మొగుడు మధ్యలో వస్తే...






      చంద్రావతి నగరాన్ని పాలించే రత్నాకరుని రాజాస్థానంలో కళావంతుడనే పండితుండే వాడు. వసుమంతుడనే పెద్ద వర్తకుడు, అపరకుబేరుడు కూడా ఉండేవాడు ఆ నగరంలోనే. కళావంతుడు వసుమంతునికి మంచి మిత్రునిలాగా సలహాదారునిగా కూడా ఉండేవాడు.
        ఒక రోజు రత్నాకరరాజు వసుమంతున్ని పిలిచి గొప్పగా సన్మానం చేసినాడు. ఆ సభలో అతనితో 'వసుమంతుగారూ ! మీరు సముద్రానికవతల ఉన్న ఫ్రెంచి(ఫ్రాన్స్) దేశం నుండి కొన్ని వస్తువుల్ని మన కోశాగారానికి మీ ఓడలో తీసుకురావాలి' అని కోరాడు.
        వసుమంతుడు రాజుగారి సన్మానానికి ఉబ్బితబ్బిబ్బై ముందు వెనుక ఆలోచించ కుండా, 'తప్పకుండా మీ ఆజ్ఞ రాజా' అని అన్నాడు.
        ఫ్రెంచ్ దేశానికి సముద్ర మార్గం లో
పోయిరావాలంటే కనీసం కొన్ని సంవత్సరాలు పడుతుంది. ఒక్కపూటైనా తన భార్యను వదిలి ఉంటే బాధగా ఉంటుంది. పైగా ఆమె గర్భవతి, రాజుగారి విన్నపం. ఎరక్కపోయి ఇరక్క పోయానే' మనసులో అనుకుంటూ కళావంతుని సలహా అడిగినాడు.
     'రాజుల్ మత్తుల్ వారి సేవలు నరకప్రాయం' అని పెద్దలు అన్నారు.రాజుల దగ్గర పనిచేయడం కత్తిమీద సాములాంటిది. వారు ఆగ్రహించనూవచ్చు,అనుగ్రహించనూవచ్చు. వాళ్లతో వైరం పనికిరాదు. తొందరపాటుతో మీరు అందరి ముందర మాట చెప్పినారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలే గాని తప్పరాదు.అందరికి మేలు కలిగించేది, రాజుకు, దేశానికి కీర్తినిచ్చే దానిని ఎంతటి
త్యాగానికైనా వెరవకుండా చేయాల్సిందే' అన్నాడు కళావంతుడు.

     వసుమంతుడు తన భార్యకు విషయాన్ని చెప్పినాడు. చేసేదేమీ లేక ఆమె కూడా 
ఒప్పుకొంది. వైద్యులను పిలిచి తన భార్యకు వైద్యం చేస్తూ, ప్రసవం అయ్యే వరకు చూడమని చెప్పినాడు. బంధువులనందరిని పిలిచి విందును ఏర్పాటు చేసినాడు.  సముద్రయానం అంటే చాలా కష్టతరమైనది. తిరిగి వస్తాడో రాడో అనే అనుకుంటూ బంధువులు వెళ్లి పోయారు.
            చివరగా బయలుదేరేటప్పుడు కళావంతుని సలహా తీసుకునేందుకు 
కళావంతుని పిలిపించాడు. కళావంతుడు వచ్చి “ వసుమంతుగారూ, ఎవ్వరైనా
ఏదైనా చెప్పినా వింటూనే తొందరగా చేయాలన్న ఆత్రం ఉండరాదు. అలా
చేస్తే ఒక్కోసారి ఆపదలు వస్తాయి. కాబట్టి ఓపిక పట్టి నిలకడగా ఆలోచించి
ఆపనిని చేస్తే సంపదలు సమకూరుతాయి. మంచి చేకూరుతుంది' అన్నాడు.దానిని ఒక కాగితంలో రాసివ్వమన్నాడు వసుమంతుడు.
కళావంతుడు ఒక కాగితంలో ఒక పద్యాన్ని ఇలా రాసిచ్చాడు.
“వినడగు నెవ్వరు చెప్పిన
వినినంతనే వేగిర పడక వివరింపదగున్
కనికల్ల నిజము తెలిసిన
మనుజుడెపో నీతిపరుడుమహిలోసుమతీ ...!”
       దాన్ని ఒక మెరిసే కత్తి ఉన్న వరలో పెట్టుకుని తన వెంట తీసుకెళ్లాడు. దేశంలో
ఉన్న పుణ్యతీర్థాలు చూసుకుంటూ గంగానది చేరుకున్నాడు. గంగలో స్నానం చేసి తాను వెళ్లాల్సిన ఫ్రెంచి (ఫ్రాన్స్) దేశానికి సముద్రయానం ద్వారా పయనమైనాడు. అక్కడికి వెళ్లిన తరువాత అక్కడి విశేషాలను, వింతలను చూస్తూ కొంత కాలం గడిపాడు.
ఆ దేశరాజు దగ్గర తీసుకొచ్చిన వస్తువుల గురించి సంప్రదించాడు. తన రాజు ఇచ్చిన కానుకలను ఆ రాజుకు సమర్పించినాడు.
రకరకాల రత్నాలు, ఏనుగులు, గుర్రాలు, సుగంధద్రవ్యాలు ఇలా ఎన్నో వస్తువులను తను తెచ్చిన ఓడలోకి ఎక్కించినాడు.

  అప్పటికి ఇరవై సంవత్సరాలు పూర్తయ్యాయి. 
 
                         *   *   *

   ఇంటి దగ్గర తన భార్య ఎలా వుందో ఏమిటో అనే ఊహ వచ్చేసరికి ఇంటికి వెళ్లాలన్న ఆతృత పెరిగింది.
        స్వదేశానికి రాగానే రాజుకు ఇవ్వాల్సిన వస్తువులు, కానుకలు నెమ్మదిగా ఇద్దాంలే
అనుకుంటూ ఇంటికి బయలుదేరినాడు.
      తన వీధి రూపురేఖలు గుర్తుపట్టలేనంతగా మారిపోయాయి. తన ఇల్లు కనుక్కోవడమే గగనమైంది. తన గృహం లాంటి ఇళ్లు చాలా వెలిశాయి. చివరకు తాను కట్టుకున్న విశాలమైన భవనంకు చేరుకున్నాడు.
వసుమంతుడు తన భార్యను చూడాలన్న ఆనందంతో, ఆతృతతో ఇంట్లోకి ప్రవేశించాడు. అప్పటికి చాలా పొద్దుపోయింది. పరిచారికలు కొద్ది మంది మాత్రమే మేల్కొని వున్నారు. అమ్మగారు తన శయనమందిరములో
నిద్రపోతున్నారని వాళ్ళు చెప్పినారు.
నేరుగా శయనమందిరంలోకి వెళ్లాడు. అక్కడి దృశ్యం అతనికి ఆందోళనను, కోపాన్ని, ఉద్రేకాన్ని తెచ్చింది. శయనమందిరంలో తన భార్య ఒక యువకునితో నిద్రిస్తోంది. ఇది చూచి ' తాను లేనప్పుడు తన భార్య వేరొకరితో
సంసారం చేస్తున్నట్లుంది. ఆడవాళ్ళంతా ఇంతే. వీళ్ళంతా మోసగాళ్ళే. తాను ఫ్రెంచి దేశంలో ఎంత మంది ఆడవాళ్ళను చూడలేదు. ఇక్కడా ఇంతే గదా! దీన్ని చంపినా పాపం లేదు ' అనుకుంటూ క్షణికావేశంలో ఆమెను చంపడానికి ఒరలో ఉన్న కత్తిని బయటకు తీసినాడు. ఆ ఒరలో తన మిత్రుడు కళాకాంతుడు రాసిచ్చిన కాగితం జారి కిందపడింది.
      ఆ అలికిడికి ఆమె కొంచెం కదిలింది.    
      
      వసుమంతుడు కిందపడిన కాగితాన్ని తీసుకుని గది బయటకువచ్చాడు.  కాగితాన్ని చూచి ఏమిటా అనుకుంటూ దాన్ని తెరచి చూచినాడు. గది బయటున్న వెలుగులో దాన్ని చదివినాడు. అందులో కళావంతుడు రాసిచ్చిన ‘ వినదగునెవ్వరు పద్యం' చూచి తాను బయలుదేరేటప్పుడు కళావంతుడు చెప్పిన విషయం స్ఫురణకు వచ్చింది. వెంటనే తన ఆవేశం తగ్గిపోయింది. ఉదయాన్నే ఈమె కథేంటో తెలుసుకుందామని ఏమీ ఎరుగనట్లు
వెళ్లిపోయాడు.
         మరుసటి రోజు రాజుకు ఇవ్వాల్సిన కానుకలు, వస్తువులు సమర్పించాడు.
అక్కడి విశేషాలను, వింతలను ఆయనకు పూసగుచ్చినట్లు చెప్పినాడు వసుమంతుడు. 
       రాజు చాలా సంతోషంతో అతన్ని విలువైన ఆభరణాలతో సత్కరించాడు.తమ దేశానికి పరదేశంలో కీర్తి తెచ్చిన వ్యక్తిగా ప్రశంసిస్తూ అతనికి ' కీర్తిచక్ర'  అనే బిరుదునిస్తున్నట్లు సభలో ప్రకటించాడు.రాజుకు వీడ్కోలు పలికి తిరిగి ఇంటికివచ్చాడు వసుమంతుడు. 
        ఇంటికి రాగానే ఆయన భార్య సర్వాంగ శోభితురాలై తన కుమారుడు, బంధువులు,
పురోహితులతో కలిసి అతనికి ఆహ్వానం పలికింది.
         కుమారుడు వసంత్ ను భర్తకు పరిచయం చేసింది. 'తాను రాత్రి చూచింది ఇతనినేకదా ! అయ్యో ఎంత తప్పుగా తన భార్యను ఊహించుకున్నాను' అని మనసులో మదనపడినాడు.
        ఇంతలో తన మిత్రుడు కళావంతుడు కలుగుజేసుకొని 'వసుమంత్,మీరు  విదేశీయానానికి పయనమైనపుడు మీ భార్య గర్భవతి అనే విషయం మరచిపోయిన ట్లున్నారు. ఆమెకు సుఖప్రసవం జరిగి మగపిల్లవాడిని ప్రసవించింది. అతనికి వసంత్ అని నేనే పేరు పెట్టాను. ఇప్పుడు ఈ అబ్బాయి
చాలా విద్యలు నేర్చుకొని యుక్త వయస్సుకు వస్తున్నాడు. ఇంక ఇతనికి వ్యాపార మెలకువలు మీరే నేర్పాలి' అని అన్నాడు.
        తన భార్యను శంకించినందుకు మనసులో పశ్చాత్తాప పడుతూమనసులోనే భగవంతుని క్షమాపణలు వేడుకుంటూ ఆనందంతో కుమారున్ని కౌగలించుకున్నాడు.

      చిలుక  కథంతా చెప్పి "ప్రభా! విన్నావుగా! ఉన్నట్లుండి నీ మొగుడు మనసుపుట్టి ఏ అర్థరాత్రో వసుమంతునిలాగా ఇంటికి వస్తే ఆ సమయంలో నీవు ఇంటిలో లేకపోతే, ఎక్కడికి పోయినావని చెపుతావు?" అనడిగింది. 
       ‌ఏమి చెప్పాలో పాలుపోక ప్రభావతి మౌనం పాటించింది.
      కథ ముగిసేసరికి తెల్లవారిపోయింది.  
      తెల్లవారడంతో పల్లవి 'ఇంకేంపోతామమ్మా, కథతోనే రాత్రంతా కరిగిపోయింది. రేపు పోదాంలే' అంది. 
        చిలుక నిద్రకుపక్రమించింది.

Comments

Popular posts from this blog

ఇండియాలో_ఆక్సిజన్_వదిలే_ఆవులున్నాయా

Control over NSE