మంచి పని చేసిన వాళ్ళను వచ్చే తరాలు గుర్తుంచుకుంటాయి.
Pc: freejournal.org
ఇంద్రద్యుమ్నుడు అనే రాజు తన రాజ్యంలో అనేక మంచి పనులు చేసి మరణించారు.
ఆయన తర్వాతి వంశస్థులు అనేక మంది రాజ్యాధికారంలోకి వచ్చారు. ఆయన తరువాత వెయ్యేళ్ళకు వచ్చిన ఒక మునిమనువడికి ఇంద్రద్యుమ్నుడనే పేరు పెట్టారు.ఇతను పెద్దయ్యాక తన పూర్వీకుడైన ఇంద్రద్యుమ్నుని గురించి తెలిసిన వారెవరైనా ఉన్నారా? అని కనుక్కోవాలన్న ఆసక్తి కలిగింది.
ఆయన మార్కెండేయముని దగ్గరకు వెళ్ళి “తమ వంశ పూర్వీకులు ఇంద్రద్యుమ్నుడనే రాజు గురించి మీకు తెలుసా?” అని అడిగాడు.
“ఆయన గురించి నాకంతగా తెలీదు. హిమాలయ శిఖరం మీద ఒక పులుగు పిట్ట ఉంది.అది నాకన్నా ముందునుంచి బతికి వుంది. దాన్ని అడిగి చూడు" అన్నాడు.
ఇప్పటి కాలం ఇంద్రద్యుమ్నుడు ఆ పిట్టలున్న చోటికి వెళ్లాడు. ఆ పిట్టను తన వంశ పూర్వీకు డైన ఇంద్రద్యుమ్నుని గురించి అడిగినాడు.
“నేనైతే ఆ పేరు వినలేదు. నాకన్నా ముందటి కొంగ ఒకటి వుంది. అది ఇంద్రద్యుమ్నం అనే చెరువులో ఉంటుంది. వెళ్ళి దాన్ని అడుగు. దానికి తెలిసి ఉండవచ్చు" అని చెప్పింది.
పిట్టను కూడా తనతో తీసుకుని కొంగదగ్గరకు వెళ్లాడు రాజు. "నేను కూడా ఎప్పుడూ వినలేదు. అయితే నాకన్నా ముందు తరం తాబేలు ఒకటి వుంది. అది వెయ్యేళ్లు జీవిస్తుంది.బహుశా ఆ తాబేలుకు తెలిసి వుంటుంది. పోదాం పదండి అందరం పోయి అడుగుదాం చెప్పింది కొంగ.
అందరూ కలిసి తాబేలు వద్దకు చేరుకున్నారు.
కొంగ తాబేలును పిలిచింది. “ఇదిగో తాబేలు మామా! నిన్ను ఏదో అడగడానికి మన వూరిరాజు వచ్చాడు. ఒకసారి బైటికి రా" అని పిలిచింది.
ముసలి తాబేలు మెల్ల మెల్లగా బయటకు వచ్చి తలెత్తి చూసింది. అది చాలా వృద్దురాలిగా వుంది.
ఇంద్రద్యుమ్నుడు తన్ను తాను పరిచయం చేసుకుని “నా పేరు గల మా పూర్వీకుడు ఒకరాజు
ఉన్నాడు ఆయన గురించి నీకు తెలుసా?" అని అడిగాడు.
తాబేలు కళ్ళు ఆనందంతో మెరిసినాయి. “ఇంద్రద్యుమ్నుని గురించి నేనెరుగనా? ఆయన
ఎంత గొప్ప మనిషనుకున్నారు! ఆయన దయామయుడు. ఆయనది ఎముక లేని చెయ్యి. ఆయన దానం అందుకొనని వారెవ్వరు? ఆయన ఎన్నో నిష్కలు(నాణెలు) దానంచేసే వాడు. చాలామంది బ్రాహ్మణులకు ఆవులు దానం చేసినాడు. ఆ ఆవుల దాహం తీర్చడానికి ఈ చెరువును తవ్వినారు. ఈ చెరువులో ఇప్పుడు ఎన్నో చేపలు, తాబేళ్ళు, మొసళ్ళు ఇలా రకరకాల ఇతర ప్రాణాలు జీవిస్తున్నాయి. ఇదంతా ఆ మహాను భావుడి చలువ వల్లనేగదా! అందువల్లనే గదా ఈ చెరువును ఇంద్రద్యుమ్న చెరువు అంటున్నారు” అంటూ ఎంతో ఆనందంతో ఆయన గురించి చెప్పింది.
“ఆయన లాగా నువు కూడా ప్రజలకు మేలుచేసే పనులు చేసి మంచి పేరు తెచ్చుకోనాయనా! ఎన్ని ఏండ్లయినా నిన్ను మరచిపోరు. మంచి చేసిన పాలకులను ప్రజలు మెచ్చుకుంటూనే ఉంటారు" అని చెప్పి అతన్ని దీవించి పంపింది.
(మహాభారత కథ)
___పిళ్లా కుమారస్వామి, 9490122229
Comments
Post a Comment