాన్ని ఉపశమిస్తుంది. దు:ఖం గురించి ఆలోచించడం మానేసి తగిన పరిష్కారాలు ఆలోచించాలి. పరిష్కారాలకు తగిన మార్గాలను ఆచరిస్తున్నప్పుడు దుఃఖం తగ్గిపోతుంది" అంటూ శౌనకుడు ధర్మరాజుకు దు:ఖాన్ని గురించి చెప్పినాడు.
"దుఃఖం నుంచి ఉపశమనం పొందాలంటే ఏమి చేయాలి?" అడిగాడు ధర్మరాజు.
దుఃఖ నివారణకు బుద్ధుడు కొన్ని మార్గాలు చెప్పినాడు. ఒకటి కోరికలను త్యజించమన్నాడు.
కానీ మనిషి కోరికలను వదలలేడు. అందువల్ల కోరికలను అదుపులో పెట్టుకోవాలి. ధన సంపాదనకు
సరైనమార్గాన్ని ఎంచుకోవాలి. ఇతరులను మోసం చేయరాదు. దురాశ పనికిరాదు. ఇతరుసొమ్ముపై
కన్నువేసి సంగ్రహిచరాదు. పరస్త్రీలతోగాని, పురుషులతోగాని సంబంధం పెట్టుకోరాదు.
మత్తుపానీయాలు సేవించరాదు. అప్పటికీ దు:ఖం కలుగుతుంటే ఈ క్షణం ఆనందంగా ఉండటం
నేర్చుకోవాలి. రాబోయే ముప్పును అతిగా ఊహించుకోరాదు” అంటూ తనకు తెలిసిన దు: ఖోపశమన
మార్గాలు చెప్పినాడు శౌనకుడు.
ధర్మరాజు "మనిషిపాపాలు ఎందుకు చేస్తాడు?" అని అడిగాడు.
“అధిక తృష్ణ పాపాలన్నింటికీ కారణం. చెట్టు తొర్రలో చిన్న నిప్పురవ్వ పడినా ఆచెట్టంతా
మెల్లగా కాల్చేస్తుంది. అలాగే మనిషి దురాశపూరిత కోరికలు అతన్ని నాశనంచేస్తాయి. ధనలోభం
గలవాడికి శుభాలుండవు. ధనం గలవాడికి ఎప్పుడూ జంకే. తన డబ్బు ఏమైపోతుందోమోనని
ఎప్పుడూ జంకే.ధనమే అన్ని అనర్థాలకు మూలం. ధనం మనిషికి అవసరమేకాని ధనంకోసం
మనిషి పడరాని పాట్లు పడతాడు. రాజులు యుద్ధాలు చేస్తారు. ఇతరుల సొమ్మును దోచుకుంటారు.
ధనం చేరడం అంటే శత్రువును కొనితెచ్చుకోవడమే. మీరుచేసిన రాజసూయయాగం వలన జరిగింది
ఇదే.దుర్యోధనునికి మీ ధనంపై కన్నుకుట్టింది. అతను శత్రువయ్యాడు" అని చెప్పినాడు శౌనకుడు.
"నేను ధనాన్ని నా స్వంతానికి సేకరించలేదు. ప్రజలకు పంచడానికి మాత్రమే సేకరించాను.
దాహం కలిగినవానికి నీళ్ళు ఇచ్చి, ఆకలిగొన్నవానికి అన్నం పెట్టడం గృహస్థుధర్మం. అతిధి దేవోభవ అని పెద్దల సూక్తి. అలాగే రాజు ప్రజల యోగక్షేమాలు చూడటం ప్రధాన ధర్మం. జంతువుల్ని
నిష్కారణంగా చంపి వండి తినడం ఎంతో పాపకార్యం. బుద్ధుడు అహింసను బోధించాడు.అహింసాపరమో
ధర్మః అని పెద్దలు చెప్పింది ఇందుకే. అంతేకాదు పక్షులు, జంతువుల పట్ల
ప్రేమకలిగి వుండాలి. వాటికి కూడా తిండి, నీరు ఇవ్వాలి" అని ధర్మరాజు శౌనకునితో చెప్పినాడు.
ధర్మరాజు చెప్పినవన్ని అక్షరసత్యాలన్నాడు శౌనకుడు . ధర్మరాజు దగ్గర శెలవు తీసుకుని
వెళ్ళిపోయాడు.
(మహాభారత కథ)
___ పిళ్లా కుమారస్వామి , 9490122229.
Comments
Post a Comment