ఏది కళాత్మకత? (కథ)
ఆ రోజు ఆదివారమైనందునేమో రోడ్డుమీద జనం పలుచగా ఉన్నారు. వాహనాల రద్దీ కూడా పెద్దగా లేదు. నేను నా మిత్రుడు జగదీష్ ఉదయాన్నే దగ్గర్లో ఉన్న రైల్వే క్యాంటీన్ లో టీ సేవిద్దామని గది నుంచి బయటకు వచ్చాము.
అప్పటికే వేసవి కావడం వల్ల సూర్యుడు తన తాపాన్ని ప్రదర్శించడం మొదలు పెట్టాడు. ఆ
క్యాంటీన్ ఫర్లాంగు దూరంలో ఉంటుంది. గదికి తాళం వేసి బయటకు వస్తుండగా దూరంగా ఆకాశంలో మబ్బుల పై పడ్డ సూర్యకాంతితో శ్వేత వర్ణంతో మెరిసిపోతోంది. మా గదికి ఎదురుగా రోడ్డుకు ఆవలివైపున ఏపుగా పెరిగిన కొబ్బరి చెట్టుపై సూర్యకాంతి ప్రతిఫలించి ఆకు పచ్చదనాన్ని శోభాయమానం చేస్తోంది.
జగదీష్ మంచి భావుకుడు పైగా కళా ప్రియుడు. వీటిని చూడగానే జగదీష్ లోని భావుకత ఉప్పొంగి కవిత్వం చెప్పడం మొదలు పెట్టాడు.
“అల్లనల్లన కుచ్చిళ్ళు ఎత్తిపట్టి
సూర్యకాంతిలా నడచివచ్చే నా నెచ్చెలీ
నాహృదయాన్ని పరచినాను నీ పాదాలచెంత"
అంటూ అశువుగా నాకు వినిపించాడు.
“అబ్బా! జగ్గూ! భలే వుందోయ్ నీ ప్రేమ కవిత!
నేను నీలో మంచి భావుకత వుంది' అంటూ పొగిడాను.
కొబ్బరాకు పై రాలిన చినుకు పై పడ్డ కాంతిలా
నీ బుగ్గలపై మెరిసిన దరహాసం
నా హృదయంలో రేపుతోంది ప్రేమకాసారం"
అంటూ మళ్ళీ తన కవితను పొడిగించాడు జగదీష్.
'వారెవ్వా! వన్స్ మోర్' అంటూ జగదీష్ భుజాలను తట్టాను మెచ్చుకోలుగా.
జగదీష్ ఆనందంగా చుట్టూ చూస్తూ తన కవిత్వానికి పదును పెడుతున్నాడు.
సగం దూరం వచ్చేసరికి రోడ్డు ప్రక్కన ఒక బిచ్చగాడు ఏసుక్రీస్తు బొమ్మను చాక్ పీసుతో చిత్రిస్తున్నాడు.
ఆ బొమ్మను అతను చిత్రించే తీరును చూస్తూ జగదీష్ నిలబడి పోయాడు. నేను ఆసక్తిగా ఆ బిచ్చగాన్ని గమనించాను.
క్రీస్తులా అతను బక్క చిక్కి ఉన్నాడు. ఆ బొమ్మ చూసిన జనాలు వేసే డబ్బులతో జీవనం సాగించే మనిషిలా కనిపిస్తున్నాడు.
అతనిలో ఉండే చిత్రకారున్ని ఎవరైనా తట్టి లేపితే అద్భుత చిత్రాలు వచ్చేవేమో! ఈ సమాజం ఇలాంటి వారికి చేయూత అది నివ్వదు కదా! "నేను డబ్బుబాగా సంపాదించాక ఇలాంటి వారిని తప్పకుండా చేరదీస్తాను" మనసులో ఆలోచనలు
నాలో ముసురుకుంటున్నాయి.
నా భావతరంగాలకు అంతరాయం కలిగిస్తూ జగదీష్ "ఈ కళాకారుడు మంచి చిత్రాన్ని గీస్తున్నాడు
జీవకళ ఎంత మాత్రం లేదు మిత్రమా!" అని అన్నాడు.
జగదీష్ మాట్లాడిన మాటలతో ఈ లోకంలోకి వచ్చాను.
"ఏమైంది? బాగా గీస్తున్నాడు కదా!" అన్నాను.
"క్రీస్తు బొమ్మ పూర్తిగా గీచినా అందులో ఎలాంటి జీవకళ లేదు"
“బిచ్చగాడు తన బతుకు తెరువు కోసం గీసే బొమ్మలో కళను కూడా చూస్తావా?"
"చూడాలి అది చూసే జనం ఎక్కువ డబ్బులు వేస్తారు"
ఇలా మాట్లాడుకుంటూ క్యాంటీన్ చేరాం.
రెండు టీలు కావాలని క్యాంటీన్ అబ్బాయితో చెప్పాం.
"అలాంటి కళాకారుల్ని ఆదరిస్తే బిచ్చగాళ్ళుగా ఎందుకు మారతారు? ప్రభుత్వం వీళ్ళను సరైన విధంగా ఆదరించాలి" అన్నాన్నేను. ఏదో చర్చ ప్రారంభించే వానిలాగా.
"ప్రభుత్వం ఎందుకు చేస్తుంది. మిత్రమా? ఎవడి బతుకు వాడిది. కళాకారునిలో ప్రతిభ వుంటే వాడే జనంలో రాణిస్తాడు. ప్రభుత్వంతో పనేముంది" అన్నాడు. జగదీష్.
ఇలాంటి చర్చలు సహజంగా నడుస్తూ ఉంటాయి మా ఇద్దరి మధ్య.
టీ త్రాగి డబ్బులు చెల్లించి క్యాంటీన్ బయటకు వచ్చాం.
అది రైల్వే స్టేషనుకు దగ్గర కావడం వల్ల ఆ రోజేదో ప్రభుత్వం పోటీ పరీక్ష నిర్వహిస్తున్నందువల్ల పదైదు నిమిషాల ముందు లేని రద్దీ ఇప్పుడు ఎక్కువగా ఉంది.
వాహనాలను దాటుకుంటూ మళ్ళీ వచ్చిన
దారినే వస్తున్నాం.ఖచ్చితంగా బొమ్మ గీచిన ప్రదేశం దగ్గర జనాలు గుమిగూడి చూస్తున్నారు. క్రీస్తు బొమ్మను చూడడానికి అందరూనిలుచున్నారని దగ్గరకు వెళ్లాం.
జగదీష్ బొమ్మను చూశాడు. 'అబ్బ ఇప్పుడు ఈ క్రీస్తు బొమ్మలో జీవకళ వచ్చింది. చూడు' అన్నాడు నాతో.
"నిజంగానే నా కళ్ళను నేను నమ్మలేక పోయాను, బొమ్మలో శిలువ వేసిన గుర్తుల దగ్గర రక్తం మరకలున్నాయి. శరీర మంతా గాయాలతో నిండిన మనిషిలాగా జీవకళ ఆ చిత్రంలో
వుట్టిపడుతోంది."
బొమ్మ గీచిన బిచ్చగాని వైపు చూశాను. అతను
విగతజీవుడై పక్కన పడివున్నాడు. ఏదో వాహనం బిచ్చగాన్ని గుద్ది పోయింది. రక్తం ఎంత చిమ్మిందో చూడండి" అంటూన్నా రెవరో..
"అయ్యో పాపం! అంటున్నారు" మరొకరు.
'బొమ్మ ఎంత బాగా గీశాడో" జగదీష్ లాగా చిత్రాన్ని కీర్తిస్తున్నారెవరో
'ఏది కళాత్మకత?" నా మదిలో అంతర్మధనం
ప్రారంభమైంది.
__ పిళ్లా కుమారస్వామి,9490122229
(సాహిత్య ప్రస్థానం ఫిబ్రవరి, 2017)
Comments
Post a Comment