పికెటింగ్(కథ)
“అవతార్ కార్మికుల సంఘం వర్థిల్లాలి".
'అవతార్ కార్మికులను పనిలోకి తీసుకోవాలి'.
ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి'.
నినాదాలతో అనంతపురం టవర్‌క్లాక్ దద్దరిల్లుతోంది. దాదాపు వందమంది కార్మికులు
మానవాహారం ప్రదర్శిస్తున్నారు. అరగంటయ్యేసరికి వారికి మద్దతుగా వివిధ సంఘాలు, వాళ్ళ నాయకులు వచ్చి చేరినారు.
కార్మికుల ప్రదర్శన ప్రారంభమైంది. కలెక్టరు ఆఫీసు ముట్టడికి బయలుదేరినారు.
'కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి',
ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలు నశించాలి' ఇలాంటి నినాదాలజోరు పెరిగిపోతోంది.
సప్తగిరి సర్కిల్ లోకి వచ్చేసరికి కార్మికుల సంఖ్య పెరిగిపోతోంది. విలేకరులు, వివిధ ఛానల్స్ వారు ప్రదర్శనను వీడియో తీస్తున్నారు. కొంతమంది ఫోటోలు తీసుకుంటున్నారు.
ప్రదర్శన మెల్లగా కలెక్టరు ఆఫీసు చేరుకుంటోంది. జిల్లాలోని అన్ని ప్రాంతాల నుంచి అవతార్ కార్మికులకు మద్దతుగా లారీల్లో వచ్చి దిగుతున్నారు.
అనంతపురం కలెక్టరు ఆఫీసు గేట్లన్నీ మూసి ఉన్నాయి. పోలీసు ప్రహారా మొదలవుతోంది.
పోలీసుల జీపుల కుయ్ కుయ్ శబ్దం. అక్కడ రణధ్వనిని తలపిస్తోంది.
ఆరోజు సోమవారం. ప్రజాసమస్యల పరిష్కార దినం.
చాలామంది ప్రజలు వాళ్ళ సమస్యలను
విన్నవించుకోవడానికి కలెక్టరు ఆఫీసుకు తొమ్మిదింటి కే చేరుకుంటున్నారు.
ప్రదర్శనకు అగ్రభాగాన ప్రధాన కార్మిక సంఘాల నాయకులు రామ్మోహన్, ఓబులేసు మొదలైన వారంతా నడుస్తున్నారు. వారి ముఖాల్లో గంభీరత్వం వ్యక్తమవుతోంది. కలెక్టరేటు దగ్గరవుతున్న కొద్ది నినాదాల హెరు పెరిగిపోతోంది.
లేపాక్షిలో ఉండే అవతార్ ఫ్యాక్టరీ ఊరగాయలు తయారుచేస్తూ ఉంటుంది. గతపదేళ్ళనుంచి
పనిచేస్తున్న కార్మికులను సంఘం పెట్టుకున్నారన్న నెపంతో యాజమాన్యం ఉన్న పళంగా వారిని
తొలగించింది. బీహారు నుంచి కార్మికులను తెచ్చి పనులు చేయించుకుంటోంది. తమను పనుల్లోకి
తీసుకోవాలని కోరుతూ కలెక్టరుకు విన్నవించు కోవడానికి ఇప్పుడు అందరి మద్దతుతో వస్తున్నారు.
అక్కడేదో రణరంగం జరగబోతోందన్న సంకేతంగా పోలీసుల బలగాలు పెరిగిపోతున్నాయి.
పది పోలీసు వ్యాసులు వచ్చి ఆగాయి.
కార్మికులు కలెక్టరాఫీసులోకి పోకుండా ప్రధాన ద్వారాన్ని మూసేసినారు.
కలెక్టరాఫీసు ప్రధాన ద్వారం దగ్గర కార్మికనేతలు బైఠాయించారు. వారిచుట్టూ వలయంగా కార్మికులు కూర్చున్నారు. ప్రధాన కార్మిక సంఘాలను ఒకతాటిపైకి తీసుకురావడానికి కృషి చేసినరామ్మోహన్ లేచి నిలబడి ప్రసంగించడం మొదలు పెట్టాడు.
'కామ్రేడ్స్! అవతార్ కార్మికులు గత పదేళ్ళుగా అవతార్ కంపెనీలో పనిచేస్తున్నారు. ఈకంపెనీ
50కోట్లతో ప్రారంభమై అంచెలంచెలుగా ఎదిగి విదేశాలకు ఎగుమతి చేసే కంపెనీ స్థాయికి చేరింది.
ఈకంపెనీ టర్నోవర్ ఇప్పుడు 500కోట్లకు చేరుకుంది. ఈ కార్మికుల శ్రమ ఫలితంగానే ఇది సాధ్యమైంది. కంపెనీలో పనిచేసే కార్మికులు జీతాలు పెంచమని అడగలేదు. కేవలం సంఘం పెట్టుకున్నారు. సంఘం పెట్టుకోవడం నేరమా! సంఘం పెట్టుకున్నారని 200మంది కార్మికులను ఉన్నపళంగా తొలగించారు. ఈ కార్మికులు ఫ్యాక్టరీ ఏర్పడకముందు వ్యవసాయ కూలీలుగా ఉండేవారు. ఇప్పుడు ఈ ఫ్యాక్టరీ కోసం తమశ్రమను ధారపోస్తున్నారు. వీరందరిని తీసేసి బీహార్, రాజస్థాన్ నుంచి కార్మికులను తెచ్చుకుని ఫ్యాక్టరీని నడిపిస్తున్నారు. ఇదేం న్యాయమని అడిగితే సమాధానం లేదు. యం.ఎల్.ఏ, లేబర్ అధికారులు యజమానితో కుమ్మక్కయ్యారు. యజమాని విసిరేసిన డబ్బులకు లొంగిపోయి కార్మికుల పొట్టలు గొడుతున్నారు. ఈ సమస్యను ప్రభుత్వమే పరిష్కరించాలి. కార్మికుల సంక్షేమం కోసం ఏమేమో చేస్తున్నామని చెపుతున్న ఈ ప్రభుత్వం కరువు బారిన పడిన ఈజిల్లాలో కార్మికుల బాధలు వినిపించడం లేదా? అని నేను అడుగు తున్నాను" అంటూ ఉపన్యసించాడు.
మరో కార్మిక నాయకుడు లేచి 'జిల్లాలో కరువు పరిస్థితులు నెలకొని ఉన్నా, ధరలు పెరిగిపోతున్నా యజమానులు కార్మికుల పోట్టలు గొడుతున్నా పాలకులు నిమ్మకు నీరెత్తనట్లున్నారన్నారు. అనేక కంపెనీలకు శంకుస్థాపనలు చేస్తున్నారు.కానీ ఒక్కటి కూడా ప్రారంభం కాలేదు. వ్యవసాయానికి హంద్రీనీవా ద్వారా సాగునీరు ఇస్తామన్నారు దానిని ఇంకాపూర్తి చేయలేదు".
ఇలా ఎన్నో సమస్యలను కార్మికుల ముందు చెపుతూ కార్మికులకు న్యాయం చేయాలన్నాడు" ఇలా ఒక్కో నేత మాట్లాడుతూ ఉన్నాడు. గంటగడిచేసరికి కార్మికుల్లో ఆవేశం పెరిగిపోతోంది.
'కలెక్టరురావాలి, కలెక్టరురావాలి' అంటూ నినాదాలు ఇచ్చారెవరో,
డి.ఎస్.పి మైకులో అనౌన్స్మెంట్ ఇచ్చాడు. “ఇక్కడున్న కార్మికులంతా గేటు దగ్గరనుంచి
దూరంగా వెళ్ళిపోవాలి. లీడర్లు మాత్రం కలెక్టరుకు వినతి పత్రం ఇవ్వండి. పదినిమిషాల్లో ఈస్థలాన్ని ఖాళీ చేయాలి. లేకపోతే అరెస్టులు, లాఠీచార్జీలు తప్పవు. ఇది ఎస్. పి. గారి ఆదేశం".
అనౌన్స్మెంట్ వినగానే కార్మికులు బిగ్గరగా నినాదాలు ఇవ్వటం మొదలు పెట్టారు.
“పోలీసుల జులుం నశించాలి. కార్మికులను పనిలోకి తీసుకోవాలి. కలెక్టరు రావాలి, కలెక్టరు ప్రకటించాలి. మేం లేవం మేం లేవం"
నినాదాలు మిన్నంటాయి.
పోలీసులు తమ లాఠీలకు పనిచెప్పడం మొదలు పెట్టారు. విపరీతంగా కార్మికులను కాళ్ళపైన, చేతుల పైన, వీవుల పైన కొట్టడం ప్రారంభించారు.
ఆ దెబ్బలను తట్టుకోలేక కార్మికులు చెల్లాచెదరవుతున్నారు. అయినా చాలామంది కార్మికులు కదలడంలేదు. బలంగా లాగేస్తున్నారు.
పోలీసులతో కార్మికుల పెనుగులాట మొదలైంది. అక్కడి దృశ్యం బీభత్సంగా ఉంది. విలేకర్లు
ఫోటోలు తీస్తున్నారు. ఛానల్స్ లైవ్ లో చూపిస్తున్నారు.
కార్మిక సంఘాల నాయకుడు రామ్మోహన్, అవతార్ సంఘం నాయకుడు ఓబులేసు చుట్టూ కార్మికులంతా వలయంగా ఏర్పడి దెబ్బలు తగలకుండా చూస్తున్నారు. వాళ్లలో రామాంజినమ్మ, కమలమ్మలు కూడా ఉన్నారు.
చాలామంది కార్మికనేతలను చరచరా లాక్కుపోయి వ్యానుల్లో కుక్కుతున్నారు. చివరగా రామ్మోహనను, ఓబులేసును లాక్కుని వెళ్ళేందుకు దృఢంగా బలంగా తర్ఫీదు పొందిన పోలీసులు రంగంలోకి దిగినారు. లాఠీలతో కార్మికులను చితకబాదినారు. ఒక వలయం చెదిరిపోయింది. రెండో వలయంలో రామాంజినమ్మ, కమలమ్మ మొదలైన మహిళలు ఉన్నారు. వాళ్ళను మహిళా పోలీసులు బలవంతంగా లాగుతున్నారు. ఇంతలో రామ్మోహన్, ఓబులేసులపై లాఠీలు నృత్యం చేసినాయి. రామ్మోహన్ కు తగలకుండా కమలమ్మ లాఠీలకు చేయి అడ్డం పెట్టింది. ఆమె చిటికెనవేలు విరిగిపోయింది. ఓబులేసు వీపుబద్దలై చొక్కా చినిగిపోయింది. వీపంతా ఎరగ్రా కమిలిపోయింది. అన్నీ కముకు దెబ్బలు. లాఠీలు అదోరకం ప్లాస్టిక్ కర్రలు. వాటిలో కొడితే అవి విరగవు. దెబ్బతిన్నవాడి కండరాలు కమిలిపోతాయి. నెలరోజులయినా నొప్పి తగ్గదు. ఇదంతా జరిగేలోపల మరికొంతమంది మహిళా పోలీసులు వచ్చి మహిళలందర్ని పక్కకు లాగేసినారు.
పోలీసులు నలుగురు కలిసి రామ్మోహనను గట్టిగా పట్టుకున్నారు. చేతులను జబ్బల దగ్గర
బలంగా పట్టుకొని ఎవరికీ కనిపించకుండా నొక్కుతున్నారు. విపరీతమైన బాధతో
విలవిలలాడుతున్నాడు. ఇద్దరు పోలీసులు పట్టుకున్నారు. కాలి మడమ దగ్గర ఎవరికీ అర్థం కాని రీతిలో వడతిప్పినారు. ఆ గుంపులో తోపులాటలో ఏం జరుగుతోందో ఎవరికీ అర్థం కాదు.
రామ్మోహనను బలవంతంగా ఆనలుగురు పోలీసులు లాక్కుపోయి పోలీసు జీపులోకి తోసేసినారు.
పోలీసులు ఆకార్మికులను మనుషులుగా చూడటం లేదు. పదైదు నిమిషాల్లో కార్మికులను చెదరగొట్టారు,
వినతిపత్రాలు చెల్లాచెదరుగా పడిపోయాయి. కలెక్టరాఫీసు గేట్లు తెరిచారు. జీపుల్లో , వ్యానుల్లోకి
ఎక్కించిన కార్మికులను పోలీస్ స్టేషనుకు తీసుకెళ్ళిపోయినారు. స్వంత పూచీకత్తు మీద సాయంత్రం వదలుతామని అంతవరకు ఇక్కడే ఉండాలని చెప్పినారు పోలీసులు.
కార్మికనేతలంతా ఒక బెంచి పై కూర్చున్నారు. గాయాలైన ఓబులేసును, వేలువిరిగిన
కమలమ్మను, కముకు దెబ్బలు తిన్న రామ్మోహనను ఆసుపత్రిలో చేర్పించారు తక్కిన కార్మికులు. పోలీసులు అభ్యంతరం చెప్పలేదు.
నొప్పి తగ్గేందుకు, సెప్టిక్ కాకుండా టి.టి. ఇంజెక్షన్ ఇచ్చాడు డాక్టరు ఇద్దరికి. కమలమ్మ
వేలుకు కట్టుకట్టారు. మగతగా ఒత్తిగిలి పడుకున్నాడు ఓబులేసు. ఒక్కసారిగా గతం సినిమారీలులా కదిలింది మదిలో.
'గేటు తెరవండి! గేటు తెరవండి' అంటూ అవతార్ ఫ్యాక్టరీ బయట అరుస్తున్నారు కార్మికులు.
వాచ్ మెన్ 'లేదు, మిమ్మల్ని ఈ రోజు నుంచి రావద్దన్నారు సారు' అని చెపుతున్నాడు.
“ఏం, ఎందుకు వద్దన్నారు?" అడిగింది రామాంజినమ్మ
'నాకు తెలీదుపోమ్మా!' కసురుకుంటున్నాడు వాచ్ మేన్.
ఇంతలో ఓబులేసు వచ్చాడు.
'గేటు తెరవయ్యా! సార్ తో మాట్లాడి వస్తాను' అనడిగాడు.
'సరే! నువ్వుక్కడివే పో! అడిగిరాపో' గేటు తెరిచాడు వాచ్ మెన్.
ఓబులేసు ఫ్యాక్టరీ లోపలికి వెళ్లాడు.
మేనేజరు దగ్గరకు వెళ్ళి "సార్! వర్కర్స్ అందరూ వచ్చినాము. గేట్లుమూసినారు. ఇదేందిసార్!
ఎక్కడాలేంది!' అడిగాడు ఓబులేసు.
“ఓబులేసూ! ఏంతెలీనట్లు మాట్లాడకు. నువ్వు యూనియన్ ఏర్పాటుచేసినావు. అందరినీ
రెచ్చగొడుతున్నావని మాకు రిపోర్టు వచ్చింది! అందుకే ఎవరినీ రావద్దని చెప్పాము. మీకు యూనియన్ కావాలా? ఫ్యాక్టరీలో పనికావాలా? తేల్చుకొనిరండి! ఓనరు ఇదే చెప్పమన్నాడు” అన్నాడు మేనేజరు శివరామ్.
మేం యూనియన్ పెట్టింది ప్రభుత్వం నుంచి వచ్చే రాయితీల కోసం సార్. ఫ్యాక్టరీలో లాభాలు అడగడానికి కాదు సార్! అయినా మేం యూనియన్ పెట్టుకుంటే మీకేం నష్టం సార్".
'అవన్నీ నాకు తెలీదు, బాస్ ఆర్డర్ అంతే! బీహార్, రాజస్థాన్ నుంచి కొత్త వర్కర్లు రేపు వస్తున్నారు. మీరు ఇకనుంచి రానక్కర్లేదు'.
"ఇక్కడి వాళ్ళను కాదని ఎక్కడ్నించో తీసుకువస్తారా! ఇది అన్యాయం. మీ ఫ్యాక్టరీని నమ్ముకుని ఇన్నేళ్ళ నుంచి పనిచేస్తున్నాం. మా పొట్టల్ని కొడతారా? మేం ఒప్పకోం!'
“నువ్వేంది ఒప్పుకునేది. మా ఫ్యాక్టరీ మాయిష్టం, ఇక్కడ్నించి వెళ్ళవయ్యా".
చేసేదేమీ లేక వెనక్కు వచ్చాడు.గంభీరంగా కార్మికులతో చెపుతున్నాడు. అప్పుడే ఎవరోవచ్చి 'ఇక్కడ ఓబులేసు ఎవరూ' అనిఅడిగాడు.
'నేనే' అన్నాడు ఓబులేసు.
“నా పేరు రామ్మోహన్, నేను కార్మికుల సంఘాల జిల్లా నాయకున్ని. పేపర్లో మీ ఫ్యాక్టరీలో
మిమ్మల్ని తొలగించారని తెలిసి వచ్చాను". అన్నాడు తనను పరిచయంచేసుకుంటూ వచ్చిన వ్యక్తి.
ఆశ్చర్యంగా చూశాడు ఓబులేసు.
తమకోసం ఒక వ్యక్తి రావడం ఎంతో విస్మయపరిచింది ఓబులేసుకు. ఫ్యాక్టరీలో పనిచేస్తున్న కార్మికుల్ని ఎలా తొలగించింది, ఎందుకు తొలగించింది అంతా
వివరంగా చెప్పినాడు ఓబులేసు.
ఓపిగ్గా విన్నాడు రామ్మోహన్.
తనకేం సబంధం లేని ఒక కార్మిక నాయకుడు వచ్చి తమ సమస్యలు వింటుంటే వారందరికీ ఆశ్చర్యంగా ఉంది.
'సరే! ఏం చేద్దామనుకుంటున్నారూ' అడిగాడు రామ్మోహన్.
'ఏంచేయాలో మాకర్థం కాలే సారూ' అన్నాడు ఓబులేసు
“అందర్ని ఒకచోట కూర్చోబెట్టి మాట్లాడుదాం! వాళ్ళేమి చెపితే అది చేద్దాం' అన్నాడురామ్మోహన్.
'సరే' అన్నాడు ఓబులేసు.
సాయంకాలానికి అందరూ వచ్చారు. అందులో ఈశ్వరయ్య చురుకైనవాడు. “ఒకసారి మన ఎం.ఎల్.ఏ నరేంద్రన్నకు చెప్పి చూద్దాం. ఆయన చెప్తే వాళ్ళు వింటారు" అన్నాడు. అక్కడ కూర్చుని వింటున్న కమలమ్మ, రామాంజినమ్మ , ఈశ్వరయ్య చెప్పింది సరైనదన్నారు.
మిగతా వాళ్ళంతా “దేవునికైనా దెబ్బేగురువు ఆయన చెప్తే పనైపోతుంది” అన్నారు.
“ఎప్పుడుపోదాం" అడిగాడు రామ్మోహన్,
"రేపే” అన్నాడు ఈశ్వరయ్య.
ఒక వినతి పత్రం తయారుచేశాడు రామ్మోహన్. మరుసటిరోజు అందరూ హిందూపురం బయలు దేరారు. ఎం.ఎల్.ఏ నరేంద్ర ఇంటి దగ్గరకు అంతా చేరుకున్నారు.
ఉదయమే కాబట్టి అప్పుడప్పుడే ఆయన్ను కలిసేందుకు జనాలు వస్తున్నారు. గుంపు గావచ్చిన
వాళ్ళలో ఈశ్వరయ్యను చూస్తూనే ఎం.ఎల్.ఏ. పి.ఎ. ప్రతాప్ 'ఏం ఈశ్వరయ్యా! అందరూ కట్టకట్టుకొని
వచ్చినారు?' అడిగాడు. ఈశ్వరయ్యకు ప్రతాప్ దగ్గర బంధువు.
'ప్రతాప్! ఎం.ఎల్.ఏను మేము కలవాల. మా ఫ్యాక్టరీ వర్కర్లంతా వచ్చినారు".
“అందరూ కాకుండా నలుగురు లోపలికి రండి. మాట్లాడిస్తా".
ఎవరెవురూ పోవాలా అని తటాపటాయిస్తున్నాడు ఓబులేసు. రామ్మోహన్ 'ఓబులేసూ,నువ్వు, ఈశ్వరయ్య ఇంకా ఇద్దరు మహిళా కార్మికులు లోపలికి పోయి మాట్లాడండి' అన్నాడు.
'అదేంటి సార్! నువుకూడా రావాల' ఈశ్వరయ్య గట్టిగా అన్నాడు. సరేపద!" అంటూ లోపలికి
అడుగుపెట్టారు ఐదుమంది.
రామ్మోహన్ తోపాటు కమలమ్మ,రామాంజినమ్మ కూడా లోపలికి పోయినారు.
అప్పటికే ఫ్యాక్టరీ యజమాని నరేంద్రన్నతో కలిసి మాట్లాడినాడు. “సార్! మాఫ్యాక్టరీలో
మన వూరి వాళ్ళేగదాని పనిలో పెట్టుకున్నా. ఇన్నేండ్లు బాగానే వున్నారు. ఈ మధ్యలో ఒకడు
యూనియన్ పెట్టండాడని తెలిసింది. యూనియన్ పెట్టి వూరకనే ఉండరు. సమ్మెలంటారు.
జీతాలు పెంచాలంటారు. యూనియన్ పేరు చెప్పి నాయకులు పనిచేయరు. లేనిపోని రగడలు.
అందుకే అందరినీ తీసేసి బీహారు నుంచి వచ్చిన వాళ్ళను పెట్టుకున్నాం. వాళ్ళైతే బుద్దిగా
పనిచేస్తావుంటారు. జీతాలు పెంచాలని డిమాండ్లు ఏమీ ఉండవు. మీరు మాకు కొంచెం సాయం
చేయాలి. మీరడిగిన పార్టీఫండు రెండు కోట్లు ఈరోజే పంపిస్తా." చెప్పినాడు. వీళ్ళను చూడగానే
ఆయన 'వీళ్ళేసార్' అని మెల్లగా చెపుతున్నాడు.
అక్కడి దృశ్యాన్ని చూడగానే వాళ్ళకు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు.
'సరే మీరు వెళ్ళండి. నేను మాట్లాడుతాను' అని చెప్తూ వీళ్ళవైపు తిరిగి రండి, కూర్చోండి!
ఏం పని మీద వచ్చారు?' అడిగాడు ఎం.ఎల్.ఏ సాదరంగా.
“మేము అవతార్ ఫ్యాక్టరీలో కార్మికులం సార్! మీకు మాసమస్యలు చెప్పుకొనడానికి వచ్చినాం
సార్" అన్నాడు ఓబులేసు వినయంగా,
“మీరా! రోజూ పేపర్లో చూస్తున్నా! పనిచేసుకోకుండా ఏందయ్యా సమ్మెలు, ధర్నాలు. ఇంకేం పనిలేదా? వాళ్ళు కోట్లు పెట్టి ఫ్యాక్టరీలు పెట్టేది ఇందుకా? మీరు పనిచేయకుండా ఇట్లా రోజూ
ధర్నాలు సమ్మెలు చేస్తే ఫ్యాక్టరీలు ఎలానడుస్తాయి? సంఘాలంటా, ఆకోర్కెలంటా, ఈ కోర్కెలంటా
మిమ్మల్ని ఆ ఎర్రజెండా వాళ్ళు రెచ్చగొట్టింటారు. మీరు అమాయకంగా వాళ్ళవలలో పడిపోవద్దు"
అన్నాడు ఎం.ఎల్.ఏ నరేంద్ర,
“అదికాదు సార్! మమ్మల్ని పనిలోంచి తీసేసినారు సార్!" అన్నాడు ఓబులేసు.
“తీసేయక మీలాంటి వాళ్ళను పనిలో పెట్టుకుంటారా వాళ్ళు! మీకేం పెళ్లాంబిడ్డలు లేరా? బుద్ధిగా పనిచేసుకోపోండి"
“అదేసార్! మేం అడుగుతాండేది మమ్మల్ని పనిలోకి తీసుకొమ్మని మీరు చెపుతారని వచ్చాం
“ఇప్పుడు బీహారోళ్ళను పనిలోకి పెట్టుకున్నారట. మీరు చేసే అరాచకాలను చెప్పిపోయినారు.
మీరు ధర్నాలు మానేయండి. నేను చెపుతాలే, మీరు పోండి" అంటూ లోపలికి వెళ్ళిపోయాడు ఎం.ఎల్.ఏ.
నిరాశతో వెనుదిరిగినారు కార్మిక నాయకులు. “ఏం.ఎల్.ఏ ఓనరు మాయమాటలు
నమ్మినట్లుండాడురా” అన్నాడు ఈశ్వరయ్య, 'ఏమో! ఓనరు ఎంత ముట్టచెప్పినాడో', అన్నాడు మరో
కార్మికుడు. అందరు మౌనంగా ఉండిపోయినారు.
మళ్ళీ సమావేశమయినారు సాయంత్రం. ఏం చేద్దామన్నాడు రామ్మోహన్.
“లేబర్ ఆఫీసరుకు మనడిమాండ్లు చెపుదాం. వినకుంటే ధర్నాకు కూర్చుందాం" అన్నాడు
ఈశ్వరయ్య
“సరే ఇదీ చూద్దాం" అన్నాడు రామ్మోహన్.
ధర్నా జిల్లా లేబరు ఆఫీసరు కార్యాయలంకు మారింది.
యాభై మంది కార్మికులు లేపాక్షి నుంచి వచ్చినారు. మిగతా సంఘాలు వచ్చి సంఘీభావంతెలిపాయి.
ఒకనెల గడిచింది. ఇరవైమంది మాత్రమే మిగిలారు. జరుగుబాటు లేని కార్మికులు వేరేపనుల్లోకి
వెళ్ళిపోయినారు. కొత్త ఆఫీసరు వచ్చినాడు. చాలా స్ట్రిక్టంట. ఆయన ఫ్యాక్టరీ రికార్డులు తనిఖీ
చేస్తాడంట. ఆఫీసు క్లర్కు వచ్చి చెప్పిన సమాచారమది.
సాయంత్రానికల్లా తెలిసిందేమంటే ఆయన తనిఖీ చేస్తే అందులో కార్మికులే లేరంట. ఫ్యాక్టరీ రిజిష్టరులో పదిమంది కార్మికులే ఉన్నారంట. వాళ్ళు ఇప్పుడు అక్కడ పని చేస్తున్నారంట. రికార్డులన్ని కరెక్టుగా ఉన్నాయంట.
ఊరగాయలు బయట ఎక్కడో ఏజెన్సీల ద్వారా చేయిస్తున్నాడంట. ఆ యజమానిని ఏమి చేయలేరంటా.
ఇదీ వార్త.
పూర్తిగా నిరాశా, నిస్పృహలు అలుముకున్నాయి కార్మికుల్లో, రెండొందలమంది కార్మికుల్లో చాలా మంది అప్పుడే వేరే పనుల్లోకి చేరిపోయారు. కొంతమంది బెంగళూరుకు వలసవెళ్ళిపోయారు. యాభైమంది మాత్రమే మిగిలిపోయారు. ఆ యాభైమంది మమ్మల్ని మళ్ళీ తీసుకోకపోతారా అన్న మొండి ధైర్యంతో అప్పులుచేసి ధర్నాలలో పాల్గొంటున్నారు.
ఓబులేసు పట్టుదలగా ఉన్నాడు, ఎలాగైనా ఫ్యాక్టరీలోకి అందరినీ తీసుకునేటట్లు చేయాలని.
“కాదు ఓబులేసు, కందకు లేని దురద కత్తి పీటకెందుకు చెప్పు. మనవాళ్ళు ఐక్యంగా లేరు. ఇప్పటికే అందరూ జారుకుంటున్నారు. నువ్వేమో పోరాడదామంటున్నావ్. మనం కూడా వేరో ఏదో
ఒకపని చేసుకుంటే పోలా" అన్నాడు ఈశ్వరయ్య.
“మనం హక్కుల కోసం పోరాడతాండం, సంఘం పెట్టుకునే హక్కుకోసమే కదా! జీతాలు పెంచ మన్నామా? ఉన్నవాళ్ళనైనా పనిలోకి తీసుకోవాల గదా, మనమేం అడుగుతాండాం?" అన్నాడు
ఓబులేసు.
“సరే అట్లయితే రామ్మోహన్ సార్ ను అడిగిచూడు. ఏమి చేద్దామంటాడో".
రామ్మోహన్ సలహామేరకు కలెక్టరు ఆఫీసు దగ్గర ధర్నాకు పిలుపునిచ్చినారు.
*** ****
మగత నుంచి మేల్కొన్నాడు ఓబులేసు. అప్పటికి సాయంత్రం నాలుగైయింది. అందరినీ
విడిచిపెట్టారు. ఓబులేసును రామ్మోహన్ ను ఎస్.పి. పిలుస్తున్నాడని పోలీసులు చెప్పిపోయినారు.
ఓబులేసు, రామ్మోహన్ ఎస్.పి. ఆఫీసుకు పోయినారు.
ఎస్.పి. గదికి కాపలా వున్న అటెండరు వచ్చిన వాళ్ళెవరో తెలుసుకున్నాడు. 'మీలో ఓబులేసు
ఎవరు?' అనడిగాడు.
ఓబులేసును లోపలికి పోమ్మన్నాడు.
ఓబులేసు,రామ్మోహన్ వైపు తిరిగి “అదేందిసారు, నేనొక్కన్నే పోయి ఏంచేయాలసార్ మీరు
కూడా రండి”. బలవంతం చేసినాడు.
“ఓబులేసు ఒక్కడే పోవాల. సారు అదే చెప్పినాడు" అన్నాడు అటెండరు.
సరేలే! లోపలికి పోయిరా, నేను తక్కిన నాయకులతో మాట్లాడతావుంటా' అన్నాడు రామ్మోహన్,
భయం భయంగా లోపలికి పోయినాడు ఓబులేసు,
“మీరేనా అవతార్ కార్మిక నాయకులు? మీ సమస్యను సాల్వ్ చేయమని కలెక్టరు నాకు
చెప్పినాడు. నేను ఫ్యాక్టరీ ఓనర్ తో మాట్లాడినా, మిమ్మల్ని పనిలోకి తీసుకుంటారంట. అయితే
అందరినీ తీసుకోడు. మీలో చాలామంది పని దొంగలున్నారంట. ఫ్యాక్టరీ నష్టాల్లోకి పోతాందట
మీవల్ల, ఫ్యాక్టరీ యజమాని వేరేగదిలో కూర్చుని ఎస్.పి. మాటలు వింటున్నాడు.
ఎస్.పి, అలా కరుకుగా ముక్తసరిగా చెప్పేసరికి ఏమీ చెప్పాలో పాలుపోలేదు ఓబులేసుకు.
"సార్! మా లీడరు రామ్మోహన్ ను కూడా పిలవండి సార్! "ప్రాధేయపూర్వకంగా అడిగాడు
ఓబులేసు.
ఒక్క క్షణం ఆలోచించి రామ్మోహనను పిలిపించాడు.
వస్తూనే రామ్మోహన్ కలుగ జేసుకున్నాడు. “50కోట్లతో ప్రారంభమైన ఫ్యాక్టరీ ఈరోజు
500కోట్ల టర్నోవర్ చేస్తోందంటే కార్మికులు పనిచేయకపోతే ఎట్లా అవుతుంది సార్" అడిగాడు.
ఎస్.పి. సూటిగా రామ్మోహన్ కళ్ళలోకి చూశాడు. “అదంతా నాకు తెలీదు. సమస్యను
సాల్వ్ చేసుకుంటానంటే మాట్లాడూ. లేదూ అంటే నేనేం చేయలేను. నేను మీ బాగోగులు కోరి
ఇలా సెటిల్ చేయాలనుకున్నా" అన్నాడు ఎస్.పి.
“అందరినీ పనిలోకి తీసుకోవాలసార్" అన్నాడు రామ్మోహన్ దృఢంగా,
“సరే! ఇరవైమందిని తీసుకునేటట్లు ఏర్పాట్లు చేస్తాను. అదీ నా పలుకుబడితో, అలాకాదంటే
నేనేమి చేయలేను. మీరు వెళ్ళవచ్చు".
ఒక్క నిమిషం ఆలోచించాడు ఓబులేసు. "ఇంతమంది కార్మికుల పొట్టగొట్టడం అన్యాయం
సార్. మేమేదో కూలినాలో చేసుకునే వాళ్ళం. ఏదో ఫ్యాక్టరీ వచ్చిందికదా మాకు రోజూ
పనిదొరుకుతుంది కదా అనుకున్నాం. పదేళ్ళ పనిచేయించుకుని ఇట్లా మమ్మల్ని రోడ్లపాలుచేస్తే,
న్యాయమా సార్" దీనంగా అడిగాడు.
“సరే! రేపు లేబరు ఆఫీసరు, మీయజమాని, నేను, మీరు అందరం కూర్చుని మాట్లాడదాం.
మీరెంతమంది వర్క్ చేస్తారో లిస్టురాసుకొని రాండి. రేపు 10గం||లకు రండి" అన్నాడు ఎస్.పి.
బయట కార్మికులు వీళ్ళకోసం ఎదురుచూస్తూ ఉన్నారు. రాగానే ఓబులేసు ఎస్. పి చెప్పిన
విషయం అంతా చెప్పినాడు.
“ఇరవై మందికేనా?" అన్నారు కార్మికులు ఒక్కసారిగా.
అప్పుడు రామ్మోహన్ కలుగజేసుకొన్నాడు.
“కామ్రేడ్స్! మనం మొదట ఎం.ఎల్.ఏను కలిసినాం.
ఎం.ఎల్.ఏ ఏమన్నాడో మీకు తెలుసు. ఆయనకు మీఓట్లు మాత్రం కావాల. మీసమస్యలు
అవసరం లేదు. ఆయన యజమానిచ్చే డబ్బులకు దాసుడు. మీఓట్లకు కాదు. లేబర్ ఆఫీసరును
కలిసినాం. లేబర్ ఆఫీసరు స్ట్రిక్టు అన్నారు. ఏంచేసినాడు. మేలు చేసినాడా? అదే మనం
కలెక్టరాఫీసు దగ్గర పికెటింగ్ కు దిగితే చర్చలకు పిలిచినారు. అయితే మీలో ఎంతమంది పని
కావాలని నిలబడినారు? రెండొందలమందిలో యాభై మంది మాత్రమే. తక్కిన వాళ్ళలో బతకటం
కష్టమై వలసవెళ్ళిపోతే కొంతమంది వేరే పనుల్లోకి వెళ్ళిపోయారు. మన బలహీనతలు ఓనరుకు
బాగా తెలుసు. అంతేకాదు, కేంద్రప్రభుత్వం కార్మిక చట్టాలు మార్చింది. యజమానులకుఅనుకూలమే గాని మనకు కాదు. రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే లైను లో ఉంది. అందుకే ఒక్క మంత్రి
కూడా స్పందించలేదు. మనవైపు న్యాయం ఉంది కాబట్టే అన్ని సంఘాలు మనకు మద్దతిచ్చాయి.
ఇలాగే కొనసాగుతుందని చెప్పలేం. అందుకే మీరు ఎంతమంది పనుల్లోకి రావాలనుకున్నారో
ఒకలిస్టు తయారుచేయండి. వారందరికి పని ఇవ్వమని 'డిమాండ్ చేద్దాం' అంటూ వాళ్ళవైపు
చూసినాడు.
అందరూ సమ్మతిగానే తలలూపినారు.
మరుసటి రోజు ఎస్.పి చెప్పినట్లే లేబరు ఆఫీసరు, యజమాని వచ్చినారు. ఓబులేసు,
రామ్మోహన్, ఈశ్వరయ్య, కమలమ్మ, రామాంజినమ్మ లిస్టును వాళ్ళ ముందుంచారు. లిస్టులో డెబ్బై మంది పేర్లున్నాయి.
యజమాని మొదట పదిమందికి కూడా ఒప్పుకోలేదు.
ఎస్.పి. అన్నాడు. “సార్! పట్టువిడుపులుండాలి దేనికైనా! వాళ్ళు మిమ్మల్ని నమ్ముకొని పని చేస్తున్నారు. మీ కంపేనీ లాభాల్లో నడుస్తోంది. నేను మాటిచ్చాను. వాళ్ళ లిస్టును ఆమోదించండి." లేబరు ఆఫీసరు అన్నాడు "సార్! మీరు బీహార్ వాళ్ళను తెచ్చి పెట్టుకోవచ్చు. కాని స్థానికులకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఇది మన స్టేట్ గవర్న మెంటు చెపుతున్న ఆదేశం. లేకుంటే నేనే ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది."
యజమాని సరే నన్నాడు. ఆఖరుకు యాభైమందికి ఆమోదించాడు.
ఓబులేసు, రామ్మోహన్ దీర్ఘశ్వాస విడుస్తూ 'థ్యాంకూసార్!' అంటూ సీట్లోంచి పైకి లేచినారు.
(ప్రజా సాహితి 12/2018)
__ పిళ్లా విజయ్,959012229
Comments
Post a Comment